India River System in Telugu || భారతీయ నదీ వ్యవస్థ || Indian Geography in Telugu || General Knowledge in Telugu

List of major rivers in India in Telugu || భారతీయ నదీ వ్యవస్థ

 భారతీయ నదీ వ్యవస్థ || భారతదేశం ముఖ్యమైన నదులు 
List of Major Indian Rivers || Major River System in India|| Gk in Telugu || General Knowledge in Telugu || Static Gk in Telugu 

Gk in Telugu  ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu, Bank (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.

    భారతదేశం నదులకు పెట్టింది పేరు. భారతదేశంలో అధిక వ్యవసాయం నదుల యొక్క నీటిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని ప్రధాన నదులపై నిర్మించిన ప్రాజేక్టులు, రిజర్వాయర్‌లతో సాగు, త్రాగునీటితో పాటు విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశంలో అధిక శాతం నదులు తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. భారతదేశంలో అనేక నదులున్నాయి. వీటిలో ఎక్కువ నదులు నీటిపారుదల, జలవిద్యుత్‌ అవసరాల కొరకు వాడుతున్నారు. భారతదేశంలో గంగా నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నది, కృష్ణనది, కావేరి నది, పెన్నానది, సింధూనది, నర్మదానది, తపతి నది, సబర్మతి నది వంటి ప్రధాన నదులున్నాయి. వీటిపై నిర్మించిన అనేక ప్రాజేక్టులు ప్రజల త్రాగునీటితో పాటు, వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీటిని అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజేక్టులపై చేపట్టిన జలవిద్యుత్‌ ప్రాజేక్టుల ద్వారా విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అనేక ప్రాజేక్టులు వర్షాకాలంలో నీటిని నిల్వ చేసి వాటిని వ్యవసాయ, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 

Also Read : Gk Questions in Telugu 

భారతదేశంలో తూర్పు దిశకు ప్రవహించే నదులు 

1) గంగానది :

గంగానది భారతదేశంలో ప్రవహించే అన్ని నదుల్లోకెల్లా అతిపెద్ద నది. ఈ గంగానదిని బంగ్లాదేశ్‌ దేశంలో ‘పద్మ’ నది అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అన్ని నదులకెల్లా పొడవైన నది. ఇది అలకనంద, భగీరథ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. అలక్‌నంద నది దేవప్రయాగ వద్ద భగీరథతో కలిసిన తర్వాత గంగానదిగా పిలుస్తారు. హిమాలయాల పర్వతాల్లోని నందాదేవి త్రిశూల్‌, శిఖరాల వద్ద మంచు కరిగి అలకనంద నదిగా మారుతుంది. గంగోత్రి వద్ద భగీరథ నది ఏర్పడుతుంది. గంగానదికి రామ్‌గంగా, గండక్‌, కోసి, సోన్‌, దామోదర్‌ అనే ఉపనదులున్నాయి. ఈ గంగానది భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ మీదుగా మొత్తం 2525 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. భగీరథ నదిపై తెహ్రీ ప్రాజేక్టు నిర్మించడం జరిగింది. గంగానది పరక్క వద్ద బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తుంది. గంగానది యమున, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పరుస్తుంది. ఈ నదిని భారతదేశంలోని హిందువులు పవిత్రమైన నదిగా పూజిస్తారు. పురాతనకాలం నుండి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగాజలాన్ని వినియోగిస్తారు. జనన మరణాల సమయాల్లో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రజల ప్రగాఢ విశ్వసం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధిలో ఉంచి పవిత్రంగా పూజిస్తారు. ప్రతి పండగ రోజున పుణ్యస్నానాలు చేసి గంగాదేవికి నమస్కరిస్తారు. గంగానది భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా ప్రవహిస్తుంది. గంగానది యొక్క మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు కాగా భారతదేశంలో 2415 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది దేశ వైశాల్యంలో 4వ వంతు విస్తిర్ణంతో అతిఎక్కువ నదీపరివాహక ప్రాంతం కల్గిన నదిగా గుర్తింపు సాధించింది.గంగానది తీరాన జరిగే కుంభమేళలో లక్షలాది మంది ప్రజలు పుణ్యస్నానాలను ఆచరిస్తారు.  

    గంగా పరీవాహక ప్రాంతం ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కల్గిన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటి. భారతదేశంలోని 11 రాష్ట్రాలలో 8,60,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న గంగా పరీవాహక ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన నదీ పరీవాహక ప్రాంతం. గంగా నది యొక్క 75 శాతం పరీవాహక ప్రాంతం భారతదేశంలోనే కలదు. గంగా నదీ నీటిపారుదల, త్రాగునీరు మరియు పారిశ్రామిక అవసరాల కోసం ఒక ముఖ్యమైన నీటివనరుగా పనిచేస్తుంది. అలాగే అనేక రకాల వృక్ష మరియు జంతు జాలానికి నిలయంగా ఉంది. గంగా, బ్రహ్మపుత్ర మరియు మేఘన లేదా సుందర్బన్‌ డెల్టా ఈ మూడు ముఖ్యమైన నదీవ్యవస్థల సంగమం ద్వారా ఏర్పడిన భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంతం. 

➣ గంగానదీ పరివాహక ప్రాంతం కల్గిన రాష్ట్రాలు 

  • ఉత్తరాఖండ్‌ 
  • హిమాచల్‌ ప్రదేశ్‌ 
  • హర్యానా 
  • ఉత్తరప్రదేశ్‌ 
  • మధ్యప్రదేశ్‌ 
  • రాజస్థాన్‌ 
  • ఛత్తీస్‌ఘడ్‌ 
  • జార్ఘండ్‌ 
  • బీహార్‌ 
  • పశ్చిమబెంగాల్‌ 
  • Delhi

➣ ఉపనదులు 

గంగానదికి ఎడమవైపు రామ్‌గంగా, గోమతి, ఘగ్ర, గండక్‌, కోసి ఉపనదులు ఉన్నాయి. కుడివైపున యమున, చంబల్‌, సోన్‌, బెట్వా, కెన్‌, దామోదర్‌, టాన్స్‌ ఉపనదులు ఉన్నాయి. గంగానదికి అతిపెద్ద ఉప నది యమునా నది. 

➣ పవిత్రత 

హిందువులు గంగానదిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఒక్కసారి గంగానదిలో స్నానం చేస్తే జన్మజన్మల ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. మరణించే ముందు గంగా జలం త్రాగితే స్వర్గప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. మరణించిన వారి యొక్క ఆస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దేశ నలుమూలల నుండి వారాణాసికి వస్తారు. గంగానది జలాన్ని ఇంట్లో ఉంచుకోవడం పవిత్రంగా భావిస్తారు. చాలామంది హిందువులు గంగానది వెంబడి నెలవై ఉన్న పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలకు వెళతారు. 

➣ గంగానదిపై నిర్మించిన ప్రాజేక్టులు 

తెహ్రీ డ్యాం దీనిని గంగానదికి ఉపనది అయిన భగీరథ నదిపై నిర్మించారు.  బన్‌సాగర్‌ డ్యామ్‌ నీటిపారుదల మరియు జలవిద్యుత్‌ ఉత్పత్తి కొరకు గంగానది ఉపనది అయిన సోన్‌ నదిపై నిర్మించారు. రామ్‌గంగా ప్రాజేక్టును గంగా నది ఉపనది అయిన రామ్‌గంగా నదిపై నిర్మించారు.  

Also Read : Telugu Stories


2) బ్రహ్మపుత్ర నది :

బ్రహ్మపుత్ర నది భారతదేశంతో పాటు టిబెట్‌, బంగ్లాదేశ్‌, చైనా దేశాల్లో ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ‘దిహంగ్‌ ’ అని,  అస్సాం లో  ‘సైడంగ్‌’ అని,  బంగ్లాదేశ్‌లో  ‘జమున’ అని,  టిబెట్‌లొ ‘సాంగ్పో’ అని,  చైనాలో ‘యార్లుంగ్‌ జంగ్బో జియాంగ్‌’ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది షమ్‌యంగ్‌డంగ్‌ హిమానీనదం (మానససరోవరం) వద్ద ఉద్భవిస్తుంది. దీనికి సువంసిరి, కమెంగ్‌, ధన్‌సిరి, మనస్‌, టీత్స, దిసంగ్‌, బుర్హిదిహింగ్‌, లోహిత్‌ అనే ఉపనదులు ఉన్నాయి. భారతదేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌ మరియు అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది మొత్తం 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది భారతదేశంలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు బంగ్లాదేశ్‌లోని గెలుండా అనే ప్రాంతం వద్ద కలుస్తాయి. ఈ రెండు నదులు కలిసిన తర్వాత బ్రహ్మపుత్ర నదిని మేఘన అని పిలుస్తారు. ఈ నదిని అస్సాం  దుఖ:దాయానిగా పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపైన కొపిలి జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించారు. ఈ నది హిందువులకు పవిత్రమైన నది. ఈ నది ఉహించలేని వరదలకు ప్రసిద్ది చెందింది. సాధారణంగా అలలు సముద్రాలకు మాత్రమే వస్తాయి. కానీ ప్రపంచంలో ‘టైడల్‌ బోర్‌’ (అలలపోటు)ను ప్రదర్శించే అరుదైన నదులలో ఈ బ్రహ్మపుత్ర నది ఒకటి. 

    బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అన్ని నదులకన్న ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తుంది. ఈ నది భారతదేశంలోనే ఏకైక పురుష (మగ) పేరు కల్గిన నదిగా పేరుగాంచింది. ఇది చైనాలోని టిబెట్‌లో పుడుతుంది. బంగ్లాదేశ్‌లో బ్రహ్మపుత్ర నది రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా ‘జమున’ నదిగా సాగి దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. వేరొక బ్రహ్మపుత్ర నది ‘మేఘ్నానదిలో’ కలుస్తుంది. ఈ రెండు నదులు బంగ్లాదేశ్‌లోని ‘చాంద్‌పూర్‌’ అనే ప్రాంతం వద్ద కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయి. బ్రహ్మపుత్రి నది ప్రతి సంవత్సరం భారీ వరదలు సృష్టిస్తుంది. ఈ వరద తాకిడికి దాని గమనాన్ని మారుస్తుంది. తద్వారా కొత్త భూభాగాలు దీని తీరంలో ఏర్పడుతుంటాయి. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతంలోని వర్షారణ్యాలు అనేక రకాల వృక్షజాతులు, జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. ఇది కజిరంగా, మానస్‌ మరియు కాంచన్‌గంగా వంటి జాతీయపార్కులకు కల్గి ఉంది. దేశంలోని గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, సింధూ, మహా, కావేరి, తపతి వంటి అన్నీ నదులు స్త్రీ పేర్లతో ఉండగా బ్రహ్మపుత్ర నది మాత్రం పురుషపేరుతో పిలుస్తారు. 


3) గోదావరి నది: 

ద్వీపకల్ప నదులన్నింటిలో ఇది అతిపెద్ద నది. గోదావరి నది  నది మహారాష్ట్ర లోని నాసిక్‌ ప్రాంతంలోని త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా మొత్తం 1465 కి.మీ ప్రయాణించి  తూర్పుగోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా రేంజర్‌ మండలం కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ద గంగా, ఇండియన్‌ రైన్‌, తెలివాహి, కవుల నది అనే పేర్లుతో కూడా పిలుస్తారు. నిజామాబాద్‌లో గోదావరిపై నిర్మించిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజేక్టు పలు జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. రాజమండ్రి వద్ద నిర్మించిన ధవలేశ్వరం ప్రాజేక్టు వివిధ జిల్లాలకు సాగునీరు అవసరాలను తీరుస్తుంది. పశ్చిమ గోదావరి రామయ్యపేట వద్ద దీనిపై పోలవరం ప్రాజేక్టు నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చివరిసారి 2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరిగాయి. 

➣ గోదావరి నదికి ఉపనదులు 

  • ప్రాణహిత
  • మంజీరా
  • కిన్నెరసాని 
  • ఇంద్రావతి 
  • శబరి 
  • సీలేరు 
  • వార్ధా
  • పెన్‌గంగ
  • వెయిన్‌గంగ
  • మానేరు 
  • హరిద్రా
  • కడెం 
  • పెద్దవాగు

వంటి ఉపనదులు కల్గి ఉంది. 


4) కృష్ణ నది :

కృష్ణనది పశ్చిమ కనుమల్లో  సహ్యద్రి పర్వతశ్రేణుల్లో మహరాష్ట్ర పతారా జిల్లా, జోర్‌ గ్రామం మహబలేశ్వరం వద్ద సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో  జన్మిస్తుంది. ఈ నది మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అనే 4 రాష్ట్రాల గుండా 1400  కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణజిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దేశంలో మూడవ అతిపెద్ద నదిగా పెరుగాంచింది. దక్షిణ భారతదేశంలో గోదావరి నది మొదటిది కాగా ఇది రెండవ స్థానంలో ఉంది. కృష్ణా నది 2,58,948(రెండు లక్షల యాబై ఎనిమిది వేల తొమ్మిది వందల నలబై ఎనిమిది) చ.కి.మీ నది పరివాహక ప్రాంతం కలదు. ఇది తెలంగాణ  రాష్ట్రంలో 416 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట్‌ జిల్లాలోని మక్తల్‌ మండలం, తంగడి గ్రామం వద్ద ప్రవేశించి నల్గోండ జిల్లాలోని వదినపల్లి గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలుస్తుంది. శ్రీశైలం నుండి పులిచింతల వరకు 290 కిలోమీటర్ల వరకు ఆంధ్రా,  తెలంగాణ రాష్ట్రాల మద్య సహజ సరిహద్దుగా  ప్రవహిస్తుంది. 

కృష్ణనది ఉపది అయిన తుంగభద్రపై కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్‌ వద్ద తుంగభద్ర డ్యాం నిర్మించారు. ఈ ప్రాజేక్టు వల్ల కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. ఉత్తర కర్ణాటలో ఈ నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాం ద్వారా 290 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నదిపౌ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వద్ద నిర్మించిన డ్యాం దేశంలోనే రెండవ అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రం. ఈ నదిపై పులిచింత ప్రాజేక్టు నిర్మాణం జరుగుతుంది. 

కృష్ణా నదికి కుడివైపు 

  • ఘట ప్రభ 
  • మలప్రభ
  • తుంగభద్ర
  • కోయన 
  • పంచగంగ 
  • దూద్‌గంగాలు 
  • హంద్రినివా అనే ఉపనదులు కలవు. 

కృష్ణానదికి ఎడమవైపు 

  • భీమా 
  • మూసి 
  • మున్నేరు 
  • దిండి 
  • పాలేరు 
  • హలియా 
  • ఆలేరు 
  • వైరా 
  • వర్ణ 
  • కాగ్నా 
  • వైరా 
  • పెద్దవాగు అనే ఉపనదులు కలవు.

Also Read : Scholarships in Telugu

5) కావేరి నది :

కావేరి నది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర బ్రహ్మగిరి కొండలో జన్మిస్తుంది. దీనికి హేమావతి, లోక్‌ పావని, సింస, అక్రవతి, భవాని, లక్షణతీర్థ, అమరావతి, నొయ్యల్‌ అనే ఉపనదులు ఉన్నాయి. కావేరి నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా మొత్తం 800 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నదికి వర్షపు నీరు ఎక్కువగా పొందడం వల్ల ఇతర ద్వీపకల్ప నదుల కంటే మెరుగ్గా ప్రవహిస్తుంది. 


6) మహానది :

మహానది ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలోని లోషియానా వద్ద జన్మిస్తుంది. మహానది గోదావరి, కృష్ణ తర్వాత ద్వీపకల్ప నదులలో మూడవ అతిపెద్ద నది. మహానదికి మండ్‌, జోంక్‌, టెల్‌, సిమోనత్‌, హస్‌దేవ్‌ వంటి ఉపనదులు ఉన్నాయి. మహానది ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాల గుండా మొత్తం 857 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానదిపై ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘‘హిరాకుడ్‌ డ్యాం’’ ను నిర్మించారు. దీనిని ఒడిశా దు:ఖదాయని అని పిలుస్తారు. ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఘండ్‌, మహారాష్ట్రలో నదీ పరివాహక ప్రాంతం కలదు. మహానదిపై రవిశంకర్‌ సాగర్‌, దుధావా రిజర్వాయర్‌, సొండూర్‌ రిజర్వాయర్‌, హస్డియో బాంగో మరియు తాండుల ప్రాజేక్టులు కలవు. 


పడమరకు ప్రవహించే నదులు 

7) సింధూనది :

సింధూనది టిబెట్‌లోని మానససరోవరం వద్ద జన్మిస్తుంది. సింధూనదికి గిల్‌గిత్‌, షిగర్‌, జీలం, చినాబ్‌, రావి, బియాస్‌, సట్లేజ్‌ అనే ఉపనదులు ఉన్నాయి. సింధూనది మొత్తం 2,880 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. జమ్మూకాశ్మీర్‌లో 709 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది పాకిస్తాన్‌లోని కరాచీ వద్ద అరేబియా మహా సముద్రంలో కలుస్తుంది. సింధూనది హిమాలయ నదీవ్యవస్థలో అతిపెద్దది. ఈ నది ఎక్కువ భాగం పాకిస్తాన్‌లో ప్రవహిస్తుంది. 


8) నర్మదా నది :

నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌ వద్ద జన్మిస్తుంది. ఈ నదికి హిరాన్‌, టెండోరి, బర్నా, కోలార్‌, మాన్‌, ఉరి, హత్ని, ఓర్సాంగ్‌, బర్నర్‌, బంజర్‌, షేర్‌, షక్కర్‌, దుది, తావా, గంజాల్‌, కుండి, గోయి, కర్జన్‌  అనే ఉపనదులు ఉన్నాయి. నర్మదా నది మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలగుండా 1312 కిలోమీటర్లు ప్రయాణించి గల్ఫ్‌ ఆఫ్‌ ఖంబత్‌ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో ఎక్కువ ఆనకట్టలు ఈ నదిపైనే నిర్మించారు. దీనిపై మార్భుల్‌ జలపాతం జబల్‌పూర్‌ వద్ద కలదు. వింద్యా, సాత్పురా పర్వతాల మద్య పగులలోయలో ప్రవహిస్తున్న నది నర్మదా నది. ఈ నదిపై ఓంకారేశ్వర్‌ మరియు మహేశ్వర్‌ డ్యామ్‌లు నిర్మించారు. 


9) తపతి నది :

మధ్యప్రదేశ్‌ ముల్తాయ్‌ వద్ద తపతి నది జన్మిస్తుంది. తపతి నదికి గిర్నా, అమరావతి, బురే, పంఘారా, బోరి, వాఘూర్‌, పూర్ణ, మొన, వాకీ, అనేర్‌, అరునవతి, గోమై అనే ఉపనదులు ఉన్నాయి. తపతి నది మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల గుండా మొత్తం 724 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తపది నది సాత్పూర పర్వతాల దిగువన ప్రవహిస్తుంది. 


10) సబర్మతి నది :

సబర్మతి నది రాజస్థాన్‌లోని అరావళి పర్వతాలలో జన్మిస్తుంది. ఇది రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల గుండా నైరుతి దిశలో మొత్తం 371 కిలోమీటర్లు ప్రయాణించి గల్ఫ్‌ ఆఫ్‌ కాబే వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది 48 కిలోమీటర్లు రాజస్థాన్‌లో, 323 కిలోమీటర్లు గుజరాత్‌లో ప్రవహిస్తుంది. దీనికి వాకల్‌, హర్నవ్‌, హత్మతి, వట్రాక్‌, ఆరు అనే ఉపనదులున్నాయి. 


Related Posts :

1) Godavari River in Telugu

2) Krishna River in Telugu 

3) Kaleshwaram Project in Telugu 

4) Telangana Rivers Gk Questions in Telugu

5) Telangana River System in Telugu

Post a Comment

0 Comments