
సహాయనిరాకరణ ఉద్యమం (1920)
Non-Cooperation Movement | Indian History in Telugu | Gk in Telugu | History in Telugu
సహాయనిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర సమయంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక ప్రధాన ఉద్యమం. రౌలట్ చట్టం పట్ల వ్యతిరేకత, ఖిలాఫత్ ఉద్యమంకు మద్దతు మరియు జలియన్‌వాలాబాగ్ దురంతాలకు కారుకులను శిక్షించలేదనే కారణాలతో ‘‘సహాయ నిరాకరణ ఉద్యమం’ 01 అగస్టు 1920న ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్నే ‘‘స్వరాజ్య ఉద్యమం’’ అని కూడా పిలుస్తారు. లాలాలజపతిరాయ్ అధ్యక్షతన 1920 సెప్టెంబర్‌లో జరిగిన కలకత్తా ప్రత్యేక సమావేశంలో ఈ ఉద్యమం తీర్మాణం అంగీకరించబడినది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం బహిష్కరణ, నిర్మాణాత్మక రూపాలుగా జరిగింది.
ఈ ఉద్యమాన్ని ప్రజాఉద్యమం అంటారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. అస్పృశ్యతకు, మధ్యపానం నివారణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచి ప్రజావాణిని వినిపించేటట్లు చేసింది ఈ ఉద్యమం. అంతేకాకుండా హిందూ, ముస్లీంల మధ్య మిత్రబంధాన్ని పెంచింది. స్వాతంత్ర కాంక్షను రగిల్చింది. స్వదేశీ వస్త్రాల గొప్పతన్నాన్ని తెలియజేసి విదేశీ వస్త్రాలను బహిష్కరించింది సహాయ నిరాకరణ ఉద్యమం.
➺ బహిష్కరణ కార్యక్రమాలు :
- బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన పదవులను త్యజించడం
- బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలను రద్దు చేయడం
- విదేశీ వస్తువుల్ని, విదేశీ వస్త్రాలని వదిలేయడం
- శాసనసభలను బహిష్కరించాలి
- 1921లో ఇంగ్లాండ్ యువరాజు భారత పర్యటను బహిష్కరించడం
- ప్రభుత్వ దర్భార్‌లకు వెళ్లడాన్ని తిరస్కరించాలి
➺ నిర్మాణాత్మక కార్యక్రమాలు :
- నూలు వడకడం
- ఖద్దరు వస్త్ర ఉత్పత్తి, ధారణ
- మధ్యపాన నిషేదం
- అస్పృశ్యత నివారణ
- జాతీయ విద్య ప్రోత్సహించడం
➺ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం :
ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎంతో మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందరో తమ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేశారు. మోతీలాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, చిత్తరంజన్‌దాస్, వల్లభాయిపటేల్, టంగుటూరి ప్రకాశం, రాజగోపాలచారి వంటి ప్రముఖ న్యాయవాదులు తమ వృత్తులను వదలి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 1920లో జరిగిన సాధారణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సుభాష్ చంద్రబోస్ 1921లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేశాడు. స్వదేశీ విద్యను ప్రోత్సహించడానికి కాశీవిద్యాపీఠ్, తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్ మరియు బీహార్ విద్యాపీఠ్ సంస్థలను నెలకొల్పారు. గాంధీజీ స్పిన్నింగ్ చక్రంపై నూలవడికి, మిగతావారిని కూడా చేయమని విన్నవించేవాడు. బ్రిటీష్ ప్రభుత్వం స్థాపించిన విద్యాలయాల స్థానంలో స్వదేశీ విద్యాలయాలు నెలకొల్పారు. ప్రజలు ఉవ్వేత్తున ఉద్యమంలో పాల్గొనడంతో బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేసింది. ఎంతో మందిని చెరశాల వేసింది. నిరసన కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపింది.
Also Read :
➺ గాంధీజీ విరమణ :
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ - చౌరా అనే గ్రామంలో సుమారు 3వేల మంది రైతులు, నిరసనకారులు, స్వచ్ఛందకారులు మధ్యం అమ్మకాలకు, పెరిగిన ఆహార ధరలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించగా పోలీసులు వారిపై జరిపిన కాల్పులలో అంబికారాయ్ చౌదరి, భగవాన్ అహిర్ మొదలైనవారు తీవ్రంగా గాయపడ్డారు. ఇది జీర్ణించుకోలేని ప్రజలు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. దీనినే ‘చౌరీ-చౌరా సంఘటన’ అంటారు. ఇటువంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. ఈ విషాద సంఘటన అనంతరం ప్రజలు అహింసాత్మక సత్యాగ్రహాన్ని అర్థం చేసుకోలేదని గాంధీజీ భావించి 12 ఫిబ్రవరి 1922న సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ‘‘బార్దోలీ సమావేశంలో’’ గాంధీ ప్రకటనకు మద్దతునిచ్చింది. దీనినే ‘‘బార్దోలీ తీర్మాణం’’ అంటారు.
➺ గాంధీజీ అరెస్టు :
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, లాలాలజపతిరాయ్ వ్యతిరేకించారు. ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీలో మాంజీ అనే ప్రతినిధి గాంధీ మీద అవిశ్వాస తీర్మాణం ప్రతిపాదించాడు. కానీ అది వీగిపోయింది. గాంధీజీ నాయకత్వంపై వచ్చిన విమర్శలను బ్రిటిష్ ప్రభుత్వం అవకాశంగా చేసుకొని 10 మార్చి 1922న రాజద్రోహం కింద మహాత్మగాంధీని అరెస్టు చేసింది. సి.యన్,బ్రూమ్‌ఫీల్డ్ అనే న్యాయమూర్తి గాంధీజీకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించాడు. గాంధీని పుణాలోని ఎరవాడ జైలులో ఉంచారు. కానీ అనారోగ్య కారణంగా గాంధీజీ శిక్షను 6 సంత్సరాల నుండి 2 సంవత్సరాలకు తగ్గించి 05 ఫిబ్రవరి 1924న విడుదల చేశారు.
- సహాయ నిరాకరణ ఉద్యమం జరిగే సమయంలో బ్రిటిష్ వైస్రాయ్‌గా లార్డ్ రీడింగ్ పనిచేశాడు.
- ఈ ఉద్యమానికి రాట్నంను చిహ్నంగా ఉపయోగించారు.
- గాంధీజీ అరెస్టు, విచారణ గురించి ‘‘ది గ్రేట్ ట్రయల్’’ అనే గ్రంథం వివరిస్తుంది.
- పురుషోత్తమ్‌దాస్, ఠాకూర్‌దాస్, జమునాదాస్ ద్వారాకదాస్‌ల ఆధ్వర్యంలో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమ వ్యతిరేక సమాఖ్య ఏర్పాటైంది.
0 Comments