మోక్షగుండం విశ్వేశ్వరయ్య
Mokshagundam Visvesvaraya Biography | Indian History in Telugu
సివిల్ ఇంజనీరింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అతిపెద్ద గృహాలు, నదులపై బ్రిడ్జిలు, రహదారులు మరియు ఇతర ముఖ్యమైన నిర్మాణాలు రూపొందించడంలో సివిల్ ఇంజనీరింగ్ చేసినవారు ముఖ్య పాత్ర వహిస్తారు. భారతదేశంలో విశ్వప్రఖ్యాతి పొందిన ఇంజనీర్ ఒకరున్నారని మీకు తెలుసా .. ! అతడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 15 సెప్టెంబర్ 1861న కర్ణాటకలోని మైసూర్ సంస్థానంలోని ముదినేహళ్లీలో జన్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మోక్షగుండం ప్రాంతానికి చెందినవారు కావడంతో తన ఊరి పేరే ఇంటి పేరుగా మారింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిన్నతనంలో చదువులో చురుకుగా ఉండేవారు. బెంగళూర్‌లో ప్రైమరీ విద్య, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో బీఎస్సీ, పూణె ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక్కడ చదువు పూర్తి చేశాక 1885 నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఇంజనీర్‌గా పనిచేశారు. తర్వాత 1899లో ఇండియన్ ఇరిగేషన్ కమీషన్‌లో విధుల్లో చేరారు. 1903లో ఖడక్‌వాస్లా డ్యామ్‌కు గేట్లు ఏర్పాటు చేసి నీటి సామర్థ్యం పెంచడంలో విజయవంతం అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో ఇంజనీర్‌గా పనిచేశారు. ముసీ నది వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యే సందర్భంలో వరద హైదరాబాద్‌ను ముంచెత్తకుండా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వరదలు రాకుండా ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు విశాఖపట్నంలోని సముద్ర వరదలు పోర్టును ముంచెత్తకుండా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రెండు రాష్ట్రాలకు విశేషమైన సేవలందించారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కృషితో దేశంలో తొలి ఇంజనీరింగ్ విద్యను మైసూర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన కృషికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ‘‘సర్’’ అనే బిరుదు ఇచ్చింది. భారతదేశంలో ఆయన సేవలకు గుర్తింపుగా 1955లో భారత అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ ప్రకటించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962లో తుదిశ్వాస విడిచారు. భారతదేశంలో ఆయన పుట్టినరోజును ‘‘ఇంజనీర్స్ డే’’ గా జరుపుకుంటారు.
0 Comments