
వివేకంతో విజయం Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
కథలు మనకు మానసికోల్లాసాన్ని ఇస్తాయి. చిన్నప్పుడు మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలతో మనం హాయిగా నిద్రపోయేవాళ్లము. అంతేకాకుండా కథలు మన నిత్యజీవితంలో జరిగే సంఘటలను ప్రతిరూపంగా ఉంటాయి. నీతి కథలు చిన్నారులను, పెద్దలను ఆలోజింపజేస్తాయి. వాటిలోని విషయాలను గ్రహించి మంచిచెడులను గుర్తించవచ్చు. ఇలా కథలు మన జీవితంలో భాగంగా పూర్వకాలం నుండి ఉన్నాయి.
ఒక రాజు తన రాజ్యానికి చెందిన ఆస్థానంలో వివిధ శాఖలను పర్యవేక్షించడానికి అధికారులను నియమించాలని అనుకున్నాడు. గురుకుల ఆశ్రమాన్ని నడిపించే మునీశ్వరుని వద్దకు తన మంత్రిని పంపించాడు. మంత్రి రాజు గురించి వివరించి ఇలా అన్నాడు ‘‘మునీశ్వర మీ యొక్క గురుకులంలో సకల విద్యలలో ఆరితేరిన వారు, తెలివైన విద్యార్థులు ఎందరు ఉన్నారో చెప్పండి ’’ అని అన్నాడు. దీంతో మునీశ్వరుడు‘‘మంత్రివర్యా ! నాకు విద్యార్థులందరు సమానమే !! కానీ ప్రస్తుతం నా వద్ద సకల విద్యలు పూర్తి చేసుకున్నవారు తొమ్మిది మంది ఉన్నారు. మీరు సామాన్యుని వేషంలో వచ్చి వారిలో తెలివైన వారిని కనిపెట్టి తీసుకెళ్లండి ’’ అని అన్నాడు. దీంతో మంత్రి తర్వాతి రోజు మారువేషంలో గురుకులానికి వచ్చాడు. మునీశ్వరుడు మారువేషంలో ఉన్న మంత్రి గురించి గురుకులంలోని విద్యార్థులందరికి పరిచయం చేశాడు.
మంత్రి ముందుగా గోశాలకు వెళ్లాడు. అక్కడ రాఘవ, విక్రమ, రాజశేఖరుడు అనే ముగ్గురు వ్యక్తులు పాలు పిండడానికి సిద్దమయ్యారు. అందులో రాఘవ ఆవుకు నమస్కరించి ‘‘అమ్మా ! బాగున్నావా ?’ అని తలతో పాటు ఆవు ఒళ్లంతా నిమిరాడు. తర్వాత దానికి పచ్చగడ్డి వేసి, పాల ఇచ్చే పొదుగు శుభ్రం చేసి బిందెలో పాలు పితికాడు. విక్రమున్ని, రాజశేఖరున్ని మంత్రి పరిశీలించాడు. వారు ఆవులకు మాములగా పచ్చగడ్డి వేసి పొదుగు నామమాత్రంగా శుభ్రం చేసి పాలు పితికారు. రాఘవుడు పిండిన పాలలో కనీసం సగం కూడా వారి బిందెలో లేవు.
తర్వాతి రోజున గురుకులానికి కావాల్సిన నిత్యావసర వస్తువులతో కూడిన చీటిని వ్రాసి సుందరయ్య , రంగయ్య, లింగయ్య అనే ముగ్గురికి ఇచ్చాడు. వీరి ముగ్గురితో పాటు మంత్రి కూడా సంతకు వెళ్లాడు. ముందుగా సుందరయ్యను పరిశీలించాడు మంత్రి. సుందరయ్య కొన్ని దుకాణాలలో సరుకుల ధరలను తెలుసుకున్నాడు. తర్వాత తక్కువ ధరకు నాణ్యమైనవి కొన్నాడు. రంగయ్య, లింగయ్య లను కూడా మంత్రి పరిశీలించాడు. వారు దుకాణాలలో నాణ్యమైన సరుకును కొనుకపోగా అధికధర చెల్లించారు.
ఆ తర్వాతి రోజున గ్రామాధికారి గురుకులానికి వచ్చి ‘‘ మీ గురుకులాన్ని చూడడానికి పది మంది వ్యక్తులు వస్తున్నారు. వారికి కావాల్సిన వంట ఏర్పాట్లు చేయండి ’’ అని చెప్పి వెళ్లాడు. మునీశ్వరుడు వంటశాలను పర్యవేక్షించే వెంకటయ్య, సూరయ్య, భీమయ్యలను పిలిచి ఎంత అన్నం మిగిలి ఉంది. మిగతా పదార్ధాలు సరిపోతాయా ! చూడమని చెప్పాడు.
‘‘ అన్నం కొద్దికొద్దిగా వడ్డీస్తే అయిదుగురికి సరిపోతుంది. కానీ కూరలు లేవు ’’ అని సూరయ్య, భీమయ్య అన్నారు. వెంకటయ్య మాత్రం ‘‘ఫర్లేదు వారిని రానీయండి ’ అన్నాడు. వెంకటయ్య ఒక నల్ల ఫలకం తీసుకొని దానిపై సుద్ద ముక్కతో ‘‘నేటి సుభాషితాలు ’ అని రాశాడు. దాని కింద ‘‘ మంచి ఆరోగ్యానికి రెండు సూత్రాలు ఒకటి తక్కువగా మాట్లాడడం, రెండు మితంగా భోజనం చేయడం అని రాసి భోజనశాల బయట గోడకు వేలాడదీసాడు. పదిమంది కూర్చోవడానికి బల్లలు వేయించాడు. పదిమందికి వెంకటయ్య కాచిన ఆవు పాలలలో బెల్లం వేసి ఇచ్చాడు. ‘‘ఇంత కమ్మటి పాలను ఎన్నడూ తాగలేము ’’ అన్నారు వారు. ‘కాసేపు ఆగి భోజనం చేద్దురు గాని ’ అన్నాడు వెంకటయ్య. ఆ వచ్చిన వారు గురుకులం అంతా కలియతిరిగి వచ్చే లోపల భీమయ్య ఆ మిగిలిన అన్నంతో పులిహోర చేశాడు.
వారంతా తిరిగి వచ్చాక వారికి అరటిఆకులు వేశారు. ‘‘కమ్మని పాలు తాగాం. ఏదైనా మితంగానే వడ్డించండి’’ అన్నారు వారు. వెంకటయ్య ఒక్కొక్కరికి కొద్దికొద్దిగా పులిహోర వడ్డించాడు. ‘‘ఈ పులిహోర కూడా చాలా రుచిగా ఉంది ’’ అని. ఆ వడ్డించిన దానితోనే వారు సరిపెట్టుకున్నారు. తర్వాత వారు వెళ్లి వస్తామని విద్యార్థులకు, మునీశ్వరునికి చెప్పి సెలవు తీసుకున్నారు. కాసేపటికి మంత్రి కూడా కోటకు చేరుకున్నాడు. కోటకు చేరుకున్న మంత్రి రాజుతో గురకులంలోని తెలివిగల విద్యార్థుల వివరాలు చెప్పాడు.
పశువుల శాఖ రాఘవున్ని, సరుకులు తెచ్చిన సుందరయ్య, వంటశాలలోని వెంకటయ్యను పర్యవేక్షలుగా నియమిస్తూ రాజు ఉత్తర్వులను గురుకులానికి పంపాడు.
Moral of the Story : తెలివితో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు
0 Comments