
కందుకూరి వీరేశలింగం
Kandukuri Veeresalingam in Telugu | Indian History in Telugu | Gk in Telugu
ఆంధ్రదేశంలోని బ్రహ్మ సమాజ నాయకులలో కందుకూరి వీరేశలింగం ముఖ్యనాయకుడు. ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు కందుకూరి. తెలుగు జాతికి నవయుగ వైతాళికునిగా కీర్తి సాధించాడు. కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్య, వితంతు మహిళల పునర్వివాహాల జీవితమంతా పాటుపడిన వ్యక్తి. కందుకూరి వీరేశలింగం 16 ఏప్రిల్ 1848న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. రాజమండ్రి, ధవళేశ్వరంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు.
➺ సంఘ సంస్కరణలు :
అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు వివాహాలు జరిపించేవారు. కాపురాలకు పోకముందే భర్తలు మరణించి ఆడపిల్లలు వితంతువులై అనేక కష్టాలు ఎదుర్కొనేవారు. ఈ ఆచారాన్ని రూపుమాపేందుకు వితంతు వివాహాలు జరపాలని కృషి చేశాడు.
Also Read :
➺ సంఘాల స్థాపన :
చిన్నతనం నుండే హేతువాదిగా ఉన్న వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం స్త్రీల అభ్యన్నతి కోసం ‘‘వివేకవర్ధిని’’ అనే పత్రికను స్థాపించాడు. ఇతను 1874లో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు. 1878లో రాజమండ్రి ‘‘సంఘసంస్కరణ సంఘం’’ ను స్థాపించాడు. స్త్రీల జీవితాల్లో వెలుగును నింపడం కోసం వితంతు వివాహాలు జరిపించాడు. ఇతడు 11 డిసెంబర్ 1881లో మొదటి వితంతు వివాహం జరిపించాడు. ఇది నచ్చని కొందరు సనాతనులు వీరేశలింగం చేసే సంఘసంస్కరణలను వ్యతిరేకించేవారు. వారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని సంఘ బహిష్కరణ చేసేవారు. వీరేశలింగం 1904లో రాజమండ్రిలో వితంతు శరణాలాయాన్ని, 1908లో ‘హితకారిణి’ అనే సమాజాన్ని స్థాపించాడు. ఈ రెండు సంస్థల నిర్వహణ కోసం తన యొక్క మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చిన మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ఇతడి భార్య రాజ్యలక్ష్మి వెన్నంటి ఉండి నడిచింది.
➺ రచనలు :
వీరేశలింగం సంఘ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాహిత్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. తెలుగు సాహిత్యంలో మొదటి నవల అయిన ‘‘రాజశేఖర చరిత్ర’’ రచించాడు. ఆంధ్ర కవుల యొక్క చరిత్రను సంకలనం చేశాడు. తన ఆత్మకథను ‘‘స్వీయ చరిత్రం’ అనే పేరుతో లిఖించాడు. సంఘంలోని మూఢవిశ్వాసాలను విమర్శిస్తూ ప్రహసనాలు రచించాడు. ఇతడికి ‘‘గద్య తిక్కన" అనే బిరుదు కలదు. తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన కందుకూరి వీరేశలింగం 27 మే 1919లో మరణించాడు.
0 Comments