
రెండూ సమానమే .. Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
Telugu Stories in Telugu : ఒకానొక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు వ్యవసాయ పనులు చేస్తు జీవించేవారు. వారిలో రాము నెమ్మదస్తుడు. సోము కూడా మంచివాడే కానీ కాస్త తొందరపాటు గుణం కల్గిన వాడు. ఒకే వీధిలో ఉంటారు. పైగా చిన్ననాటి నుండి మిత్రులు కావడంతో రోజు సాయంకాలం ఒకచోట చేరి కాలక్షేపం చేసేవారు. అలా ఒక రోజు సాయంత్రం ఇద్దరూ సోము ఇంటి అరుగుపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా.. వారి మాటల్లో ఊరి చివర కనబడుతున్న కొండ ప్రస్తావన వచ్చింది.
‘‘ ఆ కొండను చూశావా.. దాన్ని దాటి వెళితే సిరికొండ అనే ఊరు వస్తుందట. ఆ ఊరిలో చాలా ఆలయాలు ఉన్నాయని చెబుతుంటారు ’’ అన్నాడు రాము. సూర్యాస్తమయం వేళ మెరిసిపోతున్న ఆ కొండను చూస్తూ .. ‘‘ మరి ఆ కొండ దాటడం ఎలా ? అని అడిగాడు సోము. సన్నని కాలిబాట ఉందట.. మనం ఒక రోజు తెల్లవారు జామునే బయలుదేరామంటే ఎండెక్కేలోపు అటు చేరుతాం. మళ్లీ చీకటి పడేలోపు తిరిగి వచ్చేయగలం. ఒకసారి వెళ్లొద్దామా ? అన్నాడు రాము ఉత్సాహంగా. సోము కూడా సరదా పడడంతో తెల్లవారు జామున ప్రయాణం ఖాయమైంది. దారి ఖర్చుల కోసం డబ్బులు తీసుకొని ఇంటి నుండి బయలుదేరారు ఇద్దరు మిత్రులు.
దారిలోని దుకాణం దగ్గర ఆగి, చెరో రెండోందల రూపాయల చిల్లర అడిగారు. ఒక అయిదు రూపాయల నాణేల పొట్లం, ఒక అయిదు రూపాయల నోట్ల కట్టను బల్లపైన పెట్టి తీసుకోమన్నాడా దుకాణదారు. సోము ఆత్రంగా నోట్ల కట్ట అందుకున్నాడు. హమ్మయ్యా బరువు లేకుండా హాయిగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ గబగబా లెక్క పెట్టుకొని జేబులో పెట్టేసుకున్నాడు. మిత్రుడి సంగతి తెలిసిందే కదా అని ఇక ఆ పొట్లంలోని నాణేల లెక్క సరిచూసుకొని జేబులో వేసుకున్నాడు రాము.
ఇద్దరూ కొండ వైపుగా నడక ప్రారంభించారు. నాణేల పొట్లం ఉండడంతో రాము చొక్కా జేబు ఎత్తుగా కనబడసాగింది. నోట్ల కట్ట కావడంతో గోపికి ఏ ఇబ్బంది అనిపించలేదు. దీంతో కాస్త గర్వంతో ‘‘బరువుకు నడకలో వెనుకబడిపోతావేమో .. నేను కొంచెం నెమ్మదిగా నడుస్తాలే ’’ అంటూ మిత్రుడిని ఆటపట్టించాడు. కొంత సేపటి తర్వాత కొండను సమీపంచారు ఇద్దరు. ఇంతలోనే ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నల్లని మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. చిటపట చినుకులతో మొదలైన వాన, చూస్తుండగానే కుండపోతగా మారింది. స్నేహితులిద్దరు తడిసి ముద్దయ్యారు. కాసేపటి తర్వాత వాన తగ్గాగా చూస్తే సోము జేబులోని నోట్ల కట్ట తడిసిపోయింది. వాటిని జాగ్రత్తగా విడదీసి ఆరబెట్టకపోతే చిరిగిపోయేలా ఉన్నాయి. తన జేబులోని పొట్లం తీసి చూసుకున్నాడు రాము. నాణేలు తడవడంతో మెరస్తూ చక్కగా కనిపించసాగాయి. ఆ క్షణంలో ‘‘ నేను అనవసరంగా నోట్లు అందుకున్నాను. నాణేల పొట్లమే తీసుకోవాల్సింది ’’ అని బాదపడుతూ తనను తాను తిట్టుకోసాగాడు సోము. మబ్బులు తొలగిపోవడంతో వచ్చిన నీరెండలో కొండరాళ్లపైన ఆ నోట్లను ఆరబెట్టాడు. అవి గాలికి ఎగిరిపోకుండా వాటిపైన రాము దగ్గరున్న నాణేలను ఉంచాడు. ఎవరినీ తక్కువగా చూడకూడదని దేనివిలువ దానికి ఉంటుందని సోముకు అర్థమైంది. సిరికొండను చూసి సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్నారా స్నేహితులు.
Moral : వేటిని తక్కువగా అంచనా వేయద్దు
0 Comments