రాజ్యసభ ప్రత్యేక అధికారాలు | Powers of Rajya Sabha in Telugu | Indian Polity in Telugu

 రాజ్యసభ ప్రత్యేక అధికారాలు 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80లో పార్లమెంట్‌లోని రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. 1951 ‘ భారత ప్రజాప్రాతినిధ్య చట్టం’ ప్రకారం రాజ్యసభలో గరిష్టంగా 250 సభ్యులుంటారు.  ఈ సభ్యులలో రాష్ట్రాల వారీగా 225 సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 8 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు. 

రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధానసభల సభ్యులు (ఎంఎల్‌ఏలు) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఇది శాశ్వత సభగా కొనసాగుతుంది. రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల యొక్క పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీవిరమణ చేస్తారు. భారతీయ పౌరులు ఎవరైన రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. రాజ్యసభకు పోటీ చేయాలంటే కనీసం 30 సంవత్సరాల వయస్సుండాలి. పోటీ చేసే అభ్యర్థి ఎక్కడి నుండి పోటీచేస్తున్నారో అక్కడ ఓటు హక్కు కల్గి ఉండాలి. అయితే 2003లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటరుగా ఉన్న వ్యక్తి, ఏ రాష్ట్రం నుంచైనా పోటీచేయవచ్చని నిర్ధేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. లోక్‌సభ తొందరపాటుతో రూపొందించే శాసనాలను రాజ్యసభ సవరిస్తుంది. 

➺ రాజ్యసభ చైర్మన్‌ :

ఆర్టికల్‌ 89 ప్రకారం రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఎక్స్‌-అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయినప్పటికీ సభకు అధ్యక్షత వహిస్తారు. రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. 


Also Read :



➺ ప్రత్యేకాధికారాలు :

పార్లమెంట్‌లోని లోక్‌సభతో పోలీస్తే రాజ్యసభకు కొన్ని ప్రత్యేక అధికారులున్నాయి. 

ఆర్టికల్‌ 249

దీని ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశపై పార్లమెంట్‌లో  శాసనం రూపొందించాలంటే రాజ్యసభలోలో 2/3 వంతు సభ్యుల అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి ఆధారంగా పార్లమెంట్‌ రూపొందించే శాసనం ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ మరొక తీర్మాణాన్ని ఆమోదిస్తే ఇంకో సంవత్సరం పాటు కొనసాగుతుంది. 

ఆర్టికట్‌ 312

అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే 2/3 వంతు రాజ్యసభ సభ్యుల అనుమతి కావాలి. దీని ఆధారంగా పార్లమెంట్‌ చట్టం చేస్తుంది. 

ఆర్టికల్‌ 67(బి) 

రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మాణాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. తొలగింపు తీర్మాణం నోటీసును రాజ్యసభ సభ్యులు 14 రోజులముందు ఇవ్వాలి. 


➺ లోక్‌సభతో సమాన అధికారాలు :

  • ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉభయ సభలకు సమాన అధికారాలుంటాయి. 
  • రాష్ట్రపతిని, ఉపరాష్ట్రతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్‌ కాలేజ్‌’లో పార్లమెంట్‌లో లోక్‌సభతో పాటు రాజ్యసభకు సమాన అధికారులుంటాయి. 
  • జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అత్యవసర స్థితి రద్దువుతుంది. 
  • రాష్ట్రపతిని పదవి నుండి తొలగించేందుకు తీర్మాణం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మాణాన్ని ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే ఈ తీర్మాణం చెల్లుబాటు అవుతుంది. 
  • ఉపరాష్ట్రపతి, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు, కేంద్ర  ఎన్నికల సంఘంలోని ప్రధాన ఇతర కమీషనర్లపై వచ్చే ఆరోపణలను విచారించి, వారిని పదవి నుండి తొలగించే సందర్భంలో రాజ్యసభ, లోక్‌సభలను సమాన అధికారాలుంటాయి. వీరిని తొలగించే తీర్మాణాన్ని ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా సంబందిత తీర్మాణం చెల్లదు. 
  • ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టాలంటే పార్లమెంటు సభ్యుడిగా ఉండాలి. అయితే పార్లమెంటులో సభ్యత్వం లేని వ్యక్తి ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టినప్పుడు, ఆ పదవి చేపట్టిన తేది నుండి 6 నెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. లేకపోతే పదవిని కోల్పొతారు. 
  • ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం, సభాహక్కుల సంఘం, జీతభత్యాల సంఘం మొదలైన పార్లమెంటరీ కమిటీల్లో ఉభయ సభ్యులకు ప్రాతినిధ్యం ఉంటుంది. 
  • భారతదేశంలో నూతన రాజ్యాంగ బద్ద సంస్థలను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తప్పనిసరి. 
  • వివిధ కమీషన్లు తమ నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తాయి. అనంతరం రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు పంపిస్తారు. ఆ నివేదికలను పార్లమెంటు ఉభయసభల్లో చర్చిస్తారు. 


Post a Comment

0 Comments