
కొమరం భీం Komaram Bheem Story in Telugu
కొమరం భీం ప్రత్యేకమైన ఆదివాసీ రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం, ఆదివాసీ హక్కుల కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప ఆదివాసీ నాయకుడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంకెపల్లి గ్రామంలో కొమరం చిన్నూ - సోంబాయి దంపతులకు కొమరం భీం జన్మించాడు. అతడికి పదిహేను సంవత్సరాల వయస్సున్నప్పుడు అటవీశాఖ వాళ్ల దాడిలో అతని తండ్రి మరణించాడు. దాంతో భీం కుటుంబం కెరిమెరి మండలంలోని సర్దాపూర్ గ్రామానికి వలస వెళ్లారు.
అతడు పోడు పద్దతితో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా నిజాంకి ఇన్‌ఫార్మర్‌గా ఉన్న సిద్దికి అనే జాగిర్దారు భీం పొలాలను ఆక్రమించుకున్నాడు. కోపంతో రగిలిపోయిన కొమరం భీం అతన్ని చంపేశాడు. పోలీసు చెరనుండి తప్పించుకున్న భీం అసోం పారిపోయాడు. అక్కడ కార్మికుల ఆందోళనలను చూశాడు. చదవటం, రాయటం నేర్చుకున్నాడు. అతని మిత్రుడైన కొమరం సురు నుండి రహస్యంగా తమ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు భీం తెలుసుకునేవాడు. విశాఖపట్టణంలోని అల్లూరి సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో భీం స్పూర్తి పొంది నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు.
Also Read :
అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం ‘బంబ్‌రాం’ ‘దూపపెట్టి’ అన్న పేరుతో పన్ను వసూలు చేసింది. ఈ పన్ను కట్టవద్దని, తమ హక్కులు జాతి స్వేచ్ఛకోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన ‘‘జల్ జంగల్ జమీన్’’ (నీరు, అడవి, భూమి) పిలుపుకు ఆదివాసీలు స్పందించారు. భూమికోసం అప్పటి అదిలాబాద్‌లోని 12 గ్రామాలు పోరాటానికి సిద్దమయ్యాయి. గొండు, కోయ యువకులతో కొమరం భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాల ఉపయోగంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు.
జోడేఘాట్‌ని కేంద్రంగా చేసుకొని భీం తన గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. ఈ దాడులతో ఉలిక్కిపడిన నిజాం ప్రభుత్వం ఆదివాసీలను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి 27 అక్టోబర్ 1940 రోజున జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరిగిన పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందాడు. ఆ తర్వాత గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయటానికి నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్‌ని నియమించింది.
0 Comments