Mughal Dynasty in Telugu || List of Mughal Emperors in Telugu || మొగల్‌ సామ్రాజ్యం || Indian History in Telugu

మొగల్‌ సామ్రాజ్యం

మొగల్‌ సామ్రాజ్యం
Mughal Emperors List, Names, Timeline in Chronological Order || Indian History in Telugu 

బాబర్‌ అనే రాజు 1526 సంవత్సరంలో భారతదేశంపై దాడి చేయడంతో మొగలుల పేరుతో ఒక కొత్త వంశం అవతరించింది. మొగల్‌ సామ్రాజ్యాన్ని 1550 నుండి 1707 సంవత్సరాల వరకు భారతదేశమంతా తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొగలులు అవలంభించిన విధానాలు, పరిపాలన ఏర్పాట్లు, వాస్తుకళలు వంటి వారి తదనంతరం కూడా వివిధ రాజులను ప్రభావితం చేశాయి. ప్రతి సంవత్సరం భారత ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించే ‘‘ఎర్రకోట’’ మొగలుల యొక్క నివాసమే. 

➺ మొగలలు ఎవరు ? 

మొగలులు మధ్య ఆసియాలోని ఉజ్భేకిస్తాన్‌, మంగోలియా దేశాలకు చెందిన వారు. మొట్టమొదటి మొగల్‌ చక్రవర్తిగా పిలవబడే బాబర్‌ (1526-1530) ఇతర రాజ్యాల దండయాత్రల వల్ల పూర్వికుల నుండి సంక్రమించిన సింహాసనాన్ని వదిలిరాక తప్పలేదు. చాలాకాలం సంచారం చేసి 1504లో కాబూల్‌ను వశపరుచుకున్నాడు. 

మొగల్‌ చక్రవర్తులు 

➺ బాబర్‌ (1526-1530) :

బాబర్‌ 1526 నుండి 1530 వరకు పరిపాలన కొనసాగించాడు. ఇతను ఢిల్లీని  పరిపాలించే ఇబ్రహీం లోడి అనే రాజు ఓడించి ఢిల్లీ మరియు ఆగ్రాలను తన ఆదీనంలోకి తెచ్చుకొని రాజ్యస్థాపన చేశాడు. 1526లో జరిగిన 'మొదటి పానిపట్టు' యుద్దంలో ఢిల్లీ సుల్తాన్‌ ఇబ్రహీం లోడిని ఓడిరచి ఢిల్లీ, అగ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. 1527లో కాణ్వా యుద్దం జరిగింది. ఈ కాణ్వా యుద్దంలో బాబరు మేవార్‌ పాలకుడైన రాణా సంగ్రామ్‌సింగ్‌ను ఓడిరచాడు. 1528లో చందేరి యుద్దంలో మాళ్వా పాలకుడైన మేధినిరాయ్‌ని ఓడించి చందేరి కోటను, మాళ్వాను ఆక్రమించుకున్నాడు. 1529లో జరిగిన గోగ్రా యుద్దంలో నుస్రత్‌ షా, మొహ్మద్‌ షా అనే ఆష్టలను ఓడించి బెంగాల్‌ను ఆక్రమించుకున్నాడు. 1530లో బాబరు మరణించాడు.  

Related Posts : కాకతీయ సామ్రాజ్యం 

➺ హుమాయున్‌ (1530-1556) :

హుమాయున్‌ బాబర్‌ అనంతరం రాజ్యాన్ని 1530 నుండి 1556 వరకు పరిపాలించాడు. హుమాయున్‌ ను షేర్‌ఖాన్‌ అనే రాజు ఓడించి ఇరాన్‌కు పారిపోయేలా చేశాడు. ఇరాన్‌లో హుమాయున్‌ సఫావిద్‌ షా సహాకారంతో తిరిగి 1555 సంవత్సరంలో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత హుమాయున్‌ ఒక ప్రమాదంలో మరణించడం జరిగింది. 

➺ అక్భర్‌ (1556-1605) :

హుమయూన్‌ మరణాంతరం తన కుమారుడైన అక్భర్‌ రాజ్యాధికారం చేపట్టాడు. ఇతని పూర్తి పేరు జలాలుద్దీన్‌ ముహమ్మద్‌ అక్బర్‌. అక్బర్‌ రాజు అయ్యేనాటికి అతని యొక్క వయస్సు కేవలం 13 సంవత్సరాలే ఉంది. అక్బర్‌ బెంగాల్‌, మధ్య భారతదేశం, రాజస్థాన్‌, గుజరాత్‌లను ఆక్రమించుకొని పరిపాలన కొనసాగించాడు. తర్వాత అప్ఘనిస్తాన్‌, కాశ్మీర్‌, దక్కన్‌పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకొని సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అక్బర్‌ కళలకు ప్రధాన్యమిచ్చేవాడు. అక్భర్‌ 1605 సంవత్సరంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. 

➺ జహంగీర్‌ (1605-1627) :

అక్బర్‌ మరణాంతరం జహంగీర్‌ 1605 నుండి 1627 వరకు మొగల్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మొగల్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన నాల్గవ వ్యక్తి. ఇతను బ్రిటిష్‌ ఈస్ట్‌ఇండియా కంపనితో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 

Also Read : శాతవాహన సామ్రాజ్యం 

➺ షాజహాన్‌ (1627-1658) :

షాజహన్‌ 1627 నుండి 1658 వరకు మొఘల్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఐదవ చక్రవర్తి. ఇతని పూర్తి పేరు అల్‌ హజ్రత్‌ అబుల్‌ ముజాఫర్‌ షిహాబుద్దీన్‌ ముహమ్మద్‌ షాజహాన్‌. షాజహాన్‌ జహంగీర్‌ తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతను పరిపాలించిన కాలాన్ని మొఘల్‌ సామ్రాజ్యంలో స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. షాజహాన్‌ దక్కన్‌ ప్రాంతంలో మొగలుల రాజ్య విస్తరణ కొనసాగించాడు. ఇతను సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువులు, పాలకుల తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. 1657-1658లో సింహాసనం కోసం అతని కుమారుల మధ్య సమస్యలు తలెత్తినాయి. ఔరంగజేబు తన ముగ్గురు సోదరులను ఓడించి చంపివేసినాడు. షాజహాన్‌ను బంధించడంతో షాజహాన్‌ తన శేషజీవితాన్ని జైలులోని గడిపాడు. షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ మహల్‌ జ్ఞాపకార్థం ‘తాజ్‌మహల్‌’ ను నిర్మించాడు. ఇతని కాలంలో జామా మసీదు, ఎర్రకోట, జహంగీర్‌ సమాధి, షాలిమార్‌ గార్డెన్‌ వంటి నిర్మాణాలు ఏర్పాటు చేశారు. 

➺ ఔరంగజేబు (1658-1707) :

ఔరంగజేబు అస్సాంపై గెలుపు సాధించాడు. అప్ఘనిస్తాన్‌ మొదలుకొని అస్సాం, రాజస్థాన్‌, పంజాబ్‌, దక్కన్‌ మొదలగు యావత్‌ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. గురుతేజ్‌ బహదూర్‌, గోవింద్‌సింగ్‌, శివాజీలను తన కుమారుడైన అక్బర్‌ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఔరంగజేబు 1685లో బీజాపూర్‌ను, 1687లో గోల్కొండను ఆక్రమించుకున్నాడు. ఇతని మరణాంతరం సింహాసనం కోసం కుమారుల మధ్య సంఘర్షణలు ప్రారంభమైనాయి. 


➺ బహదూర్‌ షా (1707-1712) :

బహదూర్‌ షా మొగల్‌ రాజ్యాన్ని 1707 నుండి 1712 వరకు పరిపాలించిన ఏడవ రాజు. ఇతను ఔరంగజేబు పెద్ద కుమారుడు. ఇతను తన పాలనలో అనే సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతని సవతి సోదరుడు అయిన అజంషా తిరుగుబాటు మరియు సిక్కులతో విభేదాలు ఎదుర్కొన్నాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు.

➺ జహందర్‌ షా (1712-1713)  :

జహందర్‌ షా ఒక సంవత్సరం పాటు మొగల్‌ రాజ్యాన్ని పరిపాలించిన బహదూర్‌ షా-1 యొక్క కుమారుడు.  అతని మేనల్లుడు ఫరుక్సియార్‌ చేత చంపబడ్డాడు. 

➺ ఫరూక్సియార్‌ (1713-1719)  :

ఇతను జహందర్‌ షా యొక్క సోదరుని కుమారుడు. ఫరూక్సియార్‌ కాలంలో సిక్కు నాయకుడు అయిన బండా సింగ్‌ బహదూర్‌ తిరుగుబాటు చేశాడు. 

Also Read : కుతుబ్ షాహీ  సామ్రాజ్యం 

➺ ముహమ్మద్‌ షా (1719-1748) :

ఇతను కళల పోషణకు మరియు మరాఠా సమాఖ్యకు వ్యతిరేకంగా సైనిక ప్రచారాలను చేశాడు. దీంతో అనేక తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. 

➺ అహ్మద్‌ షా బహదూర్‌ (1748-1754) :

ముహమ్మద్‌ షా అనంతరం తన కుమారుడైన అహ్మద్‌ షా బహదూర్‌ రాజ్యాధికారం చేపట్టాడు. ఇతను 22 యేటనే సింహసానాన్ని అధిష్టించాడు. ఇతని కాలంలో అహమ్మద్‌ షా అబ్దాలీ 1749, 1752లో రెండుసార్లు దండేత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండడం కోసం మొగల్‌ సుల్తాన్‌ అహ్మద్‌షా పంజాబ్‌, ముల్తాన్‌లను అహ్మద్‌ షా అబ్దాలీకు అప్పగించాడు. 

➺ అలంగీర్‌ -2 (1754-1759) :

అలంగీర్‌ పరిపాలన కాలంలో స్వంత వజీర్‌ తిరుగుబాటు మరియు మరాఠాలతో విభేదాలు తలెత్తాయి. ఇతని కాలంలో మొగలులు సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారాయి. సైనికులకు సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో తిరుగుబాటు చేశారు. 

➺ షాజహాన్‌ - 3 (1759-1760) :

ఆలంగీర్‌ హత్య జరిగిన తర్వాత రాజ్యాధికారం చేపట్టినాడు. 

➺ షా ఆలం -2 (1760-1788) :

షా ఆలం ఈస్ట్‌ ఇండియా కంపెనీ మద్దతులో చక్రవర్తి అయ్యాడు. ఇతని పరిపాలనలో బ్రిటీష్‌ వారితో విభేదాలు మరియు మరాఠాలతో విభేదాలు తలెత్తాయి. ఇతను తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించలేదు. ఇదే సమయంలో అహమ్మద్‌ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండేత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్‌ యుద్దానికి (1761) దారితీసింది. ఈ యుద్దంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా ఓదించాడు. రెండో షా ఆలం బెంగాల్‌ నవాబు మీర్‌ ఖాసీం, అవధ్‌ నవాబు షుజా ఉద్దౌలాతో కలిసి 1764లో ‘‘బక్సార్‌’’ యుద్దంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. 

➺ అక్భర్‌ -2 (1806-1837) : 

మొగల్‌ సామ్రాజ్యానికి రాజకీయ మరియు ఆర్థిక క్షీణత సమయంలో చక్రవర్తి అయ్యాడు. ఇతని పరిపాలనలో భారతదేశంలోని చాలా ప్రాంతాలపై బ్రిటీషు వారు ఆధిపత్యం చేలాయించారు. 

Also Read : ఇక్ష్వాకుల సామ్రాజ్యం 

➺ బహదూర్‌ షా -2 (1837-1857) :

ఇతను 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు సమయంలో చిహ్నంగా వ్యవహరించబడ్డాడు. బ్రిటీష్‌ దళాలు సెప్టెంబర్‌ 1857లో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకుని బహదూర్‌ షా -2 ను బంధించారు. ఇతను 1862లో రంగూన్‌లో మరణించినాడు. 

బలహీనమైన నాయకత్వం మరియు ఆర్థిక వెనుకబాటుతో పాటు బ్రిటీషు, యూరోపియన్‌ల వారి ఆధిపత్యంతో 1857 తర్వాత మొఘల్‌ సామ్రాజ్యం అంతరించింది. 

మొఘలుల పరిపాలన 

మొఘలులు రాజ్యాధికారం చేపట్టకముందు భారతదేశమంతటా అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ చిన్న రాజ్యాలను మొగలులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. పాత రాజులను, పూర్వ రాజ్యాల పరిపాలన కొనసాగించేందుకు అనుమతించారు. వీరి ద్వారానే రెవెన్యూ శిస్తు వసూలు చేయించేవారు. సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య యుద్దాల నివారణకు చక్రవర్తి ఎప్పుడు తన సైన్యంతో సిద్దంగా ఉండేవాడు. మొగలుల అధికారాన్ని అంగీకరించని రాజులపై నిరంతరం యుద్దాలు చేయడం ద్వారా వారిని అదుపులో ఉంచుకునేవారు. మొగలులు బలపడిన తర్వాత చాలామంది ఇతర రాజులు కూడా తమ సార్వభౌమత్వాన్ని వదిలి మొగలులతో సత్సంబందాలు ఏర్పరచుకున్నారు. కొందరు రాజపుత్రులు మొగలులతో వివాహా సంబంధాలు ఏర్పరచుకున్నారు. చిత్తోడ్‌కు చెందిన సిసోడియా రాజపుత్రులు చాలాకాలం పాటు మొగలుల అధికారాన్ని గుర్తించలేదు. మొగలుల చేతితో ఓడిన రాజులను కూడా గౌరవించి  వారి భూభాగాల్ని మొగలులు తిరిగి అప్పగించేవారు. మొగలుల ముఖ్య ఉద్దేశ్యం ఓడించడమే కాని శత్రువులను అవమానించడం కాదు అనే సిద్దాంతం పాటించేవారు. రాజకీయ వ్యూహంలో భాగంగా మొగలుల స్థానిక రాజకుమార్తెలను వివాహమాడారు. జహంగీర్‌ తల్లి రాజుపుత్ర రాజైన అంబర్‌ (నేటి రాజస్థాన్‌) కాకుమార్తె. షాజహాన్‌ తల్లి రాజుపుత్రులైన జోథ్‌పూర్‌ యువరాణిగా ఉండేది. 

మొగలులు తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం పలు ప్రాంతాల నుండి ప్రజలను వివిధ ఉద్యోగాలలో నియమించారు. వీరిలో తురుష్కులు, ఇరానియన్‌లు , భారత ముస్లీంలు, అప్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, ఇతరులు ఉన్నారు. వీరందరికి ఉద్యోగాలను కల్పించి మన్సబ్‌దార్లుగా భర్తీ చేసుకోని సైనిక హోదా కల్పించారు. వీరంతా చక్రవర్తి ఆదీనంలో పనిచేసేవారు. మన్సబ్‌దారులు రాజు యొక్క భవంతిని, నిర్ధేశించిన ప్రాంతాన్ని పరిపాలించే విధంగా బాద్యతలు అప్పగించేవారు. కొత్త రాజ్యాలపై దండయాత్రలు, తిరుగుబాట్లను అణచివేసే బాద్యతలను అప్పగించేవారు. ఈ మన్సబ్‌దారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రాజు యొక్క నిర్ణయాల మేరకు పనిచేసేవారు. 

ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకొకసారి మన్సబ్‌దారులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు. దీంతో బలపడే అవకాశం లేకుండా చేసేవారు. మన్సబ్‌దారు నిర్ణీత సంఖ్యలో గుర్రపు రైతులను, అశ్వికదళాన్ని పెంచి పోషించే బాద్యతను కల్గి ఉండేవాడు. ప్రతి మన్సబ్‌దారు తన అశ్వికదళాన్ని సమీక్షించడానికి తీసుకువచ్చి వాటిని నమోదు చేయించి గుర్రాలకు ముద్రలను వేయించి జీతభత్యాలను పొందేవారు. 

ఒక మన్సబ్‌దారు కుమారుడు మన్సబ్‌దారు కాకుండా చర్యలు చేపట్టేవారు. మన్సబ్‌దారు మరణాంతరం అతని యొక్క యావత్‌ ఆస్తిని కూడా రాజు స్వాధీనం చేసుకునేవాడు. జాగీర్ల నుండి వచ్చే ఆదాయాల నుండి మన్సబ్‌దారులు వారీ జీతాలను తీసుకునేవారు. 

Also Read : అసఫ్జాహీ సామ్రాజ్యం 


జబ్త్‌ మరియు జమిందార్లు 

మొగల్‌ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై విధించే పన్ను రూపంలో లభించేది. అక్బర్‌ ఆర్థికమంత్రి అయిన తోడర్‌మల్లు 1570-1580 సంవత్సరాల మధ్యలో ఏ ప్రాంతం ఎంత వరకు పంటలు పండించడానికి అనువుగా ఉందో, ఏయే ప్రాంతాలలో ఏయే పంటలు పండిస్తారో వాటి ధరలు మీద సర్వేలను చేయించేవాడు. దీని ప్రకారం ఎంత పన్ను చెల్లించాలో నిర్ణయించేవారు. ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి, ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవల్సిన పన్నులను నిర్ణయించారు. ఈ రెవెన్యూ విధానాన్ని ‘‘జబ్త్‌’’ గా వ్యవహరించేవారు. చాలా ప్రాంతాలలో గ్రామ పెద్ద ద్వారా రైతులు పన్నులు చెల్లించేవారు. పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా సముఖంగా ఉన్న స్థానిక పెద్దలు, పలుకుబడి ఉన్న వారు జమీందార్లుగా వ్యవహరించేవారు. 


  • 1526లో జరిగిన పానిపట్‌ యుద్దంలో ఢిల్లీ సుల్తాన్‌ను ఓడించి బాబర్‌ మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 
  • అక్బర్‌ పరిపాలన కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, మత సహనంతో మొఘల్‌ సామ్రాజ్యం ఉన్నత స్థానానికి చేరుకుంది. 
  • భారతదేశంలోని ప్రఖ్యాతిచెందిన తాజ్‌మహల్‌ మరియు ఎర్రకోట వంటి అద్భుతమైన కట్టడాలు మొఘల్‌ సామ్రాజ్య కాలంలోనే నిర్మించారు. 
  • బలహీన నాయకత్వం, ఆర్థిక క్షీణత మరియు యూరోపియన్‌ వలసవాదం వల్ల 17 శతాబ్దం చివరలో మొఘల్‌ సామ్రాజ్యం క్షీణించింది. 
  • 1857 నాటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటీషువారు మొఘల్‌ సామ్రాజ్యాన్ని రద్దు చేశారు. 
  • వీరికాలంలో కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థిక మంత్రి), మీర్‌ భక్షీ (యుద్దమంత్రి), మీర్‌ ఇ సదర్‌ (ధానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖమంత్రి) ఉండేవారు. 
  • వీరికాలంలో సర్కారులు, పరగణాలు, గ్రామాలతో పాటు మహల్స్‌, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణాల అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్‌, ముఖద్దమ్‌ ఉద్యోగులు ఉండేవారు. 
మొఘల్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు
బాబర్‌ 1526-1530
హుమాయూన్‌ 1530-1556
అక్బర్‌ 1556-1605
జహంగీర్‌ 1605-1627
షాజహాన్‌ 1627-1658
ఔరంగజేబు 1658-1707
బహదూర్‌ షా 1707-1712
జహందర్‌ షా 1712-1713
ఫరూక్సియార్‌ 1713-1719
ముహమ్మద్‌ షా 1719-1748
అహ్మద్‌ షా బహదూర్‌ 1748-1754
అలంగీర్‌ -2 1754-1759
షాజహాన్‌ -3 1759-1760
షా ఆలం - 2 1760-1788
అక్బర్‌ - 2 1806-1837
బహదూర్‌ షా - 2 1837-1857

Post a Comment

0 Comments