International Monetary Fund
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే ఏమిటి?
అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund – IMF) ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలలో ఒకటి. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వం, వృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేసే అత్యంత కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఇదే.ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సమతుల్యంగా నడిపించడం, దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, మాంద్య పరిస్థితుల్లో ఉన్న దేశాలను ఆదుకోవడం వంటి ముఖ్యమైన బాధ్యతలను IMF నిర్వర్తిస్తుంది.
లక్ష్యాలు :
IMF యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచ దేశాలకు ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి సాధించడంలో సహాయం చేయడం. దీని ముఖ్య లక్ష్యాలు:
- దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం
- స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించే విధానాలను రూపొందించడం
- ఉద్యోగ సృష్టిని పెంపొందించడం
- ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య పరపతి స్థిరత్వాన్ని కాపాడడం
- ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు రుణాలు అందించడం
- ఆర్థిక సంస్కరణలు అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను ఇవ్వడం
ముఖ్య కార్యకలాపాలు :
అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక కీలక పాత్రలను పోషిస్తుంది:
- ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులపై నిరంతర నిఘా
- మాంద్యంలో ఉన్న దేశాలకు ఆర్థిక సహాయం
- రుణాల రూపంలో ఆర్థిక సహకారం
- దేశాలకు సరైన ఆర్థిక విధానాలపై సలహాలు
- ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో సాంకేతిక సహాయం
ఏర్పాటు :
1920–30 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మహామాంద్యం సంభవించింది. దీనివల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి ఎక్కువ దిగుమతి సుంకాలు విధించడంతో అంతర్జాతీయ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు 1944 జూలై 22న అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలోని బ్రెట్టన్ ఉడ్స్ నగరంలో సమావేశమయ్యాయి. దీనిని యూఎన్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అని పిలిచారు.
ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే:
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
- ప్రపంచ బ్యాంక్ (World Bank)
అనే రెండు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటినే బ్రెట్టన్ ఉడ్స్ కవలలు (Bretton Woods Twins) అని అంటారు.

0 Comments