Indian History (Chola Dynasty) | Chola dynasty Rulers & Time Period


Indian History (Chola Dynasty)
 Chola Dynasty | List of Chola Dynasty Kings | Indian History 

చోళ సామ్రాజ్యం

దక్షిణ భారతదేశ చరిత్రలో చోళులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాజవంశాలలో ఒకటి. రాజరాజు చోళుడు, రాజేంద్ర చోళుడు వంటి మహా విజేతలను ఈ వంశం అందించింది. వీరి కాలం సమర్థవంతమైన స్థానిక పరిపాలన, అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు, సముద్ర వాణిజ్యం, సైనిక విజయాలకు ప్రసిద్ధి చెందింది.

ఆధారాలు :

చోళుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి అనేక ఆధారాలు లభిస్తున్నాయి:
  • పరాంతకుని ఉత్తరమేరూరు శాసనం
  •  కడంబలూరు శాసనం 
  • వీరరాజేంద్రుని తిరుముక్కడ శాసనం
  • తంజావూరులోని రాజరాజు శాసనాలు
  • మూడవ కులోత్తుంగుని తిరుమంగళం శాసనం
  • ఉత్తమచోళుని తామ్రశాసనాలు
  • రాజేంద్రుని తరువాలంగాడు శాసనం
  • రాజరాజు తామ్రశాసనాలు
  • దేవాలయాలపై తమిళ, సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలోని శాసనాలు
  • కళింగత్తుప్పరణి అనే గ్రంథం
  • మహావంశం (శ్రీలంక గ్రంథం)
  • చౌ జు కువా అనే చైనా రచన
  • శైవ, వైష్ణవ మతాచార్యుల రచనలు
  • కట్టడాలు, నాణేలు

రాజ్య స్థాపన :

చోళులు దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన రాజవంశాలలో ఒకరు. వీరి ప్రస్తావన మహాభారతంలో మెగస్తనీస్ రచించిన ఇండికాలో, అశోకుని శాసనాలలో కనిపిస్తుంది.

సంగం యుగం :

సంగం యుగంలో కరికాల చోళుడు చోళుల శక్తిని అత్యున్నత స్థాయికి చేర్చాడు. కావేరీపట్టణం రాజధానిగా ఉండేది. తరువాత పల్లవులు, పాండ్యులు శక్తివంతమవడంతో చోళులు కొన్ని శతాబ్దాలు రాజకీయంగా వెనుకబడ్డారు.

నవీన చోళుల (9వ శతాబ్దం)

పల్లవ, పాండ్య రాజ్యాల పతనం తరువాత చోళులు మళ్లీ శక్తివంతమయ్యారు. వీరిని నవీన చోళులు అంటారు.

విజయాలయ చోళుడు (క్రీ.శ. 850)

  •  ఉరయ్యూరులో పల్లవ సామంతుడిగా ఉన్నాడు
  •  ముత్తరయ్యారులను ఓడించి తంజావూరును స్వాధీనపరచుకున్నాడు
  •  తిరునడుంగలంలోని శాసనం అతను స్వతంత్రుడైనట్లు తెలుపుతుంది
  •  “రాజకేసరి” బిరుదు ధరించాడు

ఆదిత్య చోళుడు

  •  విజయాలయుని కుమారుడు
  •  పల్లవ–పాండ్య యుద్ధాలలో పాల్గొన్నాడు
  •  పల్లవ రాజు అపరాజితవర్మను ఓడించి కాంచిని ఆక్రమించాడు
  •  తంజావూరు పరిసరాల్లో అనేక దేవాలయాలు నిర్మించాడు
  •  రాజ్యం కాళహస్తి నుండి కోయంబత్తూరు వరకు విస్తరించింది

పరాంతక చోళుడు

  •  ఆదిత్యుని కుమారుడు
  •  పాండ్యులపై అనేక దండయాత్రలు చేసి మధురను ఆక్రమించాడు
  •  “మధురై కొండ” అనే బిరుదు పొందాడు
  •  ఉత్తర దిశగా రాజ్యాన్ని నెల్లూరు వరకు విస్తరించాడు

రాష్ట్రకూటులతో యుద్ధాలు

రాష్ట్రకూట రెండవ కృష్ణుడిని ఓడించాడు. తరువాత రాష్ట్రకూట మూడవ కృష్ణుడు దాడి చేసి తక్కోలం యుద్ధంలో చోళులను ఓడించాడు. చోళ యువరాజు రాజాదిత్యుడు యుద్ధంలో మరణించాడు.తోండైమండలం రాష్ట్రకూటుల ఆధీనమైంది.అయినప్పటికీ చోళనాడు పరాంతకుని ఆధీనంలో కొనసాగింది. 

రాజరాజ చోళుడు (క్రీ.శ. 985–1014)

ఉత్తమచోళుడి మరణం తర్వాత, సుందరచోళుడి కుమారుడు అరుల్మొళివర్మన్ క్రీ.శ. 985లో “రాజరాజ” అనే బిరుదుతో చోళ సింహాసనం అధిరోహించాడు. నవీన చోళులలో అతను అత్యంత ప్రతిష్టాత్మకుడిగా నిలిచాడు. చోళుల కీర్తిని పునరుద్ధరించి, వారి చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించాడు.

చారిత్రక ఆధారాలు

తంజావూరులోని దేవాలయ శాసనాలు, తిరువలంగాడు తామ్రశాసనాలు రాజరాజు పాలన గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.

సైనిక విజయాలు

  • ముందుగా చేరరాజ్యంపై దండెత్తి, భాస్కర రవివర్మను కందలూర్ నౌకాయుద్ధంలో ఓడించి కోల్లం, ఉడగై ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
  • పాండ్యులను ఓడించి మధురై, కుడుమలై ప్రాంతాలను ఆక్రమించాడు.
  • సింహళంపై దండెత్తి అనురాధపురాన్ని ధ్వంసం చేసి, పోలోన్నరువాలో శివాలయం నిర్మించాడు. ఉత్తర సింహళాన్ని “ముమ్ముడి చోళమండలం”గా చేర్చి చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

ఉత్తర దండయాత్రలు

దక్షిణ ప్రాంతాలను జయించిన తర్వాత గంగవాడి, నోలంబవాడి, తడిగైపాడి, తలకాడు వంటి దక్షిణ మైసూరు ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకున్నాడు. రాష్ట్రకూటుల పతనానంతరం కల్యాణి చాళుక్యులతో చోళులకు దీర్ఘకాల ఘర్షణలు జరిగాయి. వెంగిరాజ్యం ఈ పోరాటాలకు కేంద్రంగా మారింది.

వెంగి వ్యవహారం

వెంగిలో వారసత్వ కలహాల కారణంగా రాజరాజు జోక్యం చేసుకున్నాడు. జటాచోడ భీముడు దానర్ణవుని హత్య చేసి వెంగి సింహాసనం ఆక్రమించగా, దానర్ణవుని కుమారులు శక్తివర్మ, విమలాదిత్యులు రాజరాజు ఆశ్రయం కోరారు. రాజరాజు సైన్యంతో జటాచోడుని ఓడించి శక్తివర్మను వెంగి సింహాసనంపై కూర్చోబెట్టాడు. తన కుమార్తె కుందవైను విమలాదిత్యునికి వివాహం చేయడం ద్వారా చోళ–చాళుక్య మైత్రిని బలోపేతం చేశాడు. కళింగ గంగులను కూడా ఓడించాడు.

సముద్ర యాత్రలు

తన చివరి దండయాత్రల్లో నౌకాబలంతో మాల్దీవులను ఆక్రమించాడు. అతని సామ్రాజ్యం తమిళనాడు, ఆంధ్ర తీరప్రాంతాలు, మైసూరు భాగాలు, ఉత్తర సింహళం, మాల్దీవుల వరకు విస్తరించింది. దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్య నిర్మాతగా ఇతన్ని చరిత్రకారుడు K. A. Nilakanta Sastri ప్రశంసించాడు.

పరిపాలన

రాజరాజు కేవలం విజేత మాత్రమే కాదు, సమర్థ పరిపాలకుడూ. పంట భూములను సర్వే చేయించి, న్యాయబద్ధమైన పన్నుల వ్యవస్థను అమలు చేశాడు. పాలనను క్రమబద్ధీకరించి సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు.శివభక్తుడైన రాజరాజు తంజావూరులో అద్భుతమైన బృహదీశ్వరాలయం నిర్మించాడు. శైలేంద్ర రాజు శ్రీమార విజయోత్తుంగవర్మకు నాగపట్టణంలో “సుదామణి విహారం” అనే బౌద్ధ విహారం నిర్మించేందుకు అనుమతి ఇచ్చి, ఆ విహారానికి ఆనిమంగళం గ్రామాన్ని దానం చేశాడు. అతని సోదరి కుందవై నిర్మించిన విష్ణు ఆలయాలకు కూడా గ్రామాల దానాలు చేశాడు. 

 

రాజేంద్ర చోళుడు (క్రీ.శ. 1014–1044)

రాజరాజు చోళుడి తరువాత ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు సింహాసనం అధిష్ఠించి చోళ సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాడు. అరువలంగాడు తామ్రశాసనం, తిరుమలై శాసనం వంటి ఆధారాలు ఆయన విజయాలను వివరంగా తెలియజేస్తాయి. తండ్రి ప్రారంభించిన సామ్రాజ్య విస్తరణను రాజేంద్రుడు మరింత దూరం తీసుకెళ్లాడు.

యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై దండయాత్ర చేసి ఘన విజయం సాధించాడు. క్రీ.శ. 1018లో సింహళ (శ్రీలంక)పై దాడి చేసి సింహళ రాజు మహేంద్రుని బంధిగా తీసుకొచ్చాడు. 1019లో కేరళ, పాండ్య దేశాలపై దండెత్తి ఆ ప్రాంతాలను స్వాధీనపరచుకుని, అక్కడి అపార సంపదను దోచుకున్నాడు. ఈ ప్రాంతాల పరిపాలన కోసం మధురను కేంద్రంగా చేసుకుని తన కుమారుడిని ప్రతినిధిగా నియమించాడు.

క్రీ.శ. 1020 తర్వాత కల్యాణి చాళుక్యులను పలు మార్లు ఓడించి, వేంగి పాలకుడిగా రాజరాజ నరేంద్రుని నియమించి తన కుమార్తె అమ్మంగ దేవిని వివాహం ఇచ్చాడు. అనంతరం కళింగంపై దండెత్తి అక్కడి రాజు ఇంద్రరథుడిని జయించాడు. ఈ విజయ యాత్రలో గంగానది తీర ప్రాంతాల వరకు చేరుకుని బెంగాళును పాలిస్తున్న మహీపాలుడిని ఓడించి “గంగైకొండ చోళ” అనే బిరుదును పొందాడు.

దక్షిణ ఆసియాతో వాణిజ్యాభివృద్ధి లక్ష్యంగా గొప్ప నౌకాదళాన్ని సమీకరించి శ్రీ విజయ సామ్రాజ్యంపై సముద్ర దండయాత్ర చేశాడు. సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి అతని రాజధాని కడారంను స్వాధీనపరచుకున్నాడు. ఈ విజయానికి గుర్తుగా “కడారంగొండ” అనే బిరుదును ధరించాడు.

రాజేంద్రుడు “ముదిగొండ”, “గంగైకొండ”, “కడారంగొండ” వంటి బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. తన విజయాలకు స్మారకంగా గంగైకొండ చోళపురం అనే అద్భుత నగరాన్ని నిర్మించి దానిని రాజధానిగా ప్రకటించాడు. ఆయన పాలనలో చోళుల కీర్తి, ప్రతిష్ఠలు భారతదేశం దాటి దూర దేశాలకు వ్యాపించాయి.

 

చివరి చోళులు

రాజాధిరాజ చోళుడు I, రాజేంద్ర చోళుడి తరువాత సింహాసనం అధిష్టించాడు. అతని పాలన ప్రారంభంలో మధుర, సింహళ ప్రాంతాల్లో జరిగిన తిరుగుబాట్లను అణచివేసి రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు. అనంతరం కళ్యాణ చాళుక్యరాజు సోమేశ్వర I ను ఓడించి కల్యాణాన్ని ఆక్రమించాడు. అయితే కొప్పం యుద్ధంలో రాజాధిరాజుడు వీరమరణం పొందాడు.

రాజేంద్ర చోళుడు II (1052–1064), వీర రాజేంద్ర చోళుడు (1064–1070), అధిరాజేంద్ర చోళుడు వరుసగా పాలించారు. వీరి కాలమంతా కళ్యాణ చాళుక్యులతో యుద్ధాలతోనే గడిచింది. చివరి రాజైన అధిరాజేంద్రుడు ప్రజా తిరుగుబాటులో మరణించాడు.

అతని మరణం తర్వాత, తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రునికి, అమ్మంగదేవికి జన్మించిన కులోత్తుంగ చోళుడు I (రాజేంద్రుడు) గంగైకొండ చోళపురానికి వచ్చి చోళ సింహాసనం అధిష్టించాడు. దీనితో చోళ వంశపు పాత వారసత్వం ముగిసి, చాళుక్య–చోళుల పాలన ప్రారంభమైంది.

కులోత్తుంగుడి కాలం

కులోత్తుంగ చోళుడు I కాలంలో చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చైనా, సింహళ, శ్రీవిజయ రాజ్యాలతో దౌత్య సంబంధాలు కొనసాగించబడ్డాయి.

తరువాతి పాలకులు

  • విక్రమ చోళుడు (క్రీ.శ. 1120–1133)
  • కులోత్తుంగ చోళుడు II
  • కులోత్తుంగ చోళుడు III
  • రాజరాజ చోళుడు III
  • రాజేంద్ర చోళుడు III – ఈయనే చోళ వంశంలోని చివరి ముఖ్య పాలకుడు.

కాకతీయ గణపతి దేవుడు రాజేంద్ర చోళుడు III ను ఓడించి కంచి వరకు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత పాండ్యుల శక్తి విస్తరించింది. మారవర్మన్ కులశేఖర పాండ్యుడు I కాలంలో పాండ్యులు చోళులు, హోయసాళులు, కాకతీయులను ఓడించి నెల్లూరు వరకు తమ ఆధిపత్యాన్ని విస్తరించారు.దీనితో చోళ మండలం పాండ్యుల ఆధీనంలోకి వెళ్లి, చోళుల మహాసామ్రాజ్య పాలనకు ముగింపు పలికింది.

Post a Comment

0 Comments