
తెలంగాణ నూతన సచివాలయం గురించి మీకు తెలియని విషయాలు .. !
telangana secretariat in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణాగా నిలిచిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని 17 ఫిబ్రవరి 2023 రోజున ప్రారంభోత్సవం చేస్తున్న దృష్ట్యా తెలంగాణ సచివాలయం గురించి మీకు తెలియని విషయాలు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనం నిర్మించడానికి 27 జూన్ 2019 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారు శంకుస్థాపన చేసినారు. జూలై 2020 లో పాత సచివాలయ భవనాన్ని కూల్చివేయడం మొదలుపెట్టినారు. ఈ నిర్మాణం కోసం 14 వేల ట్రక్కుల లోడ్ల శిథిలాలను అతి తక్కువ సమయంలో తొలగించినారు. జనవరి 4, 2021 రోజున నిర్మాణ పనులను ప్రారంభించినారు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే అత్యాధునిక హంగులు కలిగిన ఈ భారీ కట్టడాన్ని నిర్మించారు. ఈ నూతన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌గా నామకరణం చేసినారు.
తెలంగాణ సచివాలయం మొత్తం 28 ఎకరాలలో నిర్మించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని 265 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోని అతి ఎత్తయిన భవనాలలో ఇది ఒకటిగా చేరింది. ఈ భవనం ఫై జాతీయ చిహ్నం ఏర్పాటు చేసారు. ఈ జాతీయ చిహ్నాన్ని కలిపితే ఈ మొత్తం భవనం ఎత్తు 278 అడుగులకు చేరుకుంటుంది. ఈ భవనాన్ని చూస్తే 11 అంతస్తుల ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నవి మొత్తం 6 అంతస్తులు మాత్రమే ఉంటాయి. ఒక్కో అంతస్తు ఎత్తు 14 అడుగులు ఉంటుంది. ఇందులో మొదటి అంతస్తు 20 అడుగుల ఎత్తు కల్గి ఉంటుంది. ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ఈ అంతస్తులోనే ముఖ్యమంత్రికి సంబందించిన అన్ని కార్యాలయాలు ఉంటాయి. తెలంగాణలో భవిష్యత్తు నియోజవర్గాలు, మంత్రుల స్థానాలు దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, ఇతర గదులను నిర్మించారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబందించిన అన్ని కార్యాలయాలు ఒకే వద్ద ఉండేలా గదుల నిర్మాణం చేసినారు. దాదాపు 300 కార్లు సులభంగా పట్టే విధంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినారు. ఇందులో నిర్మించిన అత్యాధునిక పౌంటేన్‌లు, గార్డెన్‌లు సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. విద్యుచ్చక్తిని తక్కువ వినియోగించుకునేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు.
ఈ భవనం ఉత్తర దిశలో వర్షం నీటికి ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్ నిర్మించారు. ఇలా పొదుపు చేసిన వర్షపు నీటిని సచివాలయం మొక్కలకు, పచ్చదనానికి వాడుతారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కోసం భవనం పైన భారీ సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సహజమైన కాంతి వచ్చే విధంగా ఈ భవన రూపకల్పన చేసినారు. ఉద్యోగులకు అవసరమైన బ్యాంకులు, ఏటీఎం, క్యాంటీన్ వంటి అన్ని సౌకర్యాలు నిర్మించారు.
దక్కన్, కాకతీయుల శైలి ఇంజనీరింగ్ విధానంలో ఈ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి నిర్మించిన రెండు ప్రధాన గుమ్మటాలు, 8 చిన్నగుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ భవనాన్ని తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు.
0 Comments