Bonalu Festival in telugu || తెలంగాణ బోనాల పండుగ విశిష్టత || Gk in Telugu || General Knowledge in Telugu

Bonalu Festival in telugu || తెలంగాణ బోనాల పండుగ విశిష్టత

బోనాల పండుగ విశిష్టత 

Gk in Telugu || General Knowledge in Telugu

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాలు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలలో బోనాలు ముందువరుసలో ఉంటుంది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం జూన్‌ / జూలై నెలలో ప్రారంభమయ్యే ఆషాడమాసంలో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అనేది హిందూవులందరు కలిసికట్టుగా పరమభక్తితో జరుపుకునే విశిష్టమైన పండుగ. ప్రతి సంవత్సరం హైద్రాబాద్‌ మరియు సికింద్రాబాద్‌ జంటనగరాలలో ఘనంగా నిర్వహించుకుంటారు. గోల్కోండలో ఉన్న జగదాంబిక ఆలయంలో మొదటి బోనం ఎత్తుకోవడంతో పండుగ ప్రారంభమవుతుంది.  ఆ తర్వాతే ఇతర చోట్ల బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

‘‘బోనమ్‌’’ అంటే భోజనం అని అర్థం వస్తుంది. ఒక కొత్త కుండ / రాగి బిందెను శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలకంరించి అందులో అన్నం- బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు, ఆకుకూర అన్నం కలిపి చేసే నైవేద్యాన్ని ‘‘ బోనం’’ అని పిలుస్తారు. మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో వండిన బోనాన్ని తలపై పెట్టుకొని డప్పు చపుళ్లతో, పోతురాజు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి దేవాలయాల వద్ద మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పోలేరమ్మ, ఆంకాలమ్మ, మరెమ్మ, నూకాలమ్మ వంటి రూపాల్లో ఉన్న దేవి అమ్మవారికి  గాజులు మరియు చీరలతో కలిపి బోనం సమర్పిస్తారు. ఈ బోనాలను అమ్మవారికి సమర్పించే సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించి ఊరేగింపుగా వెళ్లి ఎంతో ఆనందోత్సహాలతో బోనాల పండుగను జరుపుకుంటారు. 

బోనాల పండుగ విశిష్టత

1813 సంవత్సరంలో  హైద్రాబాద్‌ సంస్థానంలో ప్లేగు వ్యాది తీవ్రంగా ప్రబలి వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీనికి ముందు, హైదరాబాద్‌ నుండి ఒక మిలటరీ బెటాలియన్‌ ఉజ్జయినికి పంపబడిరది. హైదరాబాద్‌కు చెందిన ఈ సైనిక బెటాలియన్‌ జంట నగరాల్లో అంటువ్యాధి గురించి తెలుసుకున్నప్పుడు, వారు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో మాతృ దేవతను ప్రార్థించారు. బెటాలియన్‌ ప్లేగు వ్యాదిని పూర్తిగా నిర్మూలించాలని, ఈ వ్యాది పూర్తి నశించిపోతే దేవి విగ్రహాన్ని ప్రతిష్టామని మహాకాళి దేవతను ప్రార్థించారు. వారు ప్రార్థించినట్లుగానే కొన్ని రోజుల్లో ప్లేగు వ్యాది పూర్తిగా నశించిపోయింది.  అప్పుడు, బెటాలియన్‌ నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు, దాని తర్వాత ఆమెకు బోనాలు సమర్పించారు.

ఆచారం

బోనాల పండుగను హైద్రాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు. ఆషాడంలో హైద్రాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద వేడుకలు ప్రారంభమవుతాయి. తర్వాత సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, బాల్కంపేటలోని బాల్కంపేట యెల్లమ్మ ఆలయం, చిల్కల్‌గూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్టా మైసమ్మ ఆలయం, లాల్‌ దార్వాజ ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మదన్నా ఆలయం, షా అలీ బండాలోని ముత్యలమ్మ ఆలయం వంటి ఇతర దేవాలయాలు బోనలు జరుపుకునే ప్రసిద్ధ వేదికలు. లక్షల మంది భక్తులు మహాంకాళి ఆశీస్సులు పొందడానికి ఆలయాలకు తండోపతండాలుగా వస్తారు. ఈ బోనాల పండుగ సందర్భంగా మహిళలు, భక్తులు కొత్త సాంప్రదాయ దుస్తులను అమ్మవారిని పూజిస్తారు. 

పోతురాజు నృత్యాలు

ఈ బోనాల పండుగలో ప్రత్యేకార్షణగా పోతురాజు నిలుస్తాడు. ఈ పోతురాజు వేషధారణ ధరించిన వ్యక్తి చేసే నృత్యాలు చూడడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. పోతురాజు వేషధారణలో భాగంగా ఒళ్లంతా పసుపు పూసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, పసుపు నీటిలో తడిపిన ఎర్రటి వస్త్రం కట్టుకొని, కంటికి కాటుక, నుదిటిపై ఎబ్రొట్టు, నడుముకు వేపాకు తోరణం కట్టుకొని, పసుపురంగు కొరడా కట్టుకొని బోనాల ఊరేగింపు ముందర నృత్యం చేస్తు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాడు. 

భక్తి శ్రద్ధలతో బోనం సమర్పణ.

సాధారణంగా ఒంటికి చలువ చేసే పదార్థాలతో ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఒక కొత్త కుండ లేదా రాగి బిందెను శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలకంరించి అందులో అన్నం- బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు, ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఈ బోనం వేకువనే వండి సిద్ధంగా ఉంచుతారు.  ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటే చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లును కూడా బోనంతో పాటుగా మరో పాత్రలో తీసుకెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బోనాన్ని ప్రసాదంగా ఇవ్వడం, పంటపొలాల్లో చల్లడం చేస్తారు.

బోనాల పండగ నిర్వహించటం వెనక ముఖ్య ఉద్దేశ్యం:

గ్రామ దేవతలను కొలిచే పండుగ ఇది. ఆషాడమాసంలో ప్రకృతిసిద్ధంగా వచ్చే వరదలు, అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అంటూ మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ వంటి వివిధ రూపాల్లో ఉండే అమ్మవారిని  భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను కలిగించమని మొక్కుకోవడమే ఈ బోనాల పండుగ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 

చివరి రంగం

బోనాల చివరి దశంలో  తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఈ రంగంతో బోనాల పండుగ ముగుస్తుంది. 

Post a Comment

0 Comments