General Science : Kidney Structure and Urine Formation in Human Excretory System in Telugu
మానవ విసర్జన వ్యవస్థ
జీవక్రియల ఫలితంగా శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను శరీరం వెలుపలికి పంపే ప్రక్రియను విసర్జన అంటారు. మన శరీరంలో ఈ ప్రక్రియను నిర్వహించే అవయవాల సమాహారాన్ని మానవ విసర్జన వ్యవస్థ అంటారు.
మానవ విసర్జన వ్యవస్థ భాగాలు
- ఒక జత మూత్రపిండాలు : ఇవి ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమ దానికంటే కొద్దిగా కింద భాగంలో ఉంటుంది.
- ఒక జత మూత్రనాళాలు : మూత్రపిండాలలో ఏర్పడిన మూత్రాన్ని మూత్రాశయానికి చేరవేస్తాయి.
- మూత్రాశయం : ఇది మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేసే సంచి వంటి నిర్మాణం. దీని సామర్థ్యం సుమారు 300 నుండి 800 మి.లీ వరకు ఉంటుంది.
- ప్రసేకం : దీని ద్వారా మూత్రం శరీరం వెలుపలికి విసర్జించబడుతుంది.
మూత్రపిండం అంతర్నిర్మాణం
మూత్రపిండాన్ని నిలువుగా కోసి పరిశీలిస్తే రెండు ప్రధాన భాగాలు కనిపిస్తాయి.
- పల్కలం : ఇది వెలుపల భాగంలో ఉండే ముదురు ఎరుపు రంగు ప్రాంతం.
- దవ్వ : ఇది లోపలి భాగంలో ఉండే లేత రంగు ప్రాంతం.
నెఫ్రాన్
మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు. ప్రతి మూత్రపిండంలో సుమారు 1.3 నుండి 1.8 మిలియన్ల నెఫ్రాన్లు ఉంటాయి.
మాల్ఫీజియన్ దేహం
ఇందులో బౌమన్స్ గుళిక మరియు రక్తకేశనాళికా గుచ్ఛం ఉంటాయి. ఈ భాగంలో రక్తం వడపోతకు గురవుతుంది.
వృక్కనాళిక
వృక్కనాళికలో సమీపస్థ సంవళితనాళం, హెన్లీ శిక్యం మరియు దూరస్థ సంవళితనాళం ఉంటాయి.
మూత్రం ఏర్పడే విధానం
మూత్రం ఏర్పడే ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది.
1. గుచ్ఛగాలనం
ఇది మూత్రం ఏర్పడటంలో మొదటి దశ. అభివాహి ధమని ద్వారా రక్తం అధిక పీడనంతో మాల్ఫీజియన్ దేహంలోని రక్తకేశనాళికా గుచ్ఛంలోకి ప్రవేశిస్తుంది. ఈ పీడనం కారణంగా రక్తం వడపోతకు గురై గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నీరు మరియు లవణాలు కలిగిన ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. అయితే రక్తకణాలు మరియు పెద్ద ప్రోటీన్ అణువులు వడపోతకు గురికావు.
2. వరణాత్మక పునఃశోషణం
ప్రాథమిక మూత్రం మూత్రనాళిక ద్వారా ప్రవహిస్తున్న సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రాథమిక మూత్రంలో శరీరానికి అవసరమైన గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు వంటి పదార్థాలు ఉంటాయి. మూత్రనాళిక చుట్టూ ఉన్న రక్తకేశనాళికలు ఈ ఉపయోగకరమైన పదార్థాలను తిరిగి రక్తంలోకి శోషించుకుంటాయి.

0 Comments