గోదావరి నది (Godavari River)
Godavari River & Projects in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Godavari River Projects in Telugu || Godavari River in Telugu
ద్వీపకల్ప నదులన్నింటిలో ఇది అతిపెద్ద నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి
పెద్ద నది. ఈ నది మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలోని త్రయంబకంలో పుట్టి
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణ
రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలోకి ప్రవేశించిన గోదావరి నది
నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా 1465 కి.మీ
ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్లి తూర్పుగోదావరి
అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం
79 శాతంగా ఉంది. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ద గంగా, ఇండియన్ రైన్,
తెలివాహి, కవుల నది అనే పేర్లుతో కూడా పిలుస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది
సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గోదావరి నది బేసిన్‌లో మహరాష్ట్రకు
48.66%, తెలంగాణకు 19.87%, ఆంధ్రప్రదేశ్‌కు 3.53% కలదు. గోదావరి నది యొక్క
పరివాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ కలదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం 1)
మహరాష్ట్ర (48.6%), 2) తెలంగాణ (18.8%) 3) ఛత్తిస్‌ఘడ్ (10.9%) 4) ఒడిసా(5.7%)
5) ఆంధ్రప్రదేశ్ (4.5%), కర్ణాటక (1.4%) కలదు. గోదావరి పుష్కరాలు ప్రతి
12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చివరిసారి 2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు
జరిగాయి.
➠ గోదావరి నదికి ఉపనదులు :
-
ప్రాణహిత
-
మంజీరా
-
కిన్నెరసాని
-
ఇంద్రావతి
-
శబరి
-
సీలేరు
-
వార్ధా
-
పెన్‌గంగ
-
వెయిన్‌గంగ
-
మానేరు
-
హరిద్రా
-
కడెం
-
పెద్దవాగు
వంటి ఉపనదులు కల్గి
ఉంది.
గోదావరి ఉపనదులు మహారాష్ట్ర, మద్యప్రదేశ్, కర్ణాటక, చత్తిస్‌ఘడ్, ఒడిస్సా,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కలవు. గోదావరి నది తెలంగాణలోని 1) నిజామాబాద్, 2)
నిర్మల్ 3) జగిత్యాల, 4) మంచిర్యాల, 5) పెద్దపల్లి, 6) జయశంకర్ భూపాలపల్లి,
7) ములుగు, 8) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. తెలంగాణ
రాష్ట్రంలో కుడివైపు మంజీరా, హరిద్రా, మానేరు, కిన్నెరసాని, మూల, ప్రవర అనే
ఉపనదులు, ఎడమవైపు కడెం, పెన్‌గంగా, వార్ధా, వెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగు,
ఇంద్రావతి శబరి, సీలేరు నదులున్నాయి. నిర్మల్ జిల్లాలోని బాదనకుర్తి వద్ద
నదీ ఆధారిత దీవి ఏర్పడుతుంది. మహరాష్ట్రలోని నాసిక్, మద్యప్రదేశ్ లోని
ఉజ్జయినీ వద్ద కుంభమేళా నిర్వహిస్తారు.
➠ మంజీరా నది :
ఈ మంజిరా నది మహరాష్ట్రలోని బీడ్
జిల్లా బాలాఘాట్ పర్వతాలలో పుట్టింది. మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
రాష్ట్రాలలో మొత్తం 644 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ నది సంగారెడ్డి
జిల్లాలోని నారాయణఘేడ్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.
ఈ నది తెలంగాణ రాష్ట్రంలో 1) సంగారెడ్డి, 2) మెదక్, 3) కామారెడ్డి, 4)
నిజామాబాద్ జిల్లాలలో ప్రవహిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద
గోదావరిలో కలుస్తుంది. మంజిరా నదిపై సింగూర్, నిజాంసాగర్ ప్రాజేక్టులు
నిర్మించారు. మంజీరా నదిని మహరాష్ట్రంలో మాంజ్రా నది అని పిలుస్తారు.
ఇది మెదక్‌లో ఏడుపాయలుగా వీడిపోయి ప్రవహిస్తుంది. ఇక్కడ
వనదుర్గాదేవి ఆలయం కలదు. గోదావరి నదిలో మొదటిగా కలిసే ఉపనది.
➠ హరిద్రా నది :
ఇది సంగారెడ్డి వద్ద
పుట్టింది. ఈ హరిద్రా నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి నదిలో
కలుస్తుంది. ఈ కందకుర్తి ప్రాంతం వద్ద గోదావరి, మంజిరా, హరిద్రా నదులు
కలుస్తున్నందు వల్ల ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని
పిలుస్తున్నారు.
➠ మానేరు నది :
ఇది రాజన్నసిరిసిల్ల
జిల్లాలోని సిరిసిల్ల కొండల్లో జన్మిస్తుంది. ఈ నది 1) రాజన్నసిరిసిల్ల, 2)
కరీంనగర్, 3) పెద్దపల్లి 4) జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ప్రవహించి
భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది మొత్తం
122 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ నది ఒడ్డున కరీంనగర్ జిల్లా ఏర్పడిరది. ఈ
మానేరు నదిపై ఎగువ మానేరు, దిగువ మానేరు (శ్రీ రాజరాజేశ్వర మద్యమానేరు
ప్రాజేక్టు) , అప్పర్ మానేరు ప్రాజేక్టులు నిర్మించారు. దీని ఉపనది
బొగ్గులవాగు.
➠ కిన్నెరసాని నది :
ఈ నది ములుగు జిల్లా మేడారం
ప్రాంతంలోని తాడ్వాయి కొండల్లో జన్మించింది. ఇది 1) ములుగు, 2) భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాల మీదుగా మొత్తం 90 కిలోమీటర్లు ప్రయాణించి
ఆంధ్రప్రదేశ్‌లోని బూర్గంపాడు వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. దీనిపై
పాల్వాంచ వద్ద కిన్నెరసాని ప్రాజేక్టు కలదు.
➠ వార్ధానది :
ఇది మద్యప్రదేశ్ రాష్ట్రంలోని
సాత్పూరా పర్వతాల్లో జన్మిస్తుంది. మద్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా
తెలంగాణలో ప్రవేశించి మొత్తం 528 కిలోమీటర్లు ప్రయాణించి కొమురంభీమ్
ఆసిఫాబాద్ వద్ద వెన్‌గంగలో కలుస్తుంది.
➠ కడెం నది :
ఈ నది ఆదిలాబాద్ జిల్లాలో బతాయి
ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఈ నది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్
జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది నిర్మల్ జిల్లా పసుపుల గ్రామం వద్ద గోదావరి
నదిలో కలుస్తుంది. ఈ కడెం నది జలపాతాలకు ప్రసిద్ది చెందింది. ఈ కడెం నదిపై
కుంతాల, పొచ్చెర, గాయత్రి వంటి జలపాతాలు ఉన్నాయి. ఈ కడెం నది పరివాహక
కవ్వాల్‌లో పులుల సంరక్షణ కేంద్రం కలదు.
➠ పెన్‌గంగా నది :
ఈ నది మహారాష్ట్రంలో అజంతా
పర్వతాల్లో రేవుల్‌ఘాట్ వద్ద జన్మిస్తుంది. ఇది మొత్తం 676 కి.మీ ప్రయాణించి
వార్ధా నదిలో కలుస్తుంది.
పెద్దవాగు నది
ఇది కొమురంభీం ఆసిఫాబాద్
జిల్లాలో సిర్‌పూర్ వద్ద జన్మిస్తుంది. ఇది మొత్తం 100 కిలోమీటర్లు
ప్రయాణించి బిజ్జూర్ లోని ముర్లిగూడ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ
నదిపై కొమురంభీం ప్రాజేక్టు నిర్మించారు.
➠ వెన్‌గంగా నది :
ఇది మద్యప్రదేశ్ రాష్ట్రంలోని
సాత్పూరా పర్వతాల్లో ముందర సియోని జిల్లాలో జన్మించింది. మద్యప్రదేశ్,
మహరాష్ట్రాల గుండా తెలంగాణ రాష్ట్రంలో కలుస్తుంది. ఇది మొత్తం 570
కిలోమీటర్లు ప్రయాణం చేసి కొమురం భీం ఆసిఫాబాద్ వద్ద వార్ధా నదిలో
కలుస్తుంది.
➠ ప్రాణహిత నది :
వెన్‌గంగా, వార్ధా, పెన్‌గంగా
నదుల కలయికతో ఈ ప్రాణహిత నది ఏర్పడిరది. ఇది అత్యంత వేగంగా ప్రవహించే
ఉపనదిగా పేరుగాంచింది. ఇది తెలంగాణలోని 1) కొమురంభీం ఆసిఫాబాద్, 2)
మంచిర్యాల, 3) జయశంకర్ భూపాలపల్లి 4) ఆదిలాబాద్ జిల్లా మీదుగా ప్రవహించి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇది
తెలంగాణలో 113 కి.మీ ప్రయాణిస్తుంది. గోదావరికి అత్యధికంగా నీటిని
తీసుకువచ్చే నది. గోదావరికి అతిపెద్ద ఉపనది.
➠ ఇంద్రావతి నది :
ఈ నది ఒడిసాలోని కలహండి జిల్లాలో
జన్మిస్తుంది. ఈ నది ఒడిసా, చత్తిస్‌ఘడ్ మహారాష్ట్రల మీదుగా తెలంగాణ
రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది మొత్తం 535 కిలోమీటర్లు ప్రయాణించి
జయశంకర్ భూపాలపల్లిలోని మహదేవ్‌పూర్ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
ఇక్కడ అరణ్యప్రాంతంలో అత్యధిక వర్షాలు కురవడం వల్ల ఈ నది అత్యంత
వేగంగా ప్రవహిస్తుంది. ఈ నదిపై చత్తిస్‌ఘడ్ రాష్ట్రంలో చిత్రకూట్ జలపాతం
కలదు.
➠ శబరి నది :
ఇది ఒడిసాలోని తూర్పుకనుమల్లో
సింకారా కొండల్లో జన్మిస్తుంది. ఈ శబరి నదిని ఒడిసా రాష్ట్రంలోని కోలాబ్
అని కూడా పిలుస్తారు. దీనికి సీలేరు అనే ఉపనది కలదు. ఇది ఒడిసా,
చత్తిస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి కూనవరం వద్ద గోదావరిలో
కలుస్తుంది.
➠ గోదావరి నదికి మొత్తం 12 రివర్‌బేసిన్ కలవు.
-
ఎగువ మానేరు (జి1)
-
ప్రవర (జి2)
-
పూర్ణ (జి3)
-
మంజిరా (జి4)
-
మద్య గోదావరి (జి5)
-
మానేరు (జి6)
-
పెన్‌గంగా (జి7)
-
వార్ధా (జి8)
-
ప్రాణహిత (జి9)
-
దిగువ గోదావరి (జి10)
-
ఇంద్రావతి (జి11)
-
శబరి (జి12)
ఇందులో అత్యధిక పరివాహక ప్రాంతం ప్రాణహిత(జి9) బేసిన్‌కు కలదు. అతితక్కువ
పరివాహక ప్రాంతం ప్రవర(జి2) బేసిన్‌కు కలదు.
గోదావరి నది పరివాహక ప్రాంతం సంరక్షణ కేంద్రాలు
|
మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
మగ్గర్ మొసళ్లు, తాబేల్లు, పక్షులు
|
సంగారెడ్డి,
|
పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
నాలుగు కొమ్ముల జింకలు, పక్షులు
|
కామారెడ్డి మెదక్
|
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం
|
పులులు, నీల్గాయి
|
నిర్మల్, అదిలాబాద్
|
శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం
|
మగ్గర్ మొసళ్లు
|
మంచిర్యాల, పెద్దపల్లి
|
ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
కృష్ణజింకలు
|
మంచిర్యాల
|
ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
అడవి దున్నలు
|
జయశంకర్ భూపాల పల్లి
|
పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
అడవి దున్నలు
|
మహబూబ్ నగర్, వరంగల్
|
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
|
అడవి దున్నలు, జింకలు
|
భద్రాద్రి కొత్తగూడెం
|
గోదావరి నదిపై నిర్మించిన ప్రాజేక్టులు
ప్రాజేక్టులను అది అందించే సాగునీటిని, సాగునీటి విస్తీర్ణంను బట్టి మూడు
రకాలుగా విభజించారు.
1) భారీ తరహ
ప్రాజేక్టులు
2) మద్యతరహ
ప్రాజేక్టులు
3) చిన్నతరహా
ప్రాజేక్టులు
1) భారీ తరహ
ప్రాజేక్టులు
25,000 ఎకరాలకు పైగా మరియు
10,000 హెక్టార్ల (1 హెక్టారు R 2 1/2 ఎకరాలు) భూమికి పైగా
సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన ప్రాజేక్టులను భారీ తరహ
ప్రాజేక్టులు అంటారు.
2) మద్యతరహ
ప్రాజేక్టులు
5000 ఎకరాల నుండి 25000 ఎకరాలకు
లేదా 2000 హెక్టార్ల నుండి 10000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించే వాటిని
మద్యతరహ ప్రాజేక్టులు అంటారు.
3) చిన్నతరహ
ప్రాజేక్టులు
5000 ఎకరాలు కంటే తక్కువ లేదా
2000 హెక్టార్ల కంటే తక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజేక్టులను
చిన్నతరహ ప్రాజేక్టులు అంటారు.
ప్రవహించే నీటిని దారి
మళ్లించడానికి ఉపయోగబడే నిర్మాణాలను బ్యారేజీలు అంటారు. అలాగే నీటిని నిల్వ
చేయడానికి రిజర్వాయర్ నిర్మాణం చేస్తారు. అలాగే ఒక ప్రాజేక్టు యొక్క
గరిష్ట నీటిమట్టం యొక్క ఎత్తును ఎఫ్‌ఆర్‌ఎల్ అని పిలుస్తారు.
రిజర్వాయర్‌లలో నిల్వ చేసే నీటి యొక్క ఘనపరిమాణాన్ని కొలవడానికి టిఎంసి
కొలమానాన్ని ఉపయోగిస్తారు. 1 టిఎంసి దాదాపు 2832 కోట్ల లీటర్లకు
సమానం. నీటి యొక్క ప్రవాహ రేటును కొలవడానికి క్యూసెక్ కొలమానాన్ని
ఉపయోగిస్తారు. ఒక సెకను కాలంలో నీరు ఎంత వేగంతో పరుగెడుతుందో
తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పంపుహౌజ్‌లోని వాల్వ్‌పై నీటి
ఒత్తిడిని తగ్గించడానికి నిర్మించే బావులవంటి నిర్మాణాలను సర్జిపూల్
అంటాము.
➯ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజేక్టు (లిప్టు ఇరిగేషన్) :
కాళేశ్వరం ఎత్తిపోతల
ప్రాజేక్టును జయశంకర్ భూపాల పల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలం,
కన్నెపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో
చేపట్టిన ప్రాణహిత`చేవేళ్ల ప్రాజేక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా
నామకరణం చేసి ఈ ప్రాజేక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజేక్టును 2 మే 2016
రోజున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు
శంకుస్థాపన చేసినారు. ఇది ప్రాణహిత, గోదావరి సంగమం వద్ద ఉంది. ప్రధానంగా
కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మురు వద్ద కలిసే ఇంద్రావతి
నదుల 195 టిఎంసిల నీటిని వినియోగంలోకి తెచ్చి రాష్ట్రంలోని 13జిల్లాలలో
వెనకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజేక్టు
రూపొందింది.
ఈ కాళేశ్వరం ఎత్తిపోతల
ప్రాజేక్టును తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దాదాపు 80 వేల 500 కోట్ల
వ్యయంతో నిర్మాణం చేస్తుంది. ఈ ప్రాజేక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని
13 జిల్లాలు లబ్ది పొందుతున్నాయి. గోదావరి నది నుండి 90 రోజుల పాటు ప్రతి
రోజు 2 టిఎంసిల చొప్పున 180 టిఎంసీల నీటిని ఎత్తిపోయడం ఈ పథకం ప్రధాన
ఉద్దేశ్యం. ఇది దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఆసియా ఖండలోనే
అతిపెద్ద సర్జిపూల్‌ను ఈ కాళేశ్వరం ప్రాజేక్టు కోసం ఏర్పాటు చేశారు. ఈ
ప్రాజేక్టు ద్వారా 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందుతుంది.
అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరికరించనున్నారు. ఈ ప్రాజేక్టు కోసం
దాదాపు 80 వేల ఎకరాల భూమిని సేకరించారు. అటవీ భూమి 3050 హెక్టార్లను
వినియోగిస్తున్నారు. 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5 టిఎంసీల
నీటిని వాడకంలోకి తీసుకురానున్నారు. ప్రాజేక్టు కింద 169 టిఎంసిలను
సాగునీటికి, ఆయకట్టు స్థిరికరణకు 34.5 టిఎంసీల నీటిని
కేటాయిస్తారు. కాళేశ్వరం నుండి హైద్రాబాద్ త్రాగునీటికి 30 టీఎంసీలు,
గ్రామాల త్రాగునీటికి 10 టిఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టిఎంసీల
నీటిని అందిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి
నీటిని కాలువల్లోకి తరలించడానికి ఉన్న పెద్ద సమస్య ఈ ప్రాంతం
దక్కన్‌పీఠభూమిలో ఉండటం. గోదావరి నది నుండి నీటిని కాలువల్లోకి పంపాలంటే
మోటార్ల ద్వారా తోడి కాలువలోకి పోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను లిప్టు
ఇరిగేషన్(ఎత్తిపోతల) పథకం అంటారు. నది నుండి నీరు కాలువలోకి రావడం,
అక్కడి నుండి సొరంగం ద్వారా ప్రయాణించడం, అక్కడి భూమిలోపల ఉన్న పంపుల
ద్వారా తిరిగి పైకి రావడం, అక్కడి నుండి కాలువలు, రిజర్వాయర్ల ద్వారా
మళ్లీ నీటిని అందించడం ఈ కాళేశ్వరం ప్రాజేక్టులో జరిగే ప్రక్రియ. ఈ
ప్రక్రియ కోసం 203 కిలోమీటర్ల పొడవైన భూగర్భ టన్నెల్స్, 2 సర్జిపూల్స్,
139 మెగావాట్ల సామర్థ్యం కల్గిన 7 పంపులు వాడుతున్నారు. ఈ కాళేశ్వరం
ప్రాజేక్టులో భాగంగా 140 టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో, 1531 కిలోమీటర్ల
ప్రధాన కాలువల డిస్ట్రిబ్యూషన్ పొడవు, 203 కి.మీ పోడవైన సొరంగాలు, 3
బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిప్టులు నిర్మాణం
చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజేక్టులో భాగంగా మొత్తం 7 లింకుల ద్వారా నీటిని
ఎత్తిపోయనున్నారు.
➯ శ్రీరాంసాగర్ ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును భారీతరహ
ప్రాజేక్టుగా పిలుస్తారు. ఈ ప్రాజేక్టు ఉత్తర తెలంగాణకు వరప్రధాయినిగా
అభివర్ణిస్తారు. పోచంపాడు ప్రాజేక్టు అని కూడా పిలుస్తారు. ఈ
ప్రాజేక్టును ఉత్తర తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా, బాల్కొండ
మండలం, పోచంపాడు వద్ద ఈ ప్రాజేక్టు నిర్మించారు. ఉత్తర తెలంగాణలోని
రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి నదిపై మొట్టమొదటి సారిగా ఈ
శ్రీరాంసాగర్ ప్రాజేక్టు నిర్మించారు. 1963 సంవత్సరంలో అప్పటి ప్రధాని
జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినారు. 1978 సంవత్సరంలో పూర్తిచేసుకొని
అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. దీని
నిల్వసామర్థ్యం 130 టిఎంసిలు ఉంటుంది. దీనికి 1091 అడుగుల పొడవు కల్గి
ఉంది. తెలంగాణలోని మొత్తం 14 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఈ
ప్రాజేక్టును నిర్మించారు. దీని దక్షిణ భాగంలో 284 కిలోమీటర్ల పొడవుతో
కాకతీయ కాలువతో పాటు 3.5 కి.మీతో లక్ష్మి కాలువను నిర్మించారు. దీని
ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు సాగు నీరు
అందిస్తుంది. దీని ఉత్తర దిశలో సరస్వతి కాలువను 47 కి.మీ పొడవుతో నిర్మించారు. దీని ద్వారా రామగుండం థర్మల్ విద్యుత్
కేంద్రానికి నీరు సరఫరా చేస్తారు. ఈ ప్రాజేక్టు నీటినీ ఎత్తిపోసే
లక్ష్యంతో అలీసాగర్, అరుగుల రాజారాం / గుత్పా ప్రాజేక్టు లు
నిర్మించారు.
➯ అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును నిజామాబాద్
జిల్లా, నవీపేట మండలం, కోస్లి గ్రామం వద్ద నిర్మించారు. శ్రీరాంసాగర్
ప్రాజేక్టు నుండి వచ్చే నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో మొత్తం 53793 ఎకరాల
ఆయకట్టు స్థిరికరణ చేయడానికి ఈ ప్రాజేక్టు నిర్మించారు.
➯ అరుగుల రాజారాం / గుత్పా ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును నిజామాబాద్
జిల్లా, నవీపేట మండలం, ఉమ్మెడ గ్రామం వద్ద నిర్మించారు. శ్రీరాంసాగర్
ప్రాజేక్టు నుండి వచ్చే నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో మొత్తం 38792 ఎకరాల
ఆయకట్టు స్థిరికరణ చేయడానికి ఈ ప్రాజేక్టు నిర్మించారు.
➯ కడెం / కడెం నారాయణ రెడ్డి ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును నిర్మల్
జిల్లా కడెం మండలం, పెద్దూర్ వద్ద కడెం నదిపై దీనిని నిర్మించారు.
దీనికి 13 టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉంది. దీనికి లెప్ట్ ప్లాంక్, రైట్
ప్లాంక్ అనే రెండు కాలువలు ఉన్నాయి.
➯ శ్రీపాద సాగర్ / ఎల్లంపల్లి ప్రాజేక్టు
:
ఈ భారీ ఎత్తిపోతల ప్రాజేక్టును
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం, ఎల్లంపల్లి వద్ద ఈ ప్రాజేక్టును
నిర్మించారు. దీనికి 60 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ ప్రాజేక్టు
2,50,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. ఈ ప్రాజేక్టు ద్వారా
పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ
ప్రాజేక్టు థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) కి 3 టిఎంసిల నీటిని
అందిస్తుంది.
➯ ప్రాణహిత / డా॥బి.ఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును కొమురంభీమ్
ఆసిఫాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టి వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజేక్టును
నిర్మించారు. 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్
రెడ్డిగారు ప్రాణహిత`చేవేళ్ల ప్రాజేక్టుగా ప్రారంభించినారు. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భారీ ప్రాజేక్టును రీడిజైన్ చేసి 1)
ప్రాణహిత ప్రాజేక్టు 2) కాళేశ్వరం ప్రాజేక్టు రెండు భాగాలుగా
విభజించారు. ఈ ప్రాణహిత ప్రాజేక్టును కొమురంభీమ్ జిల్లాలో
తుమ్మిడిహట్టి వద్ద నిర్మించారు. 1.85 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో
కొమురంభీమ్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో
దీనిని నిర్మించారు.
➯ మేడిగడ్డ ప్రాజేక్టు (కాళేశ్వరం రీడిజైనింగ్ ప్రాజేక్టు)
:
ఈ ప్రాజేక్టును జయశంకర్
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం, మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఈ
ప్రాజేక్టును నిర్మించారు. ఈ ప్రాజేక్టు ద్వారా శ్రీపాద ప్రాజేక్టుకు
160 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తుంది.
➯ దేవాదుల / జే. చొక్కారావు ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును జయశంకర్
భూపాలపల్లి జిల్లా, ఏటూరునాగారం మండలం, గంగారం వద్ద ఈ ప్రాజేక్టును
గోదావరి నదిపై నిర్మించారు. దాదాపు 60 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో
జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ అర్భన్, సిద్దిపేట, జనగాం,
యాదాద్రి జిల్లాలలోని మొత్తం 6.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే
ఉద్దేశ్యంతో ఈ ప్రాజేక్టు నిర్మించారు.
➯ కంతనపల్లి / పివి నర్సింహరావు సుజల స్రవంతి ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును ములుగు
జిల్లా ఏటూరునాగారం, కంతనపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మించారు. ఈ
ప్రాజేక్టును బహుళార్థక సాధక ప్రాజేక్టు (సాగు, త్రాగు,
విద్యుతుత్పత్తి చేసే ప్రాజేక్టు) గా రూపొందించారు. ఈ ప్రాజేక్టు
ద్వారా ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలోని 7.5
లక్షల ఎకరాలకు సాగునీరు, 8 లక్షల మందికి త్రాగు నీరు అందిస్తున్నారు. ఈ
ప్రాజేక్టు ద్వారా 2800 మెగావాట్ల విద్యుతుత్పత్తి
చేస్తున్నారు.
➪ దుమ్ముగూడెం / సీతారామా ఎత్తిపోతల ప్రాజేక్టు :
దీనిని గతంలో ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ ఉండగా జలయజ్ఞంలో భాగంగా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లో
భాగంగా నిర్మించ తలపెట్టినారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఈ ప్రాజేక్టును రీడిజైన్ చేసి
దుమ్ముగూడెం / సీతారామా ఎత్తిపోతల పథకం మార్చారు. ఈ ప్రాజేక్టును
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం, రోళ్లపాడు వద్ద ఈ
ప్రాజేక్టును నిర్మించారు. 50 టిఎంసిల సామర్థ్యంతో 5.5 లక్షల ఎకరాలకు
సాగు నీరు అందిస్తుంది.
➪ సింగూర్ / ఎం.బాగారెడ్డి ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును సంగారెడ్డి
జిల్లా కుల్కుర్ మండలం, సింగూర్ వద్ద గోదావరి నది ఉపనది అయిన
మంజీరా నదిపై నిర్మించారు. ఇది బహుళార్థక సాధక ప్రాజేక్టు (సాగు,
త్రాగు, విద్యుతుత్పత్తి చేసే ప్రాజేక్టు) గా రూపొందించారు. ఈ
ప్రాజేక్టు 30 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో 4000 ఎకరాలకు సాగునీరు
అందిస్తుంది. హైద్రాబాద్ జంటనగరాలకు త్రాగునీరు అందిస్తుంది. 15
మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
➪ నిజాంసాగర్ :
ఈ ప్రాజేక్టును కామారెడ్డి
జిల్లా అచ్చంపేట వద్ద నిర్మించారు. దీనికి గోదావరి ఉపనది మంజీరా
నదిపై నిర్మించారు. అప్పటి హైద్రాబాద్ స్టేట్ చీఫ్ ఇంజనీర్‌గా
పనిచేసిన నవార్ ఆలీ నవాజంగ్ బహదూర్ దీని నిర్మాణాన్ని
పర్యవేక్షించారు. 17.8 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో కామారెడ్డి,
నిజామాబాద్ జిల్లాలలోని 2.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
దీనికి ఫతే నహర్ కాలువ (లెప్ట్), మహబూబ్ నహార్ (రైట్) అనే రెండు
ప్రాజేక్టులు ఉన్నాయి.
➪ ఎగువమానేరు
:
ఈ ప్రాజేక్టును
రాజన్నసిరిసిల్ల జిల్లా నర్మాల వద్ద గోదావరి ఉపనది అయిన మానేరు నదిపై
నిర్మించారు. 3 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో రాజన్నసిరిసిల్ల
జిల్లాలోని 13000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
➪ మద్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజేక్టు :
ఈ ప్రాజేక్టును
రాజన్నసిరిసిల్ల జిల్లాలో గోదావరి నది ఉపనది అయిన మానేరు నదిపై
నిర్మించారు. ఈ ప్రాజేక్టు 20 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో
రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు సాగు నీరు
అందిస్తున్నారు.
➪ దిగువమానేరు :
ఈ ప్రాజేక్టు కరీంనగర్
జిల్లాలో 1985 సంవత్సరంలో మానేరు నదిపై నిర్మించారు. 24 టిఎంసిల
నిల్వ సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాకు సాగునీరు
అందిస్తుంది.
0 Comments