
తెలంగాణ అడవులు
TELANGANA FOREST INFORMATION IN TELUGU
తెలంగాణ రాష్ట్రంలో ఆయనరేఖ అడవులు కలవు. భారతదేశంలోని అడవులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని అడవులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 1800లకు పైగా చెట్లను ఆయుర్వేదం, మూలికా వైద్యంలో వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడవులు 26,969.54 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు మొత్తం తెలంగాణ భూభాగంలో 24.05 శాతం కల్గి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వు ఫారెస్టు 76.65 శాతం, రక్షిత అడవులు 22.07 శాతం, వర్గీకరించని అడవులు 2.28 శాతంగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అడవుల విస్తీర్ణం కల్గిన జిల్లాలు 1) భద్రాద్రి కొత్తగూడెం 2) ములుగు 3) కొమురభీమ్ 4) నాగర్‌కర్నూల్ 5) మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. తక్కువ అడవులు విస్తీర్ణం ఉన్న జిల్లాలు 1) హైద్రాబాద్ 2) కరీంనగర్ 3) జోగులాంబ గద్వాలు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు హరిత హార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి తద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ముందుకు పోతుంది.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని మార్చి 3న జరుపుకుంటారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5 జరుపుకుంటారు. ప్రపంచ జీవవైవిద్య (బయోడైవర్సీటి) దినోత్సవాన్ని మే 22న జరుపుకుంటారు.
తెలంగాణలో అడవులను నాలుగు రకాలుగా విభజించారు
1) ఆయనరేఖ ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు :
ఈ అడవులు 125 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాపాతం పడే ప్రాంతాలలో ఇవి విస్తరించి ఉంటాయి. భారతదేశంలో పశ్చిమ కనుమల్లో మరియు ఈశాన్య భారతదేశంలో మినహ మిగిలిన అని ప్రదేశాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ రకం అడవులు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో అధికంగా ఉన్నాయి. ఇవి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో ఈ రకం అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ రకం అడవులలో సాలు, టేకు, వెదురు, రోజ్‌ఉడ్ వంటివి ముఖ్యమైన చెట్లుగా ఉన్నాయి. వీటితో పాటు బీడి తయారికి అవసరమయ్యే టెండు ఆకులు కూడా అడవుల్లో లభిస్తాయి.
2) ఆయనరేఖ అనార్ధ్ర ఆకురాల్చు అడవులు :
75 నుండి 100 సెంటీమీటర్లు వర్షపాతం పడే ప్రాంతాలలో ఈ ఆయనరేఖ అనార్ధ్ర ఆకురాల్చు అడవులు విస్తరించి ఉంటాయి. ఈ రకం అడవులు ఈశాన్య భారతదేశంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఈ రకం అడవులు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, మెదక్, నల్గొండ, దక్షిణ వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ రకం అడవులలో సాలు, టేకు, వెదురు మరియు అకేసియా తరగతికి చెందిన వృక్షాలు ఉన్నాయి. టేక వృక్షాలు కరీంనగర్ జిల్లాలో అధికంగా ఉన్నాయి.
3) ఆయనరేఖ అనార్ధ్ర సతత హరిత అరణ్యాలు :
ఈ అడవులు సాధారణంగా స్వల్ప శీతాకాలం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఉద్భవిస్తాయి. ఇండియాలో ఈ రకం అడవులు కోరమాండల్ తీర ప్రాంతం, శివాలిక్ పర్వతాలు గుండా సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గోండ జిల్లాలలో 70 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఉన్నాయి.
4) ఆయనరేఖ ముళ్ల పొద అడవులు :
వర్షపాతం 50 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో విస్తరించి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిద్యం
- 2939 వృక్షజాతులు
- 365 పక్షిజాతులు
- 103 క్షీరధ జాతులు
- 28 సరీసృపాలు
- 21 ఉభయచర జీవులు ఉన్నాయి.
ఆరోగ్య ఆయుర్వేదంలో ఉపయోగించే మూలిక వృక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న మొత్తం వృక్షాలలో సాంప్రదాయ మరియు ఆయుర్వేద వైద్యానికి సంబందించినవి ఉన్నాయి. 2017 సంవత్సరం వరకు 151 జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనలో తెలపడం జరిగింది.
➪ నల్లమల అడవులు :
ఈ అడవులు తెలంగాణలో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో ఎర్రచందనం లభించే ఏకైక ప్రాంతంగా నల్లమల ఫారెస్టు పేరుగాంచింది. ఈ ఎర్రచందనం బహిరంగ మార్కెట్ అత్యధిక ఖరీదు కల్గి ఉన్నాయి. ఈ నల్లమల అడవులలో యూరేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్‌లో బయోడైవర్సిటి పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సు 2015 సంవత్సరంలో హైద్రాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఏర్పడిన అనంతరం జీవ వైవిద్య సంరక్షణ చట్టం 2002 సెక్షన్ 22 ప్రకారం తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటి బోర్టును హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసినారు.
2021 సంవత్సరంలో వెలువడిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఆయా రాష్ట్రాల అటవీ వైశాల్యంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 3.07 శాతం అటవీ సంపద వృద్దిని సాధించి తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అటవీ వైశాల్యం పరంగా తెలంగాణ రాష్ట్రం 632 చ.కి.మీ పెరుగుదలతో దేశంలో రెండవ స్థానంలో ఉంది. (మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది.) గత పది సంవత్సరాల వృక్ష సంపదను పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తే దేశంలో అన్ని ప్రధాన నగరాల కంటే హైద్రాబాద్ నగరంలో వృక్ష సాంద్రత 48.6 చ.కి.మీ పెరుగుదల నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది.
2019 అటవీ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20,582 చ.కి.మీ అటవీ భూమి కలదు. 2021 సర్వే ప్రకారం ఇది 21,214 కు చేరుకొని 3.07 శాతం వృద్ది సాధించింది.
తెలంగాణ రాష్ట్రంలో అటవీ వైశాల్యం పెరుగుదల దృష్ట్యా మద్యస్థ సాంద్రత అడవులలో 332 చ.కి.మీ పెరిగి మొదటి స్థానంలో ఉంది. తర్వాత బహిరంగ అడవులలో 284 చ.కి.మీ పెరిగి రెండవ స్థానంలో ఉండగా అత్యంత సాంద్రత అటవీ వైశాల్యం 16 చ.కి.మీ పెరిగి మూడవస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో 2011 నాటికి 1825 చ.కి.మీ ఉండగా, 2021 నాటికి 1706 చ.కి.మీ కు చేరుకొని 5 శాతం తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణలో లభించే అటవీ ఉత్పత్తులు
➪ వెదురు :
ఈ వెదురు మొక్క అతితక్కువ కాలంలో వేగంగా పెరిగే మొక్క. దీనికి ఇండ్లు కట్టుకోవడానికి, ఇండ్లలో వస్తువుల అలంకరణకు అధికంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా పేపర్ తయారీ పోలీసుల లాఠీల తయారికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పేదవాడ కలప అని పిలుస్తారు. ఈ వెదురు మొక్కలు ఖమ్మం జిల్లాలో అధికంగా విస్తరించి ఉన్నాయి.
➪ టేకు :
దీన్ని ప్రాక్ దేశపు రాజవృక్షం అని అంటారు. ఇది అత్యంత మన్నికైన కలపను ఇస్తుంది. ఇది ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతాలలో అధికంగా విస్తరించి ఉన్నాయి.
➪ సరివి (కాజురైనా) :
ఈ రకం మొక్కలు తెలంగాణలోని చవిటి నేలల ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది ఎడారి లక్షణం ఉన్న చెట్లు. దీన్ని టెంట్ కర్రలకు, ఇండ్ల నిర్మాణంలో సపోర్టుకు అధికంగా ఉపయోగిస్తారు.
➪ ఉసిరి - ఈ చెట్టు ఎడారి లక్షణం కల్గి ఉంది. ఈ చెట్ల ద్వారా సి విటమిన్ అధికంగా లభిస్తుంది.
➪ పుణికి చెట్టు - ఈ చెట్లను నిర్మల్ కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగిస్తారు
➪ రూసా గడ్డి - ఈ రకం గడ్డిని సెంట్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
➪ తుంగ గడ్డి - ఈ రకం గడ్డిని తుంగచాపల తయరీలో అధికంగా ఉపయోగిస్తారు.
➪ బీడి ఆకులు - దీనిని బీడిలు తయారు చేయడానికి అధికంగా ఉపయోగిస్తారు. దీనినే తునికాకు , తెండు ఆకు అని కూడా పిలుస్తారు.
➪ విప్ప పువ్వు - దీన్ని సారా తయారీకి ఉపయోగిస్తారు.
➪ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అడవుల విస్తీర్ణం కల్గిన జిల్లాలు
1) భద్రాద్రి కొత్తగూడెం
2) ములుగు 3) కొమురభీమ్
4) నాగర్‌కర్నూల్
5) మంచిర్యాల
➪ తెలంగాణ రాష్ట్రంలో తక్కువ అడవులు విస్తీర్ణం ఉన్న జిల్లాలు
1) హైద్రాబాద్
2) కరీంనగర్
3) జోగులాంబ గద్వాలు జిల్లాలు ఉన్నాయి.
➪ తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం అధికంగా ఉన్న జిల్లాలు
1) ములుగు (71.81%)
2) భద్రాద్రి కొత్తగూడెం (60.95%)
3) కొమురంభీమ్ (54.41%)
4) జయశంకర్ భూపాల పల్లి (51.57%)
5) మంచిర్యాల (45.17%)
➪ తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం తక్కువ ఉన్న జిల్లాలు
1) కరీంనగర్ (0.15%)
2) జోగులాంబగద్వాల్ (0.29%)
3) హైద్రాబాద్ (0.80)
4) జనగాం (1.22%)
5) హన్మకొండ(2.35%)
➪ బయోసాట్ :
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం వన్యప్రాణి అభయారణ్యాలలో సంరక్షణ చర్యలు చేయడానికి బయోడైవవర్సిటి కన్జర్వేషన్ సోసైటీ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసింది.
➪ అటవీ నియంత్రణ చట్టం 2006 :
దీని ప్రకారం షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టంను ఆమోదించింది. షెడ్యూల్డ్ మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు అటవీ భూమిని కల్గి ఉండే హక్కును మరియు నివసించే హక్కును, అలాగే ఏదైనా కమ్యూనిటీ ఫారెస్టును రక్షించడం, పునరుత్పత్తి చేయడం లేదా సంరక్షించడం లేదా నిర్వహించడం వంటి హక్కులను కల్పిస్తుంది.
➪ అటవీ పరిహార ప్రణాళిక మరియు నిర్వహణ సంస్థ :
భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 2014 లో తెలంగాణ రాష్ట్ర పరిహార అటవీ నిర్మూలన నిధి నిర్వహణ మరియు ప్రణాళిక ప్రాదికార సంస్థ ఏర్పాటు చేసింది. ఇది అటవీయేతర ఉపయోగాలకు మళ్లించిన అటవీ భూమికి పరిహరంగా అటవీ పెంపకం మరియు పునరుత్పత్తి కార్యాకలాపాలను ప్రొత్సహిస్తుంది.
అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2016 ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఫారెస్టు అకాడమీ అటవీ అధికారులకు శిక్షణ ను అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ కలప ఆధారిత పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా తోటలను పెంచే లక్ష్యంతో ఉద్దేశించింది.
జీవవైవిద్య యాక్టు 2002 చట్టం ను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుంది.
భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ చొరవతో స్వదేశ్ దర్శనే పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యావరణ పర్యాటక (ఈకో టూరిజం) సర్య్కూట్ ఏర్పాటు చేసింది. దీని కేంద్రం శ్రీశైలం.
- తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్రం వృక్షం - జమ్మిచెట్టు (ప్రొసోపిస్ సినేరరియ)
- రాష్ట్ర పుష్పం - తంగేడు (కేస్సియ ఆరిక్యులేట)
- రాష్ట్ర ఫలం - సీతాఫలం (అనోనస్క్వామోస)
- రాష్ట్రపక్షి - పాలపిట్ట (కొరాసియస్ బెంగాలెన్సిస్ )
- రాష్ట్ర జంతువు - జింక (ఆక్సిస్ ఆక్సిస్)
➪ తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ పార్కులు :
1) కాసుబ్రహ్మనందారెడ్డి పార్కు (హైద్రాబాద్)
2) మృగవాని జాతీయ పార్కు (రంగారెడ్డి)
3) మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు (రంగారెడ్డి) - జింకలు
సంరక్షణ కేంద్రాలు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | మగ్గర్ మొసళ్లు, తాబేల్లు, పక్షులు | సంగారెడ్డి, | ||||||
పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | నాలుగు కొమ్ముల జింకలు, పక్షులు | కామారెడ్డి మెదక్ | ||||||
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం | పులులు, నీల్గాయి | నిర్మల్, అదిలాబాద్ | ||||||
శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం | మగ్గర్ మొసళ్లు | మంచిర్యాల, పెద్దపల్లి | ||||||
ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | కృష్ణజింకలు | మంచిర్యాల | ||||||
ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | అడవి దున్నలు | జయశంకర్ భూపాల పల్లి | ||||||
పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | అడవి దున్నలు | మహబూబ్ నగర్, వరంగల్ | ||||||
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | అడవి దున్నలు, జింకలు | భద్రాద్రి కొత్తగూడెం | ||||||
అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం | పులులు, | నాగర్‌కర్నూల్, నల్గొండ |
0 Comments