
గుప్త సామ్రాజ్యం
Gupta Empire Kings and Achievements | Indian History in Telugu | History in Telugu
భారతదేశ చరిత్రలో గుప్తులు పరిపాలించిన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. వీరు వైశ్య వర్ణానికి చెందినవారు. గుప్తులు భారతదేశాన్ని క్రీ.శ.280 నుండి క్రీ.శ 550 సంవత్సరాల వరకు పరిపాలించారు. వీరు ఉజ్జయినీ, పాటలీపుత్రాలను రాజధానులుగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించారు. గుప్త రాజులలో మొట్టమొదటి రాజు శ్రీగుప్తుడు. శ్రీగుప్తున్ని గుప్త రాజ్య మూలపురుషునిగా పేర్కొంటారు. గుప్త రాజ్యాన్ని స్థాపించింది మొదటి చంద్రగుప్తుడు. ‘గరుడ' రాజ్య చిహ్నంగా ఉండేది. వీరి అధికార లాంఛనం వారాహం. అధికార, రాజ భాషలు సంస్కృతం.
గుప్త రాజుల వంశం పుట్టుపూర్వోత్తారాల గురించి చరిత్రలో భిన్నాభిప్రాయాలున్నాయి. రొమిల్లా థాపర్ ప్రకారం వీరు సంపన్న భూస్వామి వంశానికి చెందినవారని, కె.పి జైస్వాల్ ప్రకారం పంజాబి జాట్ కులమని, హెచ్.పి రాయచైదరి ప్రకారం బ్రహ్మణులను, అగ్ని మిత్రసురుడి సంతతి అని, యస్.చటోపాధ్యాయ ప్రకారం క్షత్రియులని పేర్కొన్నారు.
➺ గుప్త సామ్రాజ్య రాజులు :
- శ్రీగుప్తుడు
- ఘటోత్కచుడు
- 1వ చంద్రగుప్తుడు
- సముద్రగుప్తుడు
- రామగుప్తుడు
- 2వ చంద్రగుప్తుడు
- కుమార గుప్తుడు
- స్కంద గుప్తుడు
- విష్ణుగుప్తుడు
➺ శ్రీగుప్తుడు (219-280) :
గుప్త వంశాన్ని శ్రీగుప్తుడు స్థాపించాడు. శ్రీ గుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని క్రీ.శే. 219 నుండి క్రీ.శ 280 వరకు పరిపాలించాడు. బౌద్ధ సన్యాసుల కోసం శ్రీగుప్తుడు నలంద సమీపంలో మృగ-శిఖ అనే నగరాన్ని నిర్మించాడు. ఇతనికి ‘మహారాజ’ అనే బిరుదు కలదు.
➺ ఘటోత్కచుడు :
శ్రీగుప్తుని తర్వాత ఘటోత్కచగుప్తుడు క్రీ.శ 280 నుండి 320 వరకు పరిపాలించాడు. ఘటోత్కచగుప్తుడు అనంతరం ఇతని కుమారుడైన మొదటి చంద్రగుప్తుడు సింహసనాన్ని అధిష్టించాడు.
➺ మొదటి చంద్రగుప్తుడు (320-335) :
మొదటి చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని క్రీ.శ 320 నుండి క్రీ.శ 335 వరకు పరిపాలించాడు. ఘటోత్కచుని కుమారుడుడైన ఇతను మొదటి గుప్త రాజులలోకెల్లా గొప్పరాజుగా కీర్తి సాధించాడు. ఇతను గుప్త వంశ స్థాపనకు గట్టి పునాధిని నిర్మించాడు. ఇతను పాటలీపుత్రాన్ని రాజధానికిగా చేసుకొని పరిపాలించాడు. ఇతను కుమారుదేవిని వివాహం చేసుకున్నాడు. గుప్త రాజ్యాన్ని ప్రయాగ నుండి మగధ వరకు విస్తరించి విజయానికి సూచికగా తన బొమ్మ, తన భార్య బొమ్మలతో బంగారు నాణెములను ముద్రించాడు. ఇతను ఘటోత్కచుని తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన తీరు వజ్జికుడు రచించిన ‘‘కౌముది మహోత్సవం’’ అనే గ్రంథంలో వివరించబడినది.ఇతని కాలంలో కామందకుడు నీతిసారం రచించాడు.ఇతని సర్వసైన్యాక్షుడు అయిన హరిసేనుడు లిఖించిన ‘అలహాబాద్ స్థంభశాసనం’ మొదటి చంద్రగుప్తుని విజయాల గురించి వివరిస్తుంది. ఇతని తర్వాత సముద్ర గుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
➺ సముద్రగుప్తుడు (340-380) :
మొదటి చంద్రగుప్తుని అనంతరం ఇతను గుప్త రాజ్య సింహాసనాన్ని అధిష్టించి క్రీ.శ 340 నుండి క్రీ.శ 380 వరకు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని భార్య దత్తాదేవి. ఇతనికి ‘మహారాజధిరాజా’ ‘ప్రపంచ విజేత’, ‘స్వర్గ విజేత’, ‘ఎదురులేని యోధుడు’ ‘కవిరాజు’ ‘ఇండియన్ నెపోలియన్’ అశ్వమేధపరాక్రమ’, ‘శతరాజులకు రాజు’, ‘వ్యాఘ్రహపరాక్రమ’ ‘దౌహిత్ర’ అనే బిరుదులున్నాయి. ఇతని పరిపాలన కాలంలో రాజ్యాధికారం, వంశగౌరవం విస్తరించింది. ఇతను ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసి చంద్రవర్మ, నాగసేనుడు, గణపతినాగుడు, అచ్యుత నందిన్ అనే రాజులను ఓడించాడు. దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేసి కోసల రాజు మహేంద్రుడు, మహాకాంతార రాజు వ్యాఘ్రరాజు, ఏరండపల్లి రాజు దమనుడు, పిష్టేపుర రాజు మహేంద్రగిరి, కొత్తూరు రాజు స్వామిదత్తుడు, దేవరాష్ట్ర రాజు కుబేరుడు, వేంగి రాజు హస్తివర్మ, పాలక్క రాజు ఉగ్రసేనుడు, కురల రాజ్యం రాజు మంతరాజు, కుస్థలపుర రాజు ధనంజయుడు, ఆవముక్త రాజు నీలరాజు, కంచి రాజు విష్ణుగోపుడులు వంటి 12 మంది రాజులను ఓడించి వారి రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. ఇతను ఉత్తర, వాయువ్య భారతదేశంలో 9 గణ రాజ్యాలు, 5 ఈశ్యాన్య రాజ్యాలు, 18 ఆటవిక రాజ్యాలను జయించాడు. ఇతని విజయాలకు గుర్తుగా ‘‘అశ్వమేధయాగం’’ నిర్వహించి ‘‘అశ్వమేధయాగ పరాక్రమ’’ అని రాసి ఉన్న బంగారు నాణెలను ముద్రించుకున్నాడు. ఇతని పరిపాలన కాలంలో గుప్తు సామ్రాజ్యం భారతదేశం నలుమూలలా విస్తరించింది. ఇతడు ‘‘కవిరాజు’’ గా కీర్తించబడ్డాడు. వీణవాయించే చిహ్నాలు ఉన్న నాణేలవల్ల ఇతడు సంగీతంపై మక్కువ కలవాడని తెలుస్తుంది. తన రాజ్యాన్ని విదేశీ దురాక్రమణ నుండి రక్షించడమే కాకుండా తన రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు. శ్రీలంక రాజైన మేఘవర్మకు బుద్ధగయలో గొప్ప బౌద్ధావిహారాన్ని నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇతని సైనిక విజయాల గురించి హరిసేనుడు లిఖించిన ‘అలహాబాద్ శాసనం’ లో లిఖించబడ్డాయి.
Also Read :
➺ రామ గుప్తుడు :
సముద్రగుప్తుని మరణాంతరం ఇతని పెద్దకుమారుడైన రామగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రామగుప్తుని కాలంలో శకరాజు అయిన 3వ రుద్రసింహుడు మగధపై దాడి చేసి రామగుప్తుడిని ఓడించి తన భార్య ధృవాదేవిని బంధించాడు. ఇతని సోదరుడు 2వ చంద్రగుప్తుడు శకరాజైన రుద్రసింహున్ని వధించి ధృవాదేవిని రక్షించి, రామగుప్తున్ని చంపి, ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ కథాంశం ఆధారంగా విశాఖదత్తుడు ‘‘దేవీ చంద్రగుప్తం’’ అనే నాటకంను రచించాడు. ఇదే అంశాన్ని భాణుని హర్షచరిత్ర, రాజశేఖరుడి కావ్య మీమాంసలో వివరించినట్లు తెలుస్తుంది.
➺ 2వ చంద్రగుప్తుడు (380-415) :
ఇతను సముద్ర గుప్తుడు మరియు దత్తాదేవి కుమారుడు. ఇతను గుప్త సామ్రాజ్యాన్ని క్రీ.శ.380 నుండి క్రీ.శ 415 వరకు పరిపాలించాడు. ఇతనికి ధృవాదేవి, కుబేరనాగ అనే ఇద్దరు భార్యలున్నారు. ఇతని హాయంలో అమరక దేవుడు సేనానిగా పనిచేశాడు. ఇతనికి విక్రమాదిత్య, సహసాంక, శకారి, కవి పండి కల్పతరువు, పరమ భాగవత, సింహవిక్రమ, దేవగుప్తుడు, దేవశ్రీ, దేవరాజు అనే బిరుదులున్నాయి. ఇతను శకరాజు అయిన 3వ రుద్రసింహున్ని చంపి ఉజ్జయినిని జయించి తన రెండవ రాజధానికి చేసుకున్నాడు. శకులపై విజయం సాధించడంలో చంద్రగుప్తునికి వాకాటకులు సహాయసహకారాలు అందించారు. ఫలితంగా తన కుమార్తె ప్రభావతి గుప్తను వాకాటకరాజు 2వ రుద్రసేనునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇతను వివాహ సంబంధాలతో రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని యుద్ధ విజయాలను 'మెహ్రోలీ స్థంభ శాసనం'లో లిఖించబడ్డాయి. ఇతని కాలంలో కళలు, సాహిత్యం అభివృద్ది చెందాయి. ప్రసిద్ద కవి అయిన ‘‘కాళిదాసు'' ఇతని ఆస్థానంలో పనిచేశాడు. ఇతని కాలంలో ‘‘ఫాహియాన్’’ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ తను రచించిన ఫో`కివో`కి అనే గ్రంథంలో భారతదేశంలో శిక్షలు కఠినంగా లేవని, అధిక శాతం శాఖాహారులే ఉన్నారని పేర్కొన్నాడు. ఇతని ఆస్థానంలో ''నవరత్నములు'' అను 9 మంది (భేతాళభట్టు, అమరసింహుడు, శంఖు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, క్షపణికుడు, కాళిదాసు, ఘటకర్పర) సంస్కృత కవులు ఉండేవారు. ఇతను ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో ఉజ్జయిని ఖగోళ శాస్త్ర పరిశోధనలో గొప్ప విద్యాకేంద్రగా ప్రసిద్ధిగాంచింది. ఇతని కాలంలోనే ఇతిహాసాలు అయిన రామాయణం, మహాభారతం రచించబడ్డాయి. ఇతన సింహం, లక్ష్మీదేవి, గుర్రం బొమ్మలతో నాణెలను ముద్రించాడు.
➺ కుమార గుప్తుడు (415-455) :
2వ చంద్రగుప్తుని కుమారుడైన కుమార గుప్తుడు గుప్త రాజ్యాన్ని అధిష్టించి క్రీ.శ 415 నుండి క్రీ.శ 455 వరకు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతనికి ‘‘మహేంద్రాదిత్య’’ అనే బిరుదు కలదు. కార్తికేయుని భక్తుడైన కుమార గుప్తుడు అనంతదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతని పరిపాలన కాలంలో నర్మదానది లోయలో ‘‘పుష్యమిత్ర’’ అనే తెగ ఉద్భవించి రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. ఇతను ‘నలంద విద్యాలయాన్ని’ స్థాపించాడు. ఇతను కార్తికేయుని బొమ్మ, నెమళ్ల బొమ్మలతో నాణెలను ముద్రించాడు. అంతేకాకుండా ఏనుగు స్వారీ, అశ్వమేథ యాగం, ఖడ్గ మృగం వంటి బొమ్మలతో రాగి నాణెలను ముద్రించాడు. ఇతను మాండసోర్‌లో సూర్యదేవాలయాన్ని, మంకువార్‌లో రాతిబుద్ధ విగ్రహాన్ని, కురుదందలో శివలింగం కల్గిన ఆలయాన్ని నిర్మించాడు. ఇతని పరిపాలన కాలంలోనే హూణులు భారతదేశంపై మొదటిసారిగా దండెత్తి వచ్చారు. ఇతని కాలంలో సింహసనం కోసం స్కంద గుప్తుడు, గురుగుప్తుని మధ్య వారసత్వ గొడవలు జరిగాయి. ఇతని తర్వాత తన కుమారుడు స్కంధగుప్తుడు సింహసనాన్ని అధిష్టించాడు.
➺ స్కంధగుప్తుడు (455-467) :
కుమార గుప్తుని కుమారుడైన స్కందగుప్తుడు గుప్త రాజ్యాన్ని క్రీ.శ 455 నుండి క్రీ.శ 467 వరకు పరిపాలించాడు. ఇతనికి ‘‘విక్రమాదిత్య’ అనే బిరుదు కలదు. ఇతని గురించి బీహార్ స్కంభ, జునాఘడ్, ఇండోర్ తామ్ర, భితారి శాసనాలలో లిఖించబడ్డాయి. ఇతను గుప్త రాజ్య రాజధానిని ఉజ్జయిని నుండి పాటలీపుత్రంకు మార్చినాడు.
స్కందగుప్తుని తర్వాత గుప్త రాజ్యాన్ని భానుగుప్తుడు, నరసింహ గుప్తుడు, విష్ణుగుప్తుడు పరిపాలించారు.గుప్త సామ్రాజ్యాన్ని చివరగా పరిపాలించిన రాజు విష్ణుగుప్తుడు.
➺ గుప్త రాజ్య పతనం
భారతదేశంలో గొప్ప రాజ్యంగా గుర్తింపు సాధించిన గుప్త సామ్రాజ్యం విదేశీయుల దండయాత్రలతో క్షీణించింది. హూణుల దండయాత్రలు, ఇండో`రోమన్ వాణిజ్య సంబంధాలతో గుప్త సామ్రాజ్యం అంతరించడం మొదలైంది. ఆర్థిక భారం, రాజులు తరచూ యుద్ధాలలో చేయడం, అసమర్థ వారసులు, తరచూ హూణుల దాడులు వంటి కారణాలతో గుప్త రాజ్యం పూర్తిగా అంతమైంది.
0 Comments