మేలుకొలుపు
పూర్వం అవంతీ రాజ్యాన్ని విష్ణువర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన మంచి అందగాడు. ఆయన తన అందాన్ని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయేవాడు. దాన్ని ఆసరాగా చేసుకొని అధికారులు, ఇతర ఉద్యోగులు రాజుగారిని ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకుంటూ ఉండేవారు.
ఒకరోజు ఓ అధికారి ‘ ప్రభూ ! మిమ్మల్ని బ్రహ్మ తన శక్తి యుక్తులన్ని దారబోసి సృష్టించాడు. అందులో సందేహమే లేదు. ప్రపంచంలో ఇంతటి అందం కలిగిన మరోకరు ఉంటారని మేము ఉహించము’ అన్నారు. తనేం తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి .. మరొక రాజోద్యోగి ‘ ఇలాంటి అందగాడు .. ఒకప్పుడు ఈ భూమ్మిద పుట్టి పెరిగాడంటే రాబోయే తరాలవారు నమ్మరు. అందుకని మనం రాజ్యం అంతా మీ శిల్పాలు చెక్కించి వీధుల మద్యలో ఉంచితే అందరూ కళ్లారా చూసి మీ అందాన్ని వేనోళ్లతో కీర్తిస్తారు. అన్నాడు. ఆ మాటలతో రాజు ఆనందపడిపోయాడు. వెంటనే రాజ్యంలోని శిల్పులందరిని పిలిపించాడు. ఆగమేఘాల మీద తన రూపంతో శిల్పాలు చెక్కమన్నాడు. వారికి తగిన జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. వాళ్లు రాత్రింబవళ్లు పనిచేసి, రాజు చెప్పిన పనిపూర్తి చేసి రాజ్యం అంతటా వీధుల మద్యలో విగ్రహాలను నిలబెట్టారు.
తర్వాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన రాజ్యంలోని గూఢచారులను పిలిచి విగ్రహాలను చూసిన ప్రజలు తన గురించి, తన అందచంందాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని రమ్మన్నాడు. వాళ్లు వెళ్లి రాజ్యంలో తిరగసాగారు. ఒకచోట విగ్రహాలను ఉద్దేశించి ఇద్దరు.. ‘విగ్రహాలను శిల్పులు అద్భుతంగా చెక్కారురా. వాళ్ల ప్రతిభను మనం వేనోళ్లు కీర్తించినా తనివి తీరదు. అసలు విషయం ఏంటంటే చాలా రోజులుగా మన రాజ్యంలో ప్రతిభావంతులైన శిల్పులు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. రాజుగారి అందం సంగతి దేవుడెరుగు, కానీ వాళ్లకు కొంత ఉపాధి దొరికింది. అదే పదివేలు. ఇందుకు మనం రాజుగారికి కృతజ్ఞతలు తెలపాలి’ అంటూ మాట్లాడుకుంటున్నారు. మరోచోట ‘ అందం శాశ్వతమా .. రాజు గారి పిచ్చిగానీ, ఏమయితేనేం రాళ్లు తొలిచేవారి దగ్గర నుండి శిల్పులదాకా అందరికి బతుకుదెరువు దొరికింది. అంతేచాలు ’ అని అనుకుంటున్నారు. ఇదంతా విన్న గూడచారులు రాజుగారి దగ్గరకు వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్లు చెప్పారు. అది విన్న రాజు ‘ నా అందచందాల గురించి ఒక్కరూ మాట్లాడలేదా’ అంటూ నీరసంగా వాళ్లను ప్రశ్నించాడు. ‘ లేదు ప్రభూ .. ! అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరూ విమర్శించలేదు. పైపెచ్చు చాలామందికి బతుకుదెరువు చూపించారని పొగిడారు ’ అన్నారు ఆ గూడచారులు. రాజుకు వారి మాటలు నిరాశ కల్గించాయి. కానీ ఆలోచనలు రేకెత్తించాయి. అధికారులు, రాజోద్యోగులు ఇంతకాలం పొగడ్తలతో తనను తప్పుదోవ పట్టించారు. ‘ ప్రజలు రాజు అందచందాల గురించో, రాజు భోగ భాగ్యాల గురించో మాట్లాడుకోరు. ఏ విధంగానైనా వాళ్లకు మేలు కలిగితే ఆనందిస్తారు. ప్రశంసిస్తారు. అంతేతప్ప వారికి రాజుగారి వ్యక్తిగత గొప్పలతో పనిలేదు’ అని ఆలస్యంగా తెలుసుకున్నాడు. రాజు.
ఇక ఆలస్యం చేయకూడదు. తప్పు సరిదిద్దుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. పొగడ్తలకు పొంగే గుణాన్ని వదిలి పెట్టాడు. ప్రజలకు మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. తరతరాలు తనను ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రజల బాగోగులు చూస్తూ తన శరీరంతో పాటు మనసూ అందమైనదని రుజువె చేసుకున్నాడు.
0 Comments