శాఖాహారం - విటమిన్లు

 శాఖాహారం -  విటమిన్లు 

    ఒకానొక అడవికి రాజు సింహాం. అది మాంసాహారం తప్ప శాఖాహారం తినేది కాదు. ఆ అడవిలో రకరకాల పండ్లు, ఆకు కూరలు ఉండేవి. కానీ వాటి వైపు అస్సలు చూసేది కాదు. తింటే మాంసమే తినాలకునేది. శాఖాహారం తినే జీవుల్ని చిన్నచూపు చూసేది. 

ఆ అడవిలో ఓ కోతి కొత్తగా భోజనశాల ఏర్పాటు చేసింది. దీన్ని మృగరాజు సింహంతోటి ప్రారంభం చేయించాలనుకుంది. సింహాం గుహకు వెళ్లి ‘ మృగరాజ ’ నేను కొత్తగా భోజనశాల ఏర్పాటు చేశాను. రేపు మీ చేతులతో ప్రారంభించి, నన్ను దీవించండి ’ అంది. ‘ అలాగే తప్పకుండా మంచి విందు ఇవ్వాలి. నాతో పాటు పులి, నక్క కూడా వస్తాయి ’ అంది సింహాం. ‘ తప్పకుండా మృగరాజా’ అంది కోతి. 

మరుసటి రోజు మృగరాజు .. పులి నక్కలతో కలిసి భోజనశాలకు వెళ్లింది. కోతి కొత్తగా ఏర్పాటు చేసిన భోజనశాల ప్రారంభించింది. కోతి చాలా సంతోషించింది. ‘ మృగరాజా ! మీ పరివారంతో మా విందు స్వీకరించి వెళ్లండి ’ అంది కోతి. పులి, నక్కలతో విందుకు కూర్చుంది సింహాం. కానీ సింహానికి ఎక్కడా మాంసం వాసన కానీ, మసాలా వాసన కానీ రాలేదు. కోతి కళ్లలోకి చూస్తూ ‘ మిత్రమా ! ఈ రోజు ప్రత్యేక వంటలేమిటి ? ’ అని అడిగింది సింహం. అరిటాకులు పరుస్తూ .. ‘ గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం’ అంది కోతి. ఆ మాటకు సింహం అదిరిపడిరది. మాంసాహారం తిందామని ఆశతో వచ్చిన సింహనికి నిరాశే ఎదురయ్యింది. చేసేది ఏమి లేక ‘ నేను ఈ రోజు పూజలో ఉన్నాను. రెండు పళ్లు తిని కొద్దిగా పాలు మాత్రమే తాగుతాను’ అంది. కానీ పులి, నక్క లొట్టలేసుకుని విందారగించాయి. ఆ రెండూ ‘ గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం.. అద్భుతంగా ఉన్నాయని కోతిని మెచ్చుకున్నాయి. కానీ కోతికి సింహం తినలేదని బాదేసింది. అందుకే ‘ మృగరాజా ! వీలు చూసుకొని మరోసారి భోజనాకికి తప్పక రావాలి. మీ రాకకోసం ఎదురుచూస్తుంటాను’ అంది కోతి. తప్పకుండా వస్తాను అని చెప్పి ఆకలితోనే వెనుదిరిగింది సింహం.

కొద్దిరోజులకు సింహం ఆరోగ్యం క్షీణించింది. తన శరీరం మీదీ అందమైన జూలు రాలసాగింది. కళ్లు మసకబారాయి. కొద్దిదూరం పరిగెత్తె సరికి ఆయాసం రాసాగింది. దంతాలు కూడా కదలసాగాయి. వైద్యుడు ఎలుగుబంటి.. మృగరాజును అన్ని కోణాల్లో పరీక్షించింది. ‘ రాజా ! విటమిన్ల లోపం వల్ల మీకీ సమస్య వచ్చింది. మాంసాహారంతో పాటుగా శాఖాహారం కూడా తినాలి. మాంసం, గుడ్లు, చేపలతో పాటు పాలు, పండ్లు, పప్పుధాన్యాలు కూడా తినండి త్వరలోనే కోలుకుంటారు ’ అంది ఎలుగుబంటి. ఇన్నాళ్లూ తన శాఖాహారాన్ని పక్కన పెట్టడం వల్లనే తనకీ అవస్థ వచ్చిందని తెలుసుకుంది సింహం. అప్పుడే కోతి భోజనశాల గుర్తొచ్చింది. వెంటనే తన పరివారంతో గారెలు, బూరెలు, పాయసం, పరమాన్నం తినడానికి వస్తున్నామని కోతికి కబురు పెట్టింది సింహం. ఆ రోజు నుండి సింహం ఇంకెప్పుడు శాఖాహర జీవులను చిన్నచూపు చూడలేదు.

!! సర్వేజన సుఖీనోభవంతు !! 

Post a Comment

0 Comments