
ఆంగ్లో-మరాఠా యుద్దాలు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ మరియు మరాఠా సామ్రాజ్యాల మధ్య జరిగాయి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం మూడు యుద్దాలు జరిగాయి. ఈ యుద్ధాలలో బ్రిటిష్ వారి చేతిలో మరాఠాలు ఓడిపోయారు. దీంతో పశ్చిమ భారతదేశం పూర్తిగా బ్రిటిష్‌వారి ఆధిపత్యంలోకి వెళ్లింది.
➺ మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం (1775-82) :
మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దం బ్రిటీష్ సైన్యానికి మరియు మరాఠా సామ్రాజ్యానికి జరిగింది. సూరత్ సంధి మొదటి ఆంగ్లో - మరాఠా యుద్దానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1772 సంవత్సరంలో పీష్వాగా ఉన్న మాధవరావు మరణించడం జరిగింది. దీంతో మాధవరావు తమ్ముడు అయిన నారాయణరావు పీష్వా అయ్యాడు. ఇది తన పినతండ్రి రఘునాథరావుకు ఇష్టం లేదు. దీంతో నారాయణరావును హత్య చేయించి తానే పీష్వా అయ్యాడు. ఈ సంఘటను గుర్తించిన మరాఠా సర్దారులు నానాఫడ్నవిస్ నాయకత్వంలో ఒక్కతాటిపై నడిచి నారాయణరావు కుమారుడు రెండో మాధవరావును పీష్వాగా ప్రకటించారు. దీనిని వ్యతిరేకించిన రఘునాథరావు బ్రిటిషువారితో 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. ఈ సూరత్ సంధి ప్రకారం బ్రిటీష్ కంపనీ రఘునాథరావును పీష్వాగా నియమించాలి. దీనికి బదులుగా అతడు సాల్సెటీ, బేసిన్ ప్రాంతాలను కంపెనీకి ఇవ్వాలి. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న బ్రిటిషువారు దీనికి ఒప్పుకున్నారు.
మరాఠా సర్ధారులు పీష్వాను బలపరిచే వారి నాయకుడు నానాఫడ్నవిస్ నాయకత్వంలో బ్రిటిషువారిని ఎదిరించారు. ఇరువర్గాలకు విజయం దక్కకపోవడంతో 1782లో సాల్బాయ్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ సాల్భాయ్ శాంతి ఒప్పందం ప్రకారం ఇరుపక్షాల వారు తాము జయించిన ప్రాంతాలు తిరిగి ఇవ్వాలి. బ్రిటిషు వారు రెండో మాధవరావును పీష్వాగా గుర్తించారు. ఈ యుద్దం వల్ల మరాఠా సామ్రాజ్యంలో బ్రిటిషువారు జోక్యం చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
Also Read :
➺ రెండో ఆంగ్లో - మరాఠా యుద్దం (1803-06) :
నానా ఫడ్నవిస్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యం క్షీణించింది. రెండవ మాధవరావు మరణంతో రెండవ బాజీరావు (రఘునాథరావు కుమారుడు) పీష్వా అయ్యాడు. 1802లో జరిగిన పుణె యుద్ధంలో ఇండోర్ హోల్కర్ల అధిపతి యశ్వంతరావు హోల్కర్ పీష్వాలు సింధియాలను ఓడించాడు. ఈ యుద్దంలో ఓడిపోయిన రెండవ బాజీరావ్ సహాయం కోసం బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా పనిచేస్తున్న లార్డ్ వెల్లస్లీని ఆశ్రయించాడు. రెండవ బాజీరావు సైన్య సహకార పద్దతి (సబ్సిడరీ అలయెన్స్)కు అంగీకరించి 1802లో బస్సెన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బస్సెన్ ఒప్పందం ప్రకారం రెండవ బాజీరావు బ్రిటీష్‌వారికి తన రాజ్య భూభాగాన్ని అప్పగించి అక్కడ బ్రిటీష్ సైన్యాన్ని నిర్వహించాలి. సింధియాలు, భోంస్లేలు ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. ఈ వ్యతిరేకతే రెండో ఆంగ్లో -మరాఠా యుద్దానికి కారణంగా మారింది. హోల్కర్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధాల్లో మరాఠా సైన్యాలన్ని బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయాయి.
➺ మూడో ఆంగ్లో - మరాఠా యుద్దం (1817-18) :
లార్డ్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో పిండారీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. వీరికి మరాఠాల సహకారం ఉందని బ్రిటిషు వారు బలంగా నమ్మారు. దీంతో మూడో ఆంగ్లో - మరాఠా యుద్దానికి అంకురార్పణ జరిగింది. మరాఠా రాజులు పీష్వా రెండవ బాజీరావు, మల్హర్‌రావు హోల్కర్, రెండవ ముధోజీ భోంస్లే అంగ్లేయులకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డారు. మరో మరాఠా పాలకుడైన దౌలత్‌రావ్ షిండే కూటమిలో కలవకుండా బ్రిటిష్ వారికి మద్దతిచ్చాడు. ఖడ్కి, కోరెగావ్ యుద్దాల్లో పీష్వా రెండవ బాజీరావ్ ఓడిపోయి బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. దీంతో బాజీరావ్ ఆధీనంలోని అనేక ప్రాంతాలు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి.
Related Posts:
- ఆంగ్లో - మైసూర్ యుద్ధాలు
- మూడో పానిపట్టు యుద్దం
- భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాలు
0 Comments