
నిజాయితీతోనే విజయం Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
Telugu stories : సీతారామపురం అనే గ్రామంలో వెంకయ్య అనే ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిజాయితీ పరుడు. ప్రతిరోజూ ఊరి సమీపంలోని అభయారణ్యంలోకి వెళ్లి కట్టెలు కొట్టి, వాటిని తీసుకొచ్చి సంతలో అమ్మేవాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతోనే కుటుంబం గడిచేది. ఒకసారి వెంకయ్య ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో అడవికి వెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే అక్కడ ఆశ్రమం, అందులో ఒక మునిశ్వరుడు తపస్సు చేసుకుంటూ తారసపడతాడు. ఆ మునీశ్వరునితో మాట్లాడాలని చాలాసేపు అక్కడే ఉండి ఎదురుచూసాడు, ఆయన కళ్లు తెరవకపోవడంతో నమస్కారం చేసి తన పనికి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు అడవికి వెళ్లేటప్పుడు మునీశ్వరుని కోసం అరటిపండ్లు, అవుపాలు తీసుకెళ్లాడు వెంకయ్య. అప్పుడు కూడా ఆయన తపస్సులో ఉండడంతో వాటిని అక్కడే పెట్టేసి దిగాలుగా వెళ్లిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అనుకోకుండా ముని కళ్లు తెరచి ‘‘ నాయనా .. ఎవరు నువ్వు ? రోజు పాలు, పండ్లు ఎందుకు తీసుకొచ్చి నాకు పెడుతున్నావు ?’’ అని ప్రశ్నించాడు. ముందు ఆశ్వర్యపోయిన వెంకయ్య వెంటనే మునిశ్వరునికి నమస్కరించి తన గురించి వివరించాడు. ‘‘ మంచిది తూర్పు దిశగా ముందుకెళ్లు నీకు అంతా మంచే జరుగుతుంది.’’ అన్నాడు ముని.
ముని చెప్పిన మాట ప్రకారం వెళ్లిన వెంకయ్య ఒక చోట గంధపు చెట్లు కనిపించాయి. ఆ రోజు నుండి వాటిని విక్రయిస్తూ కాస్తు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. కుటుంబ సభ్యులంతా మూడు పూటలా తిండి తినగలిగారు. మునికి పాలు, పండ్లు ఇచ్చాకనే అడవిలోకి వెళ్లడం వీరయ్యకు దినచర్యగా మారింది. మరోసారి ఎప్పుడో ముని కళ్లు తెరిచినప్పుడు గంధపు చెట్లు కనిపించాయన్న విషయం చెప్పాడతడు. దానికి ఆయనేమీ బదువలివ్వలేదు సరికదా ఎగతాళిగా నవ్వాడు. ఆ నవ్వులో ఎదో అర్థం ఉందని గ్రహిస్తాడు వెంకయ్య.
‘‘తూర్పు దిక్కుగా వెళ్లమన్నాడు కానీ గంధపు చెట్ల వరకే అని చెప్పలేదు కదా.. ఇంకస్తా ముందుకెళ్దామని వెళ్లాడు వెంకయ్య. అక్కడ ఒక చెట్టు మొదట్లో వెండి నాణేలున్న సంచి కనబడిరది. అడవి దారిలో వెళుతుండగా.. ఏ వ్యాపారో పోగొట్టుకొని ఉంటాడనుకున్నాడు. అది తీసుకొని ఇంటికెళ్లి వాటిల్లో ఒక్కొ నాణేం అమ్ముకుంటూ కాలం గడపసాగాడు. అప్పటి నుండి కట్టెలు కొట్టడం మానేసి ఎండు పుల్లలు, నేలరాలిన పండ్లూ ఏరుకెళ్లేవాడు. వాటిని పేదలు, వృద్దులు, అనాథలు, దివ్యాంగులకు పంచేవాడు. ఇంకోసారి ముని కళ్లు తెరిచినప్పుడు వెండి నాణేలు సంగతి చెప్పాడతను. ఈ సారి కూడా ఒక నవ్వు నవ్వాడు ముని. అందులోనూ ఏదో భావం ఉన్నట్లు గ్రహించాడు వెంకయ్య. వెండి నాణేలు దొరికిన ప్రాంతం నుండి మరికొంత ముందుకెళ్లాడు. అక్కడో పెద్ద చెట్లు కింద వజ్రాల హారం, కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటిని చూడగానే.. వేట కోసం వచ్చి ఏ సింహానికో బలైన రాజు గారివని అనుకున్నాడు. వెంకయ్య. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. మరోసారి ముని కళ్లు తెరిచినప్పుడు ఆభరణాల గురించి చెప్పాడు వెంకయ్య. గతంలో లాగనే మళ్లీ నవ్వాడు ముని. ఈసారి మరింత ముందుకెళ్లిన వెంకయ్య అడవి అంతమై, ఓ నగరం కనబడిరది. అది ఆ రాజ్యపు రాజధాని నగరమనీ, ఆ రాజు గారు వేట కోసం వెళ్లి మరణించారని అక్కడి ప్రజలు అనుకోవడం విన్నాడు. నేరుగా కోటకు వెళ్లి యువరాజుని కలిశాడు. తనకి కొన్ని నగలు దొరికాయన్న సంగతి చెప్పి భటులన సాయం పంపితే వాటిని అప్పగిస్తానన్నాడు.
వెంకయ్య మాటలపై నమ్మకం ఉంచి కొందరు భటులను వెంట పంపాడా యువరాజు. వెంకయ్య ఇంట్లో భద్రపరిచిన నగలు రాజుగారివేనని నిర్ధారణ కావడంతో అతి నిజాయితీని మెచ్చుకున్న యువరాజు, కోట కాపాలాదారుడిగా ఉద్యోగం ఇచ్చాడు. త్వరలో వచ్చి పనిలో చేరతానని యువరాజు వద్ద అనుమతి పొంది మునిని కలిశాడు వీరయ్య. అదృష్టవశాత్తు ముని కళ్లు తెరిచి వీరయ్యను చూశాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా జరిగినదంతా వివరించాడు మునికి. ఈ సారి ఆయన నవ్వకుండా శెభాష్ అని మెచ్చుకున్నాడు. తూర్పు దిక్కుకి వెళ్లమన్నారు కానీ ఎంతదూరమో చెప్పలేదు. ముందే తెలిసి ఉంటే అప్పుడే నాకు కొలువు దొరికేది అంటూ వాపోయాడు వెంకయ్య. ‘‘బాదపడకు నాయనా .. ఎంత శ్రమకు అంత ఫలితమన్నారు పెద్దలు. ఆగిపోకుండా ప్రయత్నించావు కాబట్టే గంధపు చెక్కలు, వెండినాణేలు, బంగారు ఆభరణాలను దాటి కోటలో కొలువు పొందావు. మధ్యలోనే సంతృప్తి చెంది .. ఆగిపోయి ఉంటే ఆ గంధపు చెక్కలు అమ్ముకుంటూ బతకాల్సి వచ్చేంది. ఒకవేళ రాజుగారి నగలు సొమ్ము చేసుకుందామని అమ్మే ప్రయత్నం చేసినా పట్టుబడి జైలులో ఉండేవాడివి. నీ నిజాయితీనే నిన్ను కాపాడిరది. కొందరు కొంత వరకే ప్రయత్నించి ఆగిపోతారు. అలాంటివాళ్లు ఏదీ సాధించలేరు. చివరివరకూ ప్రయత్నించేవారు మాత్రమే గమ్యం చేరుతారు. అప్పుడే సంతృప్తి చెందావా అన్న ఉద్దేశ్యంతో ఎగతాళిగా నవ్వాను కాబట్టే మళ్లీ మళ్లీ ప్రయత్నించావు. ఇకముందు కూడా నమ్మకంగా పనిచేసి రాజు గారి మెప్పు పొందు అని దీవించాడు ముని. ఆయనకు ధన్యవాదాలు చెప్పి కొలువులో చేరడానికి కుటుంబాన్ని తీసుకొని రాజధాని నగరానికి వెళ్లాడు వెంకయ్య.
Moral : ప్రయత్నంతో ముందుకెళ్లి విజయం సాధించవచ్చు
0 Comments