Indian Election Commission
Indian Polity : Election Commission of India Notes in Telugu | Structure, Powers & Functions

కేంద్ర ఎన్నికల సంఘం 

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థే కేంద్ర ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు.

కేంద్ర ఎన్నికల సంఘం 25 జనవరి 1950న ఏర్పాటైంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.

ఎన్నికల సంఘం నిర్మాణం :

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2) ప్రకారం ఈ సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.

ఇతర కమిషనర్లు నియమితులైనప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనంగా ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం సలహాతో రాష్ట్రపతి నియమించవచ్చు.

నియామకం మరియు పదవీకాలం :

ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల నియామకం పార్లమెంట్ రూపొందించిన చట్టాల ప్రకారం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు ఉంటుంది.

ఎన్నికల కమిషనర్లు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

జీతభత్యాలు :

ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్లకు సమాన అధికారాలు, సమాన జీతభత్యాలు ఉంటాయి. వీరి వేతనాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా ఉంటాయి. జీతభత్యాలు భారత కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి.

తొలగింపు విధానం :

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానంతో సమానంగా ఉంటుంది. పార్లమెంట్‌లో రెండు సభలు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆయనను పదవి నుండి తొలగించగలరు.

లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ తీర్మానం అమల్లోకి రాదు. ఈ సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉండదు.

ఇతర ఎన్నికల కమిషనర్లను అసమర్థత లేదా దుర్వ్యవహారం వంటి కారణాలతో కేంద్ర మంత్రివర్గం సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలు మరియు విధులు :

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

  • ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడం
  • ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడం
  • సాధారణ, మధ్యంతర మరియు ఉప ఎన్నికలు నిర్వహించడం
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం
  • రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం మరియు ఎన్నికల గుర్తులు కేటాయించడం
  • రాజకీయ సభలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడం
  • ప్రజాప్రాతినిధ్య చట్టాలను అమలు చేయడం
  • అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించడం
  • అనర్హ అభ్యర్థులను తిరస్కరించడం
  • ఎన్నికల ఖర్చులపై పర్యవేక్షణ చేయడం
  • దూరదర్శన్ మరియు రేడియోల్లో ప్రచార సమయాన్ని కేటాయించడం
  • అవసరమైతే రీపోలింగ్ నిర్వహించడం
  • ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించడం
  • విజేతలకు ఎన్నికల ధ్రువపత్రాలు జారీ చేయడం