Indian Constitution Writs in Telugu | వివిధ రిట్లు ప్రాముఖ్యత | Indian Polity

Indian Constitution Writs

వివిధ రిట్ల ప్రాముఖ్యత

Indian Constitution Writs in Telugu – Prohibition, Certiorari, Quo Warranto & Injunction 

ప్రొహిబిషన్ (నిషేధం) :

ప్రొహిబిషన్ అనే పదానికి భాషాపరంగా “నిషేధించడం” అనే అర్థం ఉంది. దిగువ కోర్టు లేదా ట్రైబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమించి కేసులను విచారిస్తున్నప్పుడు, ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తుంది. ఈ రిట్ ప్రధాన ఉద్దేశ్యం దిగువ కోర్టులు తమ అధికారాలను అతిక్రమించకుండా నిరోధించడం. ఇది కేవలం న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది; పాలనా సంస్థలు లేదా ఇతర చట్టపర సంస్థలకు వర్తించదు.

సెర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం) :

సెర్షియోరరి అనే పదానికి “రికార్డులను పైస్థాయి కోర్టుకు తీసుకురావడం” లేదా “సర్టిఫై చేయడం” అనే అర్థం ఉంది. ఒక దిగువ కోర్టు తన అధికారాన్ని అతిక్రమించి కేసును విచారించి తీర్పు వెలువరించినప్పుడు, ఆ తీర్పును రద్దు చేసి కేసును పైస్థాయి కోర్టుకు బదిలీ చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు. దీని ఉద్దేశ్యం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడం.

సెర్షియోరరిని ప్రైవేట్ సంస్థలు లేదా శాసనసభలపై జారీ చేయరు. అయితే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే పరిపాలనా సంస్థలపై ఈ రిట్‌ను జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరి మధ్య తేడాలు:

ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరి రిట్ల ఉద్దేశ్యం ఒకటే దిగువ కోర్టులు తమ అధికారాలను అతిక్రమించకుండా నియంత్రించడం. అయితే వీటి ప్రక్రియలో తేడా ఉంటుంది.

  • కేసు విచారణ జరుగుతున్న దశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్ జారీ చేస్తారు.
  • తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్ జారీ చేస్తారు.
  • ప్రొహిబిషన్ రిట్ విచారణను కేవలం నిలిపివేస్తుంది.
  • సెర్షియోరరి రిట్ తీర్పును రద్దు చేసి తప్పులను సవరించే అధికారం కలిగి ఉంటుంది

కో వారంటో (Quo Warranto) :

కో వారంటో అంటే “ఏ అధికారంతో?” అని ప్రశ్నించడం. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ ప్రధాన లక్ష్యం. ఒక వ్యక్తి చట్టబద్ధ అధికారంలేకుండా ప్రజా పదవిలో కొనసాగుతున్నప్పుడు, అతను ఆ పదవిలో కొనసాగడానికి ఉన్న చట్టబద్ధ హక్కును న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. చట్టబద్ధత లేకపోతే, ఆ వ్యక్తిని ఆ పదవి నుండి తొలగించమని ఆదేశిస్తుంది.

ప్రజా పదవి అంటే చట్టంతో ఏర్పాటైన స్వతంత్ర సంస్థలోని హోదా. ఉదాహరణకు ప్రభుత్వ కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవి.

ఈ రిట్ కోసం బాధితుడు మాత్రమే కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తికి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది.

ఇన్‌జంక్షన్ (Injunction) :

ఇన్‌జంక్షన్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఇది ప్రధానంగా సివిల్ వివాదాలలో ఉపయోగించే ఆదేశం. యథాతథ స్థితిని కొనసాగించడానికి లేదా భర్తీ చేయలేని నష్టాన్ని నివారించడానికి కోర్టులు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తాయి. ప్రాథమిక హక్కుల రక్షణతో దీనికి ప్రత్యక్ష సంబంధం లేదు.

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments