తెలంగాణలో బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు – ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా అందించనున్నారు.
“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు” పథకంలో భాగంగా మొదటి విడతలో తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్ల చొప్పున అందించనున్నారు.
అర్హతలు
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ మహిళ అయి ఉండాలి.
- వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
- స్వయం ఉపాధి పొందేందుకు ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరికి మొదటి ప్రాధాన్యత ?
- వికలాంగ మహిళలు
- వితంతువులు
- ఒంటరి మహిళలు
- అనాథ మహిళలు
- కుట్టు పనిలో అనుభవం ఉన్న మహిళలు
దరఖాస్తు తేదీలు
అర్హులైన బీసీ మహిళలు 15 ఆగస్టు 2026 నుంచి 15 సెప్టెంబర్ 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన మహిళలను పరిశీలించి లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం (ఆప్షనల్)
- కుట్టు శిక్షణ సర్టిఫికేట్ (ఆప్షనల్)
- పాస్‌పోర్టు సైజు ఫోటో
మహిళలకు స్వయం ఉపాధికి అవకాశం
ఈ పథకం ద్వారా ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ పొందిన మహిళలు ఇంటి వద్ద నుంచే కుట్టు పనులు చేసుకుంటూ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి మరియు ఆర్థిక సాధికారత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ఉంది.

Social Plugin