Delhi Sultanate in Telugu | ఢిల్లీ సుల్తానులు | Indian History in Telugu | telugutechbadi

Delhi Sultanate in Telugu | ఢిల్లీ సుల్తానులు

 ఢిల్లీ సుల్తానులు 
Delhi Sultanate in Telugu | Indian History in Telugu | Gk in Telugu | Delhi Sultanate Rulers, time, history in Telugu 

ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్‌, సయ్యద్‌, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం. 

క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి. 

1) బానిస వంశం (1206-1290)

2) ఖిల్జీ వంశం (1290-1320)

3) తుగ్లక్‌ వంశం (1320-1414)

4) సయ్యద్‌ వంశం (1414-1451)

5) లోడీ వంశం (1451-1526) 


బానిస వంశం 

కుతుబుద్దీన్‌ ఐబక్‌ బానిస వంశాన్ని 1206 సంవత్సరంలో స్థాపించాడు. మహ్మద్‌ఘోరి మరణాంతరం స్వాతంత్రంగా 1210 వరకు భారతదేశాన్ని పరిపాలించాడు. బానిస వంశంలో కుతుబుద్దిన్‌తో పాటు ఇల్‌టుట్‌మిష్‌, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్‌ బాల్పన్‌ రాజులు పరిపాలించారు. బానిస వంశాన్ని మామ్లూక్‌ వంశం అని కూడా పిలుస్తారు. బానిస వంశం భారతదేశాన్ని 1206 నుండి 1290 వరకు పరిపాలించారు. 

➠ కుతుబుద్దీన్‌ ఐబక్‌ (1206-1210) :

మహ్మద్‌ ఘోరీ చక్రవర్తికి సేనానిగా పనిచేసిన కుతుబుద్దీన్‌ ఐబక్‌ తన శక్తి యుక్తులతో  భారతదేశం ఘోరీ  ప్రతినిధిగా నియమితుడయ్యాడు. మహ్మద్‌ ఘోరి మరణాంతరం క్రీ.శ.1206 సంవత్సరంలో ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అలీమర్ధాన్‌ను ఓడించి  ఆయన స్థానంలో మహ్మద్‌ షేరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్‌ఉద్దీన్‌ యల్‌డజ్‌ ఢిల్లీపై దండేత్తినప్పుడు అతన్ని ఐబక్‌ ఓడించాడు. ఇతను లాహోర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. భారతదేశంపై ముస్లిం దండయాత్రకు చిహ్నంగా ఢిల్లీలో కుతుబ్‌మినార్‌ను నిర్మించాడు. ఢిల్లీ ఆక్రమణకు గుర్తుగా ఢిల్లీలో కువ్వత్‌ ఉల్‌ ఇస్లామ్‌ మసీదును నిర్మించాడు. ఇతనికి లాక్‌ బక్ష్‌, సిఫాసలార్‌ అనే బిరుదులున్నాయి. కుతుబుద్దీన్‌ ఐబక్‌ చౌగాన్‌ (పోలో) ఆటాడుతూ గుర్రం మీద నుండి పడిపోయి 1210 లో మరణించాడు. ఇతని మరణాంతరం ఇతని కుమారుడు ఆరాంషా ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు. 

➠ ఇల్‌టుట్‌ మిష్‌ (1211-1236) :

కుతుబుద్దీన్‌ ఐబక్‌ మరణాంతరం సింహాసాన్ని అధిష్టించిన ఆరాంషాను గద్దెదించి 1211 లో ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కుమార్తెను ఇల్‌టుట్‌మిష్‌ వివాహం చేసుకున్నాడు. ఇతడు తురుష్కులలో ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇతను ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతను ఘజనీ రాజు తాజ్‌ఉద్దీన్‌ యల్‌డజ్‌ను, ముల్తాన్‌ రాజు నాసిరుద్దీన్‌ కుబాచాలను ఓడించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతను ‘ఇక్తా’ అనే సైనిక పద్దతిని ప్రవేశపెట్టాడు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ ప్రారంభించిన కుతుబ్‌ మినార్‌ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతని కాలంలో టంకా(వెండి నాణేలు), జిటాల్‌ (రాగినాణేలు) ముద్రించాడు. ఉజ్జయిని మహంకాళీ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అజ్మీర్‌లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ నిర్మించిన అర్హదిన్‌ కాంజోంప్టా మసీదును సుందరంగా తీర్చిదిద్దాడు. ఇతను 1236లో మరణించాడు. 

➠ రజియా సుల్తానా (1236-1240) :

రజియా సుల్తానా ఇల్‌టుట్‌ మిష్‌ మరణాంతరం ఢిల్లీ సింహసాన్ని అధిష్టించడం ద్వారా భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళగా కీర్తి సాధించింది. ఈమె ఇల్‌టుట్‌మిష్‌ యొక్క కూతురు. ఈమె శక్తియుక్తులను తెలుసుకున్న ఇల్‌టుట్‌ మిష్‌ తన ఇద్దరు కుమారులను కాదని రజియా సుల్తానాను తన వారసురాలిగా ప్రకటించాడు. దీంతో ఒక మహిళ పాలకురాలు కావడం జీర్ణించుకోలేని సామంతులు, సర్దార్‌లు ఈమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. వీటిని రజియా సుల్తానా సమర్థవంతంగా అణచివేసింది. ఈమె కాలంలో మాలిక్‌ జమాలుద్దీన్‌ యాకూత్‌ అనే అబిసీనియా దేశస్థుడు అశ్వధళాధిపతిగా నియమితుడయ్యాడు. ఈ నియామకాన్ని వ్యతిరేకించిన ముస్లీంలు, సర్దారులు అల్‌తునియాతో చేతులు కలిపి రజియా సుల్తానాను ఓడించి జైలులో బంధించారు. కారాగారం నుండి తప్పించుకున్న రజియా సుల్తానాను 1240లో ఖైతాల్‌ అనే ప్రాంతంలో హత్య చేయడం జరిగింది. 

➠ ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ (1266-1287) :

బాల్బన్‌ ఇల్‌టుట్‌మిష్‌ యొక్క బానిసగా పనిచేశాడు. ఇతను బానిస రాజులలో గొప్పవాడు. ఇతని మొదటి పేరు బహాఉద్దీన్‌. ఇల్‌టుట్‌ మిష్‌ కుమార్తెను బాల్బన్‌ వివాహం చేసుకొని చిహల్‌గనీలో సభ్యుడయ్యాడు. నాసిరుద్దీన్‌ మరణాంతరం 1266లో సింహాసనమెక్కిన బాల్బన్‌ ‘ఘియాన్‌ ఉద్దీన్‌’ అనే బిరుదును ధరించాడు. భగవంతుని నీడ అనే బిరుదుని ధరించాడు. మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టి పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో ప్రారంభించిన చిహల్‌ గనీని పూర్తిగా  మూయించాడు. రాజరికం దైవదత్తమనే సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు, ఇతనిని మధ్యయుగ భారతదేశ ఉక్కుమనిషి అని పిలుస్తారు. గూఢచారి విధానాన్ని, పర్షియా రాజరిక విధానాన్ని, చాంబర్లీన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇస్లాం మత సర్వసమానత్వం నుండి వైదొలగినాడు. బెంగాల్‌ గవర్నర్‌ టుగ్రిల్‌ఖాన్‌ను అణిచివేశాడు. రాజుకు సాష్టాంగ నమస్కారం చేసే ‘సిజ్జా’ పద్దతిని, సుల్తాన్‌ పదాలను ముద్దుపెట్టుకునే ‘పైబోస్‌’ పద్దతులను ప్రవేశపెట్టాడు. నౌరోజ్‌ అనే పండుగను ప్రవేశపెట్టాడు. సైనిక వ్యవస్థలో వృద్దాప్య పెన్షన్‌ పద్దతిని ప్రవేశపెట్టాడు. అడవులను నరికించి వ్యవసాయ భూములగా మార్చాడు. ఇతని మరణాంతరం ఇతను మనమడు అయిన కైకుబాద్‌ సింహసనాన్ని అధిష్టించాడు. 

➠ కైకుబాద్‌ (1286-1990) :

ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ మరణాంతరం ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు. ఇతడు ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ యొక్క మనుమడు. ఇతని సేనాపతిగా పనిచేసిన జలాలుద్దీన్‌ ఖిల్జీ ఇతన్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. 



Also Read :



ఖిల్జీ వంశం (1290-1320)

➠ జలాలుద్దీన్‌ ఖిల్జీ (1290-96) :

1206-1290 వరకు పరిపాలించిన బానిస వంశ చివరి రాజైన కైకుబాద్‌ ను అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ఇతడు తన కుమార్తెను అల్లా ఉద్దీన్‌ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేసాడు. మాలిక్‌చజ్జూ లాంటి తిరుగుబాటుదారులను అణిచివేసి శాంతిభద్రతలను నెలకొల్పాడు. లొంగిపోయిన మంగోలులు ఇతడి కాలంలోనే ‘నయా ముస్లీంలు’ గా అవతరించారు. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ యాదవ రాజ్యంపై విజయం సాధించినందుకు అభినందించడానికి వెళుతుండగా ఇతను హత్యకు గురయ్యాడు. 

2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ (1296-1316) :

ఇతని అసలు పేరు అలీ గుర్షాన్స్‌. జలాలుద్దీన్‌ కాలంలో గవర్నర్‌గా పనిచేసిన ఇతను జలాలుద్దీన్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతను 1293 యాదవ రాజ్యంపై దండెత్తి యాదవ రాజు రామచంద్ర దేవుడిని ఓడించి  అపార ధనరాశులను కొల్లగొట్టాడు. తనను అభినందించడానికి వస్తున్న జలాలుద్దీన్‌ ఖిల్జీని హత్యచేయించి 1296లో ఢిల్లీ సుల్తానుల సింహసాన్ని అధిష్టించాడు. ఖిల్జీ వంశస్థులలో గొప్ప రాజుగా  పేరుపొందాడు. ఇతనికి యామిన్‌ ఉల్‌ ఖిలాఫత్‌ నాసిర్‌, అమీర్‌ ఉల్‌ ముమూనిస్‌, రెండవ అలెగ్జాండర్‌ అనే బిరుదున్నాయి. దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొదటి ముస్లీం రాజు. ఇతని కాలంలో మతపోషణకు దానం ఇచ్చిన భూములు తిరిగి తీసుకున్నాడు. సరాయ్‌ అదీల్‌ అనే మార్కెట్‌ను స్థాపించాడు. తూనికలు, కొలతలతో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇతడు పారశీక కవులైన అమీర్‌ హసన్‌, అమీర్‌ ఖుస్రూలను పోషించాడు. అమీర్‌ ఖుస్రూ ‘తారీఖి-ఇ-అలై అనే గ్రంథాన్ని రచించాడు. అమీర్‌ ఖుస్రూ ఈ గ్రంథంలో అల్లాఉద్దీన్‌ విజయాలను విశదీకరించాడు. గుర్రాలను జాగీరుదార్లు మోసం చేయకుండా ఉండేందుకు గుర్రాలమీద ముద్రలు వేయించేవాడు. పదవిని సూచించే పేర్లను పెట్టే పద్దతి ప్రవేశపెట్టాడు. 1311లో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ఢిల్లీలో కుతుబ్‌ మినార్‌ సమీపంలో అలాయ్‌ కోట నిర్మించాడు. దీనికి 7 ద్వారాలు ఉన్నాయి. జమాత్‌ఖానా మసీదును అల్లాఉద్దీన్‌ ఖిల్జీ నిర్మించాడు. ఇతను 1316లో మరణించాడు.  

ఉత్తర భారతదేశం - దండయాత్రలు :

ఇతను గుజరాత్‌, రణతంభోర్‌, చిత్తోడ్‌, మాల్వా వంటి ప్రాంతాలపై దండెత్తి ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. గుజరాత్‌ పాలకుడైన కర్ణదేవుడిని ఓడించి  అతని భార్య కమలాదేవీని తన భార్యగా చేసుకున్నాడు. రణతంభోర్‌ రాజ్యంపై దండెత్తి హంవీందేవుడిని ఓడించాడు. చిత్తోడ్‌ రాజ్యంపై దాడి చేశాడు. చిత్తోడ్‌ రాజు రాణా రతన్‌సింగ్‌ భార్య పద్మావతిని పొందాలనే ఉద్దేశ్యంతో ఈ దండయాత్ర చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. రతన్‌సింగ్‌ మరణించడంతో రాణి పద్మిని అంత:పుర స్త్రీలతో కలిసి అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మొత్తం కథను మాలిక్‌ మహమ్మద్‌ జయసి అనే కవి పద్మావత్‌ అనే గ్రంథంగా రాశాడు. చిత్తోడ్‌ను ఆక్రమించిన అల్లాఉద్దీన్‌ ఖిల్జీ దానికి ఖజీరాబాద్‌ అనే పేరు పెట్టాడు. 

దక్షిణ భారతదేశం - దండయాత్రలు :

అల్లాఉద్దీన్‌ ఖిల్జీ తన సేనాని అయిన మాలిక్‌ కపూర్‌ నాయకత్వంలో దక్షిణ భారతదేశంపై దండెత్తి యాదవ, కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాలను ఓడించి కప్పం వసూలు చేశాడు. దేవగిరిని పరిపాలిస్తున్న యాదవ రాజు రామచంద్ర దేవుడిని ఓడించి  కప్పం వసూలు చేశాడు. ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ చక్రవర్తి  రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి కప్పం వసూలు చేశాడు. హోయసాల రాజు మూడో భల్లాలుడిని ఓడించాడు. పాండ్యరాజు అయిన వీరపాండ్యుడిని ఓడించి అతని సోదరుడు సుందర పాండ్యుడిని రాజును చేసి అపార ధనరాళులను పొందాడు.

➠ ముబారక్‌ ఖిల్జీ (1316-1320) :

ఇతను ఖలీపా అని పేరుపెట్టుకున్న మొదటి ఢిల్లీ సుల్తాన్‌ ముబారక్‌ ఖిల్జీ. ఇతను తనను తానుగా ఖలీఫా అని ప్రకటించుకున్నాడు. ముబారక్‌ కుతుబ్‌ఉద్దీన్‌ అనే బిరుదును ధరించి కుతుబుద్దీన్‌ ముబారక్‌గా పేరుపొందాడు. ఖుస్రూఖాన్‌ అనే వ్యక్తి ముబారక్‌ ఖిల్జీని అంతం చేసి కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ఏకైక హిందువు ఖుస్రూఖాన్‌. ఇతని సేనాపతి, ముబారక్‌ వారసుడైన ఘాజీమాలిక్‌ ఖుస్రూఖాన్‌ను చంపి 1320లో సింహాసనం అధిష్టించాడు.


తుగ్లక్‌ వంశం (1320-1414)

భారతదేశంలో ఢిల్లీని ఎక్కువ కాలం పరిపాలించిన వంశం తుగ్లక్‌ వంశం.  వీరు 1320 నుండి 1414 వరకు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తుగ్లక్‌ వంశం తురుష్కుల్లో కరోనా అనే తెగకు చెందినవారు. 

➠ ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ (1320-1325) : 

తుగ్లక్‌ వంశాన్ని స్థాపించిన వాడు ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్‌ అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని కుమారుడైన జునాఖాన్‌ 1323లో వరంగల్‌పై దాడిచేసి ప్రతాపరుద్రుణ్ని ఓడించాడు. వరంగల్‌ను సుల్తాన్‌పూర్‌ అనే పేరుపెట్టి దానిని ఢిల్లీ రాజ్యంలో కలిపాడు. క్రి.శ1325లో కుమారుడు మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (జునాఖాన్‌) చేత హత్యగావింపబడ్డాడు.

➠ మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ (1325-1351) :

ఇతని అసలు పేరు జునాఖాన్‌. ఇతడు గొప్ప పండితునిగా పేరుగాంచాడు. ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైక ఢిల్లీ సుల్తాన్‌  మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ గొప్ప పాండిత్యం సాధించినందువల్ల ఇతన్ని బరౌనీ ‘సృష్టి వైపరిత్యం’ అని శ్లాఘించాడు. 1327లో రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. దేవగిరికి దౌలతాబాద్‌ అని పేరు పెట్టాడు. బంగారు, వెండి నాణేల స్థానంలో రాగి నాణేలు ప్రవేశపెట్టాడు. ప్రజల సౌకర్యార్థం చిన్న నాణేలను చలామణిలోకి తెచ్చాడు. దీనార్‌ అనే కొత్త నాణేన్ని, అదాలీ అనే వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. దివాన్‌-ఇ-కోహి అనే వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి రైతులకు సోన్‌దార్‌ అను ఋణాలు ఇచ్చాడు. ఇతను తన విరుద్ద పాలన వల్ల ‘పిచ్చి తుగ్లక్‌’ గా పేరొందాడు. ఇతని కాలంలోనే దక్షిణాన విజయనగర సామ్రాజ్యం(1336) , బహమనీ సామ్రాజ్యం (1347)  స్థాపించబడ్డాయి.  

➠ ఫిరోజ్‌ షా తుగ్లక్‌ (1351-1388) :

మహ్మద్‌  బిన్‌ తుగ్లక్‌ మరణాంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరిపాలించాడు . ఇతనికి నాయక్‌ --ఇ-అమీర్‌-ఉల్‌-ఫిరోజ్‌ అనే బిరుదు కలదు. ఫతూహత్‌ -ఇ-ఫిరోజ్‌షాహీ అనే స్వీయచరిత్ర రాసుకున్న మొట్టమొదటి రాజు కీర్తి సాధించాడు. ఇతని కాలంలో పూరిలోని జగన్నాధాలయం, నాగర్‌కోట్‌లోని జ్వాలా ముఖి ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. జిజియా పన్ను వసూలు చేశాడు. హిందువుల మేళాలపై ఆంక్షలు విధించాడు. విద్యావ్యాప్తి కొరకు మదర్సాలను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ చుట్టు 1200 ఉద్యానవనాలు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఇతనిని ఉద్యనవనాల రాజు అని పిలుస్తారు. ఇతని కాలంలో ఫిరోజాబాద్‌, జాన్‌పూర్‌, హిస్సార్‌, ఫతేబాద్‌ నగరాలు నిర్మించబడ్డాయి. తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దివాన్‌-ఇ-ఖైరాత్‌ అనే ఒక దానధర్మాల శాఖను ఏర్పాటు చేసి పేదబాలికల వివాహలకు ఆర్థిక సహాయం చేశాడు. ఫిరోజ్‌షా కాలంలో పిడుగుపాటు వల్ల కుతుబ్‌మినార్‌లో 4వ అంతస్తులోని మినార్‌ ధ్వంసం అయ్యింది. ఇతడు 1388లో మరణించాడు. 

➠ నాసిరుద్దీన్‌ మహ్మద్‌ (1394-1413) :

ఇతనికి నాసర్‌ఉద్దీన్‌ మహమూద్‌ అనే బిరుదు కలదు. ఇతడు తుగ్లక్‌ వంశంలో చివరిరాజు. తైమూర్‌ దండయాత్ర ఇతని కాలంలోనే జరిగింది. తైమూర్‌ దండయాత్ర వల్ల తుగ్లక్‌ వంశ ప్రతిష్ట అంతరించి ఢిల్లీ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది.


సయ్యద్‌ వంశం (1414-1451)

తుగ్లక్‌ వంశం తర్వాత భారతదేశాన్ని సయ్యద్‌ వంశం పరిపాలించింది. వీరు 1414 నుండి 1451  వరకు సుల్తానత్‌ రాజ్యాన్ని పరిపాలించారు. సయ్యద్‌ వంశాన్ని ఖిజర్‌ఖాన్‌ స్థాపించాడు. 

➠ ఖిజర్‌ ఖాన్‌ (1414-1421) :

ఖిజర్‌ ఖాన్‌ సయ్యద్‌ వంశాన్ని స్థాపించాడు. తాను ఢిల్లీని పరిపాలించినంత కాలం సుల్తాన్‌ అనే బిరుదు ధరించక, తైమూర్‌కు డబ్బు కానుకలను పంపాడు. ఖిజర్‌ఖాన్‌ అనంతరం అతని కుమారుడు ముబారక్‌ షా అధికారంలోకి వచ్చాడు. ఇతని కాలంలోనే గుజరాత్‌, మాళ్వా, జాన్‌పూర్‌ రాజ్యాలు స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. ముబారక్‌ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు. 

➠ అల్లాఉద్దీన్‌ ఆలమ్‌షా :

ఇతను సయ్యద్‌ వంశాన్ని చివరగా పరిపాలించాడు.  బహులాల్‌ లోడి ఇతడిని తొలగించి లోడీ వంశాన్ని స్థాపించాడు.  


లోడీ వంశం (1451-1526)

సయ్యద్‌ వంశం తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని లోడివంశం పరిపాలించింది. వీరు 1451 నుండి 1526 వరకు ఢిల్లీ రాజ్యాన్ని పాలించారు. లోడీలు ఢిల్లీని పరిపాలించిన మొదటి అప్ఘన్‌ వంశస్థులు. లోడీవంశాన్ని బహలాల్‌ లోడీ స్థాపించాడు. 

➠ బహలాల్‌ లోడి (1451-1489) :

బహలాల్‌ లోడి లోడీవంశాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాలందరిలోకి ఎక్కువ కాలం పరిపాలించిన రాజు. ఇతను 39 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించాడు. ఇతని తర్వాత సికిందర్‌ లోడీ అధికారంలోకి వచ్చాడు. 

➠ సికిందర్‌ లోడీ (1489-1517) :

ఇతని అసలు పేరు నిజాంఖాన్‌. లోడీవంశస్థులందరిలో సమర్థవంతమైన రాజుగా పేరుగాంచాడు. ఇతను 1504లో ఆగ్రా దుర్గాన్ని నిర్మాణం చేశాడు. 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు తరలించి పరిపాలన కొనసాగించాడు. ఢిల్లీలో నిర్మించిన ఇతని సమాధి సమాధులలో కెల్లా గొప్పదిగా చెబుతారు.

➠ ఇబ్రహీం లోడి :

లోడీవంశాన్ని చివరగా పరిపాలించిన రాజు ఇబ్రహీం లోడి. యుద్దభూమిలో మరణించిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌గా పేరుగాంచాడు. 1526లో మొదటి పానిపట్లు యుద్దంలో బాబరు ఇబ్రహీం లోడిని అంతం చేసి మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.  


ఢిల్లీ సుల్తానుల గురించి మరిన్ని విషయాలు 

  • ఢిల్లీ సుల్తానులు రాజ్యాన్ని ఇక్తాలు-షిక్‌లు-పరగణాలు-గ్రామాలుగా విభజించి పాలన కొనసాగించారు. 
  • వీరికాలంలో వజీర్‌(ఆర్థికమంత్రి), దివాన్‌-ఇ-అర్జ్‌(యుద్దమంత్రి), దివాన్‌-ఇ-రిసాలత్‌(విదేశీ వ్యవహరాలమంత్రి) మంత్రులు ఉండేవారు. 
  • సుల్తాన్‌ను భగవంతుని ప్రతిరూపంగా  భావించేవారు. 
  • ఇల్‌టుట్‌మిష్‌ ఇక్తా పద్దతిని ప్రవేశపెట్టాడు. ఇక్తాలకు అధిపతిని ముక్తీ  అనేవారు. వీరు శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించేవారు. 
  • ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షికలు,  పరగణాలు, గ్రామాలుగా  విభజించి పాలన చేసేవారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్‌, పరగణాల అధిపతిని అమీల్‌, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్‌ అనే వారు. 
  • వీరికాలంలో భూములు సర్వే జరిపించి భూమిశిస్తు వసూలు చేసేవారు. 
  • వీరికాలంలో భారతదేశం నుండి పర్షియన్‌ సింధుశాఖ, ఎర్రసముద్ర, ఆగ్నేయాసియా దేశాలకు  వస్తువులు ఎగుమతి అయ్యేవి. 
  • సికిందర్‌ శ్రీనగర్‌లో జామి మసీదును నిర్మించాడు. 
  • ఆనాడు నవద్వీపం (బెంగాల్‌), మిధిల (బీహార్‌) సంస్కృత విద్యాకేంద్రాలుగా విలసిల్లాయి. 
  • కృతివాసుడు సంస్కృతంలో ఉన్న రామాయాణాలను బెంగాలీ భాషలోకి అనువదించాడు. 
  • అమీర్‌ ఖుస్రూ బాల్బన్‌ రాజు నుండి ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ రాజు వరకు 8 మంది రాజుల ఆస్థానంలో పనిచేసి అనేక గ్రంథాలు రచించాడు. 
  • హిందీ పదాలను వాడటంలో ముస్లీం రచయితలలో మొదటివాడు అమీర్‌ ఖుస్రూ. ఇతను ఉర్దూభాష ఆదికవి పేరుగాంచాడు. ఇతనికి తూతిహింద్‌ బిరుదు కలదు. ఈ బిరుదును ఆల్లాఉద్దీన్‌ ఖిల్జీ ఇవ్వడం జరిగింది. ఇతను తబల, సితార్‌ వంటి సంగీత వాయిద్యాలను కనుగొన్నాడు. అంతేకాకుండా 17 హిందూస్థానీ రాగాల(ఖవ్వాలి, తరన, ఘోర, సనమ్‌, ఖియాల్‌) ను కనుగొన్నాడు. 
  • అమీర్‌ ఖుస్రూ తారిఖ్‌-ఇ-అలై (అల్లాఉద్దీన్‌ ఖిల్జీ విజయాలు), తుగ్లక్‌ నామా (ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌), లైలామజ్నూ (ప్రేమకావ్యం), మిప్త-ఉల్‌-పుతుహ(అల్లాఉద్దీన్‌ ఖీల్జీ సైనిక దండయాత్రలు) 



Also Read :

Post a Comment

0 Comments