కలిసి మెలిసి జీవించాలి !
ఒక రాజు తన రాజ్య మంత్రితో కలిసి ఒక అడవికి వేట సరదాకి వెళ్లినాడు. అట్టి అడవిలో అతనికి వింత లు కనిపించినాయి. పాము - కప్ప కలిసి ఆటలాడుకుంటున్నాయి. మరోక చోట సింహం-ఏనుగు కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. పెద్దపులి పక్కనే జింక నిద్రపోతున్నది. వీటన్నింటిని చూసిన రాజుకు ఆశ్యర్యం వేసింది.
వెంటనే మంత్రిని పిలిచి ఇదేమిటి మంత్రిగారు ‘‘నేను కలలో లేనుకదా ! నేను చూసేవన్ని నిజమేనా ఇలా జాతి వైరం మరిచి ఇవన్నీ ఇలా ప్రవర్తించడం ఏమిటి ? ’’ అని అడిగాడు. అప్పుడు మంత్రి కూడా ఆశ్వర్యపోయి ‘ ఏమో మహారాజా ! నాకు కూడా ఏమి అర్థం కావడం లేదు. సింహాన్ని చూసి పారిపోయే ఏనుగు కూడా దాంతో ముచ్చుట్లు పెడుతూ ఉండటం వింతగా ఉంది. దీని రహాస్యం మునీశ్వరులు ఎవరికైనా తెలిసి ఉంటుంది. అంతవరకు మీరు వేట మానడమే మంచిది ’ అని సూచించాడు.
మహారాజు కూడా ‘ అవును మంత్రివార్య ! మీరన్నది నిజమే ! నాకు కూడా వాటిని వేటడానికి మనసు ఒప్పడం లేదు. మూగ ప్రాణులైన అవే అలా ఉంటే .. మాటలు వచ్చిన మనం ఎలా ఉండాలి ? నేను ఇప్పుడు వేటాడలేను ’ అని అన్నాడు. ‘‘ అయితే మనం రాజ్యానికి తిరిగి వెళ్దాం పదండి మహారాజా !’’ అని మంత్రి సూచించాడు. రాజు అందుకు అంగీకరించాడు. ఇద్దరూ గుర్రాలపై తిరుగు పయనమయ్యారు.
ఒకరోజు ఆ రాజ్యానికి ఒక మునీశ్వరుడు అనుకోకుండా వచ్చాడు. అప్పుడు రాజు ఆయనకు ఆతిథ్యమిచ్చి ‘మునీశ్వరా! నేను వేటడానికి అడవికి వెళితే అక్కడ జంతువులతో పాటు అన్ని ప్రాణులు కూడా కలిసిమెలిసి ఉంటున్నాయి. ఆ అడవిలో మీ మునుల ఆశ్రమాలు కూడా ఏమీ లేవు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అందుకు కారణాలు ఏంటి ? అని అడిగాడు.
అప్పుడు ఆ ముని ‘మహారాజా ’ అడవి పరిసరాలను చూడకుండా నేను ఏమి చెప్పలేను. కాబట్టి మీరు, నేను, మంత్రిగారు ఒకసారి అడవికి వెళ్లి వాటిని పరిశీలిద్దాం. అప్పుడు కానీ మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను’ అని అన్నాడు. అందుకు రాజు అంగీకరించి మంత్రిని అందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు.
వారు ముగ్గురూ ఒక రథంపై అడవికి బయలుదేరారు. వారికి ఇంతకుముందు కనబడిన దృశ్యాలే తిరిగి కనిపించాయి. అప్పుడు మునీశ్వరుడు ‘ మహారాజా ’ మీరు ఇక్కడే ఉండండి, అక్కడ చెట్ల చాటున వాటి సమావేశం ఏదో జరిగేటట్లుగా ఉంది. నేను చాటుగా వెళ్లి వాటిని గమనిస్తాను. నాకు జంతువుల భాష తెలుసు ’ అన్నాడు. అందుకు రాజు ‘ సరే ’ అన్నాడు. మునీశ్వరుడు నడుస్తూ ఒక చెట్టు చాటు దాడి వాటిని గమనించసాగాడు. అప్పుడే అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. సింహం అక్కడ కూర్చుని ఉంది. కోతికి వాటికి ఉపదేశం ఇస్తూ .. ‘ మనలో మనం ఒకదాన్నొకటి చంపుకోవడం చాలా ఘోరం. అందుకే నేను మిమ్మల్ని కలిసి ఉండమని చెప్పాను. కొద్దిరోజుల్లోనే ఈ సంగతి తెలిసి రాజు కూడా వేటాడటం మానేస్తాడు. అప్పుడు మనకు ప్రాణ భయం ఉండదు. మనం ఆహారం కోసం ఇతర మార్గాలు
అన్వేషించాలి. ఒక ప్రాణిని చంపితే దాన్ని తిరిగి బతికించే శక్తి మనకు లేదు. అటువంటి శక్తి మీలో ఎవరికైనా ఉందా చెప్పండి మనం హింసను మానుకొందాం కొన్ని రోజులుగా మీరు నా మాటలు విని ఆచరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ’ అని అంది.
అది చూసిన మునీశ్వరుడు రాజు దగ్గరికి వచ్చి ఈ సంగతంతా వివరించి చెప్పాడు. అప్పడు రాజు ఆశ్వర్యపోయి ‘ ఈ వన్యప్రాణులే ఇలా చేసినప్పుడు మానువులమైన మనం హింసను మానుకోలేమా ! ఇక మీదట నేను కూడా వేటాడి పాపం మూటగట్టుకోలేను. ఈ రోజు నుండి నేను వేటను మానేస్తున్నాను. కేవలం నేనే కాదు. నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా హింసను విడనాడాలి. అందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించాలని చాటింపు వేయిద్దాం. దీని కోసం మునీశ్వరులైన మీ సహాకారం కూడా నాకు కావాలి. మీ వంటి వారు ధర్మసూక్ష్యాలను గ్రామగ్రామాన తెలియజేయాలి ’ అన్నాడు. రాజు మాటలకు మునీశ్వరుడు కూడా సంతోషించి, రాజు ను అభినందించాడు.
మహారాజు ఆజ్ఞను మంత్రి కూడా పాటించి రాజ్యంలో ప్రతి ఒక్కరూ హింసను మానాలని, జంతువులను వేటాడకూడదని చాటింపు వేయించాడు. రాజాజ్ఞ కాబట్టి ప్రజలూ పాటించారు.
Moral : సర్వేజన సుఖినోభవంతు !!
0 Comments