శ్రీనివాస రామానుజన్ – జీవిత చరిత్ర | గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలు
శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. గణిత శాస్త్రంలో అధికారిక శిక్షణ లేకపోయినా, ఆయన సంఖ్యా సిద్ధాంతం (Number Theory), గణిత విశ్లేషణ (Mathematical Analysis), అనంత శ్రేణులు (Infinite Series), భిన్నాలు (Continued Fractions) వంటి విభాగాల్లో అసాధారణమైన పరిశోధనలు చేశారు. స్వయంకృషితోనే క్లిష్టమైన సమస్యలకు కొత్త పరిష్కార మార్గాలను కనుగొని, గణిత ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.
బాల్యం & విద్యాభ్యాసం :
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. 1892లో స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను ప్రారంభించారు. అనంతరం కుంభకోణంలోని టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఈ దశలోనే ఆయనకు గణితం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.
సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సూత్రాలు, విధానాలను స్వయంగా నేర్చుకున్నారు. స్థానిక గ్రంథాలయాల్లో లభ్యమయ్యే గణిత పుస్తకాలను నిరంతరం అధ్యయనం చేయడం ఆయన దినచర్యగా ఉండేది. చిన్న వయసులోనే ఆయిలర్ సూత్రాలు, త్రికోణమితి సంబంధిత సూత్రాలను స్వయంగా అవగాహన చేసుకున్నారు. సంఖ్యల నమూనాలు (Number Patterns) ఆయనను అత్యంత ఆకర్షించాయి.
గణిత శాస్త్రానికి చేసిన కృషి :
రామానుజన్ గణిత శాస్త్ర అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా
- నంబర్ థియరీ (Number Theory)
- మాక్ తీటా ఫంక్షన్స్ (Mock Theta Functions)
- అనంత శ్రేణులు (Infinite Series)
- మ్యాజిక్ స్క్వేర్‌లు (Magic Squares)
వంటి అంశాలలో ఆయన చేసిన పరిశోధనలు నేటికీ గణిత శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆయన ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాలపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
శ్రీనివాస రామానుజన్ 1920 ఏప్రిల్ 26న మరణించారు. అయితే ఆయన గణితానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. రామానుజన్ గణిత సేవలను గౌరవిస్తూ భారత ప్రభుత్వం 2012 సంవత్సరాన్ని ‘జాతీయ గణిత సంవత్సరం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ‘జాతీయ గణిత దినోత్సవం (National Mathematics Day)’గా నిర్వహిస్తున్నారు.

0 Comments